బడి పిల్లలు భద్రం! | Telangana Announces Comprehensive Safety Measures for Schools | Sakshi
Sakshi News home page

బడి పిల్లలు భద్రం!

Nov 11 2026 1:44 AM | Updated on Nov 11 2026 1:44 AM

Telangana Announces Comprehensive Safety Measures for Schools

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సమగ్ర పాఠశాల భద్రతా విధానం

ప్రతి విద్యార్థికి అత్యున్నత రక్షణ కల్పనే ధ్యేయంగా సర్కారు అడుగులు 

అన్ని బడుల్లో ఏకరీతి ప్రమాణాలతో స్కూల్‌ సురక్ష క్లబ్‌ల ఏర్పాటు 

రంగంలోకి పోలీస్‌ శాఖ ‘టీజీ ఎస్‌4సీ’ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ 

పోక్సో, సైబర్, డ్రగ్స్, ట్రాఫిక్, విపత్తు సమస్యలపై ప్రత్యేక దృష్టి 

పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నాలుగు అంచెల నివేదికల వ్యవస్థ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి అత్యున్నత రక్షణ కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలీస్‌ శాఖ, విద్యాశాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా అత్యంత పటిష్టమైన ‘సమగ్ర పాఠశాల భద్రతా విధానం’త్వరలోనే అమల్లోకి రానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల బడుల్లో ఈ నూతన ప్రణాళికను అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. పిల్లలకు ఎలాంటి భయం లేని, రక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. 

సురక్ష క్లబ్‌ల ఏర్పాటు 
ఇప్పటివరకు పాఠశాలల్లో వేర్వేరుగా, సమన్వయం లేకుండా సాగుతున్న విభిన్న క్లబ్‌లను (బాలికా శిశు సాధికారత, కౌమార భద్రతా క్లబ్‌లు) రద్దు చేసి, వాటన్నింటినీ ఏకీకృతం చేస్తారు. అన్ని బడుల్లో ఏకరీతి ప్రమాణాలతో స్కూల్‌ సురక్ష క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సాంకేతికంగా పర్యవేక్షించడానికి పోలీస్‌ శాఖ ‘టీజీ ఎస్‌4సీ’ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ రంగంలోకి దిగనుంది.

ఇందులో ప్రోగ్రామ్‌ మేనేజర్, చైల్డ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్‌ వంటి 6 రకాల నిపుణుల పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సజావుగా సాగడానికి 2026–2027 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎంశ్రీ కార్యక్రమం నుంచి సుమారు రూ.2 కోట్ల నిధులను వెచి్చంచేందుకు ప్రతిపాదించారు. 

జీరో డిలే ప్రొటోకాల్‌.. 
పిల్లలపై లైంగిక వేధింపులు, తీవ్రమైన భద్రతా లోపాలు లేదా మాదకద్రవ్యాల రవాణా వంటి అత్యవసర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సాధారణ నివేదికల కోసం ఆగకుండా... పోలీస్, సంక్షేమ శాఖ, శిశు సంక్షేమ కమిటీలకు తక్షణమే సమాచారం అందించేలా జీరో డిలే ప్రొటోకాల్‌ను అమల్లోకి తెస్తున్నారు.

భద్రతా మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యే యాజమాన్యాలు, అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ఒకవేళ లోపాలు పునరావృతమైతే సదరు పాఠశాల గుర్తింపు, ఎన్‌ఓసీ అనుమతులను పూర్తిగా రద్దు చేస్తారు. విద్యార్థుల భద్రతను ప్రతి రోజూ పర్యవేక్షించడానికి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నాలుగంచెల నివేదికల వ్యవస్థ ఉంటుంది. 

భద్రత ఇలా.. 
1. బాలల రక్షణ: పోక్సో చట్టం, గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌లపై అవగాహన, లింగ సమానత్వం, రుతుస్రావ పరిశుభ్రత, మానసిక ఆరోగ్య మద్దతుపై దృష్టి పెడతారు. 
2. సైబర్‌ భద్రత: ఆన్‌లైన్‌ వేధింపులు, మోసాలు, డిజిటల్‌ ప్రైవసీ ఉల్లంఘనలు, సైబర్‌ వేధింపులు, బెదిరింపుల వంటి వాటికి అడ్డుకట్ట వేయడం, సోషల్‌ మీడియా నియంత్రణ ఉంటుంది. 

3. మాదకద్రవ్యాల నివారణ: క్యాంపస్‌లలో డ్రగ్స్, పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడం. 
4. విపత్తుల నిర్వహణ: పాఠశాల భవనాల భద్రత, హాస్టల్‌ సేఫ్టీ, అగ్నిమాపక ఆడిట్‌ నిర్వహించడం. 
5. రవాణా భద్రత: స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరిశీలనతో పాటు డ్రైవర్ల నేపథ్యం ఖచ్చితంగా తనిఖీ. 
6. ప్రత్యేక పిల్లల రక్షణ: దివ్యాంగ పిల్లల కోసం సులభతర మౌలిక వసతుల కల్పన.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement