భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం? | At UN Russia backs Indias bid for permanent Security Council seat | Sakshi
Sakshi News home page

భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?

Sep 27 2026 7:24 AM | Updated on Sep 27 2026 7:24 AM

At UN Russia backs Indias bid for permanent Security Council seat

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మరోసారి బహిరంగంగా మద్దతు తెలిపింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. భద్రతామండలిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత్, బ్రెజిల్‌లను శాశ్వత సభ్యులుగా చేర్చాలన్న తమ మద్దతును స్పష్టం చేశారు. భద్రతామండలి సంస్కరణలు జరగాల్సిందేనని పేర్కొన్న లావ్రోవ్.. పాశ్చాత్య దేశాలకు మాత్రం అదనపు శాశ్వత స్థానాలు కేటాయించకూడదని అన్నారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడాన్ని రష్యా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఆ దేశాలు సైనికవాదం, పునరుద్ధరణవాదం వైపు వెళ్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భద్రతామండలిలో ప్రస్తుతం చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. వీటికి వీటో అధికారం ఉంది.

భద్రతామండలిలో ప్రస్తుతం శాశ్వత సభ్యత్వం లేని 10 దేశాలు రెండేళ్ల కాలానికి సభ్యులుగా కొనసాగుతున్నాయి. మండలి నిర్మాణంలో మార్పులు చేయాలంటే ఐరాస సర్వసభ్య సమావేశంలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఐదు శాశ్వత సభ్యదేశాల సమ్మతి కూడా తప్పనిసరి. దీంతో భద్రతామండలి విస్తరణ ప్రక్రియ అంత సులభం కాదని తెలుస్తోంది. భద్రతామండలిలో గ్లోబల్ సౌత్ దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని లావ్రోవ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. భారత్, బ్రెజిల్‌లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు రష్యాతో పాటు బ్రిక్స్ దేశాలు గతంలోనూ మద్దతు తెలిపాయి. న్యూఢిల్లీ ప్రకటనలోనూ భారత్, బ్రెజిల్‌కు ఐరాసలో మరింత కీలక పాత్ర ఉండాలన్న ఆకాంక్షకు మద్దతు ప్రకటించారు.

భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్.. భద్రతామండలి సంస్కరణల్లో జీ4, ఎల్69 కూటముల వైఖరికి తమ మద్దతు కొనసాగుతుందని, ప్రపంచ వ్యవహారాల్లో భారత్ నిర్మాణాత్మక పాత్రకు తగినట్లుగా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న భారత్ అభ్యర్థనకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. పోర్చుగల్ ప్రధాని లూయిస్ మోంటెనెగ్రో కూడా ఆఫ్రికా, బ్రెజిల్, భారత్‌కు శాశ్వత ప్రాతినిధ్యం కల్పించేలా మండలిని మరింత ప్రాతినిధ్యాత్మకంగా మార్చాలని కోరారు.

ఇదీ చదవండి: నాలుగు ముక్కలుకానున్న ఉత్తరప్రదేశ్‌.. రంగం సిద్ధం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement