ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని ఒకరు.. విభేదించిన మరొకరు
సరైన నిర్ణయం కోసం సీజేఐ దృష్టికి తీసుకెళ్లాలని ఏకాభిప్రాయం
ఇలాంటి అంశాలపై శాశ్వత విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు వినతి
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఈసీ, ఈసీల ఎంపిక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని మినహాయిస్తూ 2023లో తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను ఐదు రోజులపాటు విచారించింది. వీటిని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని అంగీకరించడానికి జస్టిస్ దత్తా నిరాకరించారు. ఇదే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో విభేదించారు.
అభిప్రాయ భేదాల కారణంగా.. తదుపరి విచారణ కోసం తగినంత మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పరిశీలనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాల్లో కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి శాశ్వత విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్నీ పరిశీలించాలని సీజేఐని ధర్మాసనం కోరింది. 2023 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
దీని ప్రకారం.. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన ఒక కమిటీ సిఫార్సు మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం నుంచి తప్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత 2023 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా షరతులు, పదవీకాలం) చట్టం–2023’తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సీఈసీ, ఈసీ ఎంపికలో సీజేఐ ప్రమేయం ఉండదు. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రిని చేరుస్తారు.
ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ దత్తా ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఇవి రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, వీటిని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని జస్టిస్ దత్తా తిరస్కరించారు. కానీ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో విభేదించారు. ‘‘ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా ఉండటమే కాకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కూడా కనిపించాలి.
రాజ్యాంగ వ్యవస్థ సమగ్రతను, పవిత్రతను కాపాడే సమిష్టి బాధ్యత మంత్రి మండలిదే కాబట్టి ఆర్టికల్ 75(3) ప్రకారం ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్న ఒక మంత్రి, ఒక సున్నితమైన రాజ్యాంగ పదవికి నియామకం విషయంలో ప్రభుత్వ అధినేత అభిప్రాయంతో విభేదిస్తారని ఆశించలేం’’అని జస్టిస్ దత్తా స్పష్టంచేశారు. 2023 నాటి చట్టాన్ని కేంద్రం సమర్థించుకుంది. భారత న్యాయవ్యవస్థలో కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారని గుర్తుచేసింది. దీనిపై జస్టిస్ దత్తా స్పందించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారంటూ తరచూ వినిపించే వాదనలో నిజం లేదన్నారు.
స్వార్థ శక్తులు ప్రేరేపిత కథనాల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని నూరిపోశాయని ఆక్షేపించారు. అంతేకాకుండా కొలీజియం తీర్మానాల ఆధారంగా ప్రభుత్వం చేసే పక్షపాత నియామకాలను ప్రస్తావించారు. ఈ పక్షపాత వైఖరి కారణంగా ఆ నియామకాలు పవిత్రతను కోల్పోతాయని అన్నారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక శాఖ నుంచి స్వతంత్రంగా ఉండటంతోపాటు స్వయంగా సమర్థతను కలిగి ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అంబేద్కర్ ఆశయం అస్పష్టంగా మారి, తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం.. రాజ్యాంగం స్వతంత్రంగా ఉండాలని ఉద్దేశించిన సంస్థలను తమ నియంత్రణలోకి తీసుకోవడం సౌకర్యంగా భావించిందని జస్టిస్ దత్తా చెప్పారు.
శాశ్వత ధర్మాసనం ఏర్పాటు చేయాలి
రాజ్యాంగపరమైన అంశాలున్న కేసులను విచారించడానికి ఐదుగురు న్యాయమూర్తులతో శాశ్వత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తిని కోరింది. విస్తృత ధర్మాసనాలకు పంపిన కేసుల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందని గుర్తుచేసింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఒక కేసు చాలాకాలం పాటు పెండింగ్‌లో ఉండటం సంబంధిత సంస్థ ప్రతిష్టకు మంచిది కాదని, కాబట్టి ఆత్మపరిశీలన అవసరమని వెల్లడించింది. గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని గుర్తుచేసింది. ఇది తాము కొత్తగా చెబుతున్న సంగతి కాదని.. బాధ్యతాయుతమైన పౌరులు పదేపదే ప్రస్తావిస్తున్నారని తెలియజేసింది. ప్రజల అభిప్రాయాన్ని తాము సమరి్థస్తున్నామని పే ర్కొంది. రాజ్యాంగపరమైన అంశాలను పరిష్కరించడం అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత అని తేల్చిచెప్పింది.


