కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. ఎమ్మెల్యే రాజీనామా | Karnataka Congress MLA Yeshwanthrayagouda Patil resign To Post | Sakshi
Sakshi News home page

కర్ణాటక కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. ఎమ్మెల్యే రాజీనామా

Sep 24 2026 7:44 AM | Updated on Sep 24 2026 7:44 AM

Karnataka Congress MLA Yeshwanthrayagouda Patil resign To Post

బెంగళూరు: కర్ణాటకలో అధికార పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసంతృప్తి కారణంగా ఎమ్మెల్యే యశ్వంత్‌ రాయగౌడ పాటిల్‌ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం, అసెంబ్లీ స్పీకర్‌ జీఎస్‌ పాటిల్‌కు తన రాజీనామా లేఖ పంపించారు. దీంతో, ఆయన రాజీనామా అంశంపై పొలిటికల్‌ చర్చ మొదలైంది.

కాగా, విజయపుర జిల్లా ఇండీ నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇండీ తాలూకా 2026-27 ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోందని పాటిల్‌ తన లేఖలో పేర్కొన్నారు. సీజన్‌ ప్రారంభంలో కొంత వర్షం పడటంతో రైతులు అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేశారని.. ఆ తర్వాత సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయని తెలిపారు. ప్రజలు, పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడిందని వివరించారు.

ఇండీని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆగస్టు 28న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని పాటిల్‌ ఆరోపించారు. విజయపుర జిల్లాలో మొత్తం 13 తాలూకాల్లో 11 ఇప్పటికే కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా.. ఇండీ, చడచన్‌ మాత్రమే మిగిలిపోయాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 188 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.

‘ఒత్తిడి తెచ్చేవారికే ప్రాధాన్యం’
అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు తన డిమాండ్లను సంయమనంతోనే వినిపించానని పాటిల్‌ తెలిపారు. అయితే తన అభిప్రాయాలు, నియోజకవర్గ ప్రజల సమస్యలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రభావవంతమైన వ్యక్తులు, ఒత్తిడి తెచ్చేవారికే ప్రాధాన్యం లభిస్తోందని.. తనలాంటి సౌమ్యంగా వ్యవహరించే నేతల న్యాయమైన డిమాండ్లను కూడా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నందునే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రెండోసారి రాజీనామా.. 
ఇదిలా ఉండగా.. పాటిల్‌ రాజీనామా చేయడం ఇది రెండోసారి. ఆగస్టు 3న డీకే శివకుమార్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో అప్పట్లోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యంతో ఆ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. తాజాగా తన నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించకపోవడాన్ని కారణంగా చూపుతూ మరోసారి రాజీనామా చేయడం కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: యూపీని నాలుగు భాగాలుగా చేస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement