అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు మీడియా సంస్థల జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. ఆ మీడియా సంస్థలను తక్షణమే అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ట్రంప్ విధించిన ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశం ఉందని జడ్జి ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.
సెప్టెంబర్ 18న ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈ సంస్థలు ‘‘ఫిక్షన్, అబద్ధాలు’’ ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.. వైట్‌హౌస్‌లోకి వాటి జర్నలిస్టులను అనుమతించబోమని ప్రకటించారు. ఆ తర్వాత ఆయా సంస్థలకు చెందిన రిపోర్టర్ల ప్రెస్ యాక్సెస్‌ను నిలిపివేశారు. ఈ వివాదం మధ్య వైట్‌హౌస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ టీవీ పూల్ కవరేజ్‌ను నిలిపివేసిన నేపథ్యంలో.. వైట్‌హౌస్ స్వయంగా ట్రంప్ టీవీ పేరుతో 24 గంటల స్ట్రీమింగ్ ఛానల్‌ను ప్రారంభించింది. యూట్యూబ్, వైట్‌హౌస్ వెబ్‌సైట్ ద్వారా ప్రసారమవుతున్న ఈ ఛానల్‌లో ట్రంప్ ప్రసంగాలు, గత కార్యక్రమాల వీడియోలు, ఆయన పాలనకు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది.
కోర్టును ఆశ్రయించిన మూడు సంస్థలు
ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ మీడియా సంస్థలు సంయుక్తంగా కోర్టును ఆశ్రయించాయి. తమపై విధించిన నిషేధం అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ హక్కులను, మీడియా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని వాదించాయి. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా యాక్సెస్ రద్దు చేశారని పేర్కొన్నాయి.
‘బ్యాన్’పై జడ్జి అభ్యంతరం
ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ.. వైట్‌హౌస్ అనుసరించిన విధానంపై సందేహాలు వ్యక్తం చేశారు. జర్నలిస్టుల యాక్సెస్‌ను రద్దు చేసే ముందు వారికి తగిన ప్రక్రియ, తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. తాజాగా ఇచ్చిన ఆదేశంలో మూడు మీడియా సంస్థల జర్నలిస్టులకు వైట్‌హౌస్ యాక్సెస్‌ను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ.. ట్రంప్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జాతీయ భద్రత పేరుతో సమర్థించిన ప్రభుత్వం
అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం వైట్‌హౌస్ యాక్సెస్ అనేది హక్కు కాదని, ఒక ప్రత్యేక సదుపాయమని వాదించింది. ఆయా మీడియా సంస్థల రిపోర్టింగ్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తోందని జస్టిస్ డిపార్ట్‌మెంట్ తరఫు న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు. ట్రంప్ కూడా ఆయా సంస్థల వార్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మీడియా–ట్రంప్ మధ్య ముదిరిన వివాదం
ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో మీడియా స్వేచ్ఛ, అధ్యక్షుడి అధికారాలపై పెద్ద చర్చ మొదలైంది. మూడు సంస్థలపై నిషేధానికి నిరసనగా ఇతర ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు కూడా వైట్‌హౌస్ ప్రెస్ పూల్ కవరేజీని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాల మీడియా కవరేజీపై ప్రభావం పడింది. అయితే తాజా కోర్టు ఆదేశంతో ట్రంప్–మీడియా వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలు వైట్‌హౌస్ మీడియా యాక్సెస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఫెడరల్ కోర్టు తీర్పును ట్రంప్ సర్కార్ పైకోర్టులో సవాల్ చేసే చాన్స్ ఉంది.


