రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడి ధ్వజం
ఐక్యరాజ్యసమితి: తమపై యుద్ధానికి రష్యా భారత్‌సహా 40 దేశాల పౌరులను ఉపయోగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిమ్మల్నీ యుద్ధంలోకి లాగకుండా జాగ్రత్తపడాలని బుధవారం 81వ ఐరాస సర్వసభ్య సమావేశాల్లో మాట్లాడుతూ ఆ దేశాలకు పిలుపునిచ్చారు. రష్యా సాగిస్తున్న ఈ క్రూరమైన యుద్ధంలో ఉత్తర కొరియా నుంచే కాకుండా పలు దేశాల వారిని యుద్ధ ఖైదీలుగా బంధిస్తున్నామని ఆయన చెప్పారు.
ఘానా, నేపాల్, తజకిస్తాన్, భారత్, యెమెన్, కెన్యా, జింబాబ్వే, క్యూబా, బెలారస్, సూడాన్, దక్షిణాఫ్రికా వంటి చాలా ఇతర దేశాల పౌరులున్నారని, అప్పుడప్పుడూ వీరిని స్వదేశాలకు పంపించాల్సిందిగా తమకు విజ్ఞప్తులు అందుతున్నాయని తెలిపారు. ఇతరదేశాల ప్రజలు చాలామంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ‘‘యుద్ధభూమిలో రష్యన్లు కాని 47 దేశాల ప్రజలున్నారు. రష్యా చేతిలో మోసపోయి, కుట్రకు గురై చనిపోతూండటం చూస్తున్నాం’’అన్నారు.
ఆయా దేశాల ప్రభుత్వాలు వీరిని కాపాడాలని, రష్యా పిచ్చితనానికి పౌరులను బలిచేయవద్దని కోరారు. రష్యాను ఆర్థికంగా దిగ్బంధించడం ద్వారా యుద్ధం ఆగిపోయేలా చేయాలని ఆయన కోరారు. యూక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన జెలెన్‌స్కీ రష్యాతో వ్యాపారాన్ని మరింత తగ్గించాలని కోరారు. తద్వారా రష్యా ఆదాయ వనరులు తగ్గుతాయన్నారు. రష్యా సైన్యంలో నియమితులైన భారతీయులు సుమారు 227 మంది ఉండవచ్చునని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ నెల మొదట్లో తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. వీరిలో 139 మంది విడుదలయ్యారని, సుమారు 51 మంది యుద్ధంలో మరణించినట్లూ సమాచారం ఉందని ఆయన తెలిపారు.


