చైనా వేగంగా విస్తరిస్తున్న అణ్వాయుధ సామర్థ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం డ్రాగన్ దేశంతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న అణు పరీక్షల నిషేధాన్ని బీజింగ్ పాటిస్తోందా? లేదా? అన్నదానిపై అమెరికాకు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి.
బహుపాక్షిక సమావేశాల సందర్భంగా ఈ చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. జెనీవా, న్యూయార్క్, మొరాకోలోని కాసాబ్లాంకాలో జరిగిన సమావేశాల చివర అమెరికా, చైనా ప్రతినిధులు ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. చైనా అత్యంత తక్కువ స్థాయి అణు పరీక్షలను రహస్యంగా నిర్వహించిందన్న ఆరోపణలను పరిష్కరించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు.
చైనా అణ్వాయుధ నిల్వలు, సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీజింగ్ అణు పరీక్షలపై అంతర్జాతీయంగా అమల్లో ఉన్న నిషేధాన్ని పాటిస్తోందా అనే ప్రశ్నలను అమెరికా లేవనెత్తుతోంది. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు బహిరంగంగా కాకుండా గోప్యంగా కొనసాగుతున్నాయి.
ఇంతకుముందు కూడా చైనా 2020లో అత్యంత తక్కువ స్థాయి అణు పరీక్ష నిర్వహించి ఉండొచ్చని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. చైనాలోని లోప్ నూర్ ప్రాంతంలో 2020 జూన్ 22న నమోదైన భూకంప తరహా ప్రకంపనలను అమెరికా అధికారులు దీనికి ఆధారంగా ప్రస్తావించారు. అయితే అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలు ఆ ప్రకంపనలకు అణు పరీక్షే కారణమని నిర్ధారించలేదు. చైనా కూడా రహస్య అణు పరీక్షలు నిర్వహించిందన్న ఆరోపణలను ఖండించింది.
ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య అణ్వాయుధ నియంత్రణ, వాణిజ్యం, సాంకేతికత, భద్రత వంటి పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రహస్య సంప్రదింపులు కీలకంగా మారాయి. రాబోయే చర్చల్లో చైనా అణు పరీక్షలపై అమెరికా చేసిన ఆరోపణలకు బీజింగ్ ఎలాంటి సమాధానం ఇస్తుందో, అణ్వాయుధ నియంత్రణపై ఇరు దేశాలు ఏదైనా ముందడుగు వేస్తాయో చూడాల్సి ఉంటుంది.


