యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి | Heavy Rainfall flood Alert Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి

Sep 27 2026 10:01 AM | Updated on Sep 27 2026 10:01 AM

Heavy Rainfall flood Alert Uttar Pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 48 గంటల్లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 15 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. పలు జిల్లాల్లో వరదలు, నీట మునిగిన ప్రాంతాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ–తూర్పు యూపీలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు యూపీతో పాటు మధ్య, తరాయ్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉందని తెలిపింది.

శనివారం ఒక్కరోజే రాష్ట్రంలోని 63 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో సాధారణం కంటే దాదాపు 19 రెట్లు అధిక వర్షం కురిసింది. లక్నోలో 21 గంటల్లో 125.8 మి.మీ., ఫతేగఢ్‌లో 224 మి.మీ., బాందాలో 227.6 మి.మీ., నాన్పారాలో 217 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, ఈదురుగాలులకు చెట్లు, మట్టి ఇళ్లు కూలడంతో పాటు 117 ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి. మురాదాబాద్‌లోని జిల్లా పశువైద్య ఆసుపత్రిలోకి సైతం వరదనీరు చేరింది.

ఆజంగఢ్, బలియా, గాజీపూర్, గోరఖ్‌పూర్, బస్తీ, సుల్తాన్‌పూర్, అయోధ్య, గోండా, హర్దోయ్, లక్నో, ఉన్నావ్, రాయ్‌బరేలీ, బారాబంకీ, అమేథీ, కౌశాంబీ, చిత్రకూట్ తదితర జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేపాల్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. మృతుల కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయిన వారికి, పంటలు నష్టపోయిన రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని, అత్యవసర సమస్యల కోసం 1912 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: Nepal: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement