ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్‌ కీలక ప్రకటన | Iran responds after Trump rejects Hormuz peace plan | Sakshi
Sakshi News home page

ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్‌ కీలక ప్రకటన

Sep 27 2026 8:10 AM | Updated on Sep 27 2026 8:17 AM

Iran responds after Trump rejects Hormuz peace plan

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ శాంతి ప్రతిపాదనను తిరస్కరించారన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ మరోసారి కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో నెలకొన్న వివాదానికి దౌత్యమే ఏకైక పరిష్కారమని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే తమ షరతులు నెరవేర్చాల్సిందేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చిచెప్పారు.

హార్ముజ్ జలసంధిని తెరవడానికి తమ షరతులు స్పష్టంగా ఉన్నాయని అరాఘ్చీ చెప్పుకొచ్చారు. తమ ప్రతిపాదనపై అమెరికా తిరస్కరణను మధ్యవర్తులు అధికారికంగా తమకు తెలియజేయలేదని చెప్పారు. మధ్యవర్తుల నుంచి తుది సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ వారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్ తన శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను వాషింగ్టన్‌కు చేరవేసింది. ఇందులో హార్ముజ్ జలసంధిని ఏడు రోజుల వ్యవధిలో తిరిగి తెరవడం, ప్రాంతీయంగా జరుగుతున్న పోరాటానికి విరామం ఇవ్వడం, ఆ తర్వాత విస్తృత చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయి.

అయితే ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు ట్రంప్ శనివారం వెల్లడించారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్లే వెంటనే హార్ముజ్‌ను తెరవడానికి ఒప్పందం కోరుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమంపై కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇచ్చింది. అమెరికా ప్రతిపాదనను అంగీకరించినా.. యురేనియం శుద్ధి చేసే హక్కుపై, అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం నుంచి తరలించడంపై తాము రాజీ పడబోమని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాత్రం అణు కార్యక్రమంతో పాటు ఇతర అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడుల నుంచి తమను తాము రక్షించుకుంటామని తెలిపారు.

ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం
హార్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ ఇంధన సరఫరాలపై ఆందోళనలను పెంచుతోంది. ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా చమురు రవాణా గణనీయంగా తగ్గినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ అంశంపై సౌదీ అరేబియాతోనూ చర్చలు జరిపింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్, దాని మిత్ర బలగాలు ప్రతిదాడులతో సమాధానం ఇస్తున్నాయి. దీంతో హార్ముజ్ అంశం కేవలం ఇరాన్-అమెరికా మధ్య వివాదంగా కాకుండా.. మొత్తం పశ్చిమాసియా ప్రాంతంపై ప్రభావం చూపే అంశంగా మారింది.

ఇదీ చదవండి: భారత్‌కు పాకిస్తాన్‌ సంచలన హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement