విద్యార్థి సాహిల్ మరణంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
కొనసాగుతున్న విద్యార్థి అనుకూల నిరసనలు
ముంబై/న్యూఢిల్లీ: ఐఐటీ బాంబేలో రెండో ఏడాది బీ.టెక్ విద్యార్థి సాహిల్ వాకోడే బలవన్మరణ ఉదంతంలో ఇప్పటికే ముంబై నేరవిభాగ పోలీసులు దర్యాప్తు ఆరంభించగా కళాశాలలో అంతర్గతంగా ఈ ఘటన పూర్వపరాలను నిగ్గుతేల్చేందుకు ఐఐటీ బాంబే సిద్ధమైంది. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు పది మంది సభ్యులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కాలేజీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
సాహిల్‌ను ఆత్మహత్యకు పురిగొల్పినట్లు, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణను కాలేజీ యాజమాన్యం బుధవారం సెలవుపై పంపింది. పరిపాలనా వ్యవహారాల డీన్ పోస్ట్ నుంచి తొలగించినా ఆయన ఇంకా ప్రొఫెసర్ పోస్ట్‌లో కొనసాగడంపై విద్యార్థి సంఘాల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కాలేజీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాలేజీలో అంతర్గతంగా జరిగే విచారణ పారదర్శకంగా కొనసాగాలనే ఉద్దేశంతోనే ఆయనను సెలవు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉన్నతస్థాయి కమిటీ త్వరలోనే ప్రొఫెసర్ సూర్యనారాయణను ప్రశ్నించనుంది. అయితే విద్యార్థి మరణానికి కులం రంగు పులమడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన(ఎంఎన్‌ఎస్) పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తంచేశారు. అధికారం కోసం రాజకీయాలుచేసే వాళ్లకు కులం అనేది ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశంగా కన్పిస్తుంది.
ఈ కులం వలలో అమాయ విద్యార్థులు చిక్కుకోవద్దు. ఉద్యమాల పేరిట చదువులు, భవిష్యత్తు నాశనంచేసుకోవద్దు’’అని ఆయన హితవు పలికారు. దర్యాప్తు తర్వాత ఎవరు దోషులుగా తేలినా సరే చట్టప్రకారం శిక్షించాల్సిందేనని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్రసింగ్ సోలంకీ డిమాండ్‌చేశారు. అయితే పుకార్లను వ్యాప్తిచేయొద్దని అధికారిక ప్రకటనలకు మాత్రమే మీడియా, విద్యార్థులు, నేతలు, కాలేజీ కట్టుబడి ఉండాలని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ విభాగం స్పష్టంచేసింది.
ఆత్మహత్య ఘటన దర్యాప్తు, సాక్ష్యాధారాలపై పుకార్లు పుట్టిస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని హెచ్చరించింది. మరోవైపు క్యాంపస్ బయట వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) నేత, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మునిమనవడు సుజత్ అంబేడ్కర్ సారథ్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. క్యాంపస్‌లోకి వచ్చేందుకు ప్రయతి్నంచిన వీళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ఐదేళ్ల బీటెక్ బెటర్: మాజీ ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్
భారీ సిలబస్ ఒత్తిడితోనూ ఐఐటీల్లో విద్యార్థులు చదువును ఒత్తిడిగా భావించే ఆస్కారముందని, ఇందుకు పరిష్కారంగా ఐదేళ్ల బీ.టెక్ కోర్సును ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని మాజీ ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్, బిట్స్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ నాకు వ్యక్తిగతంగా తెలుసు.
అత్యుత్తమ అధ్యాపకుల్లో ఆయన ఒకరు’’అని అన్నారు. ‘‘ఐదేళ్ల బీ.టెక్ ఉత్తమం. కోచింగ్ సెంటర్లలో ఒకేతరహా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంలో రాటుదేలిన విద్యార్థులు తీరా ఐఐటీల్లో చేరాక సొంతంగా సిలబస్ ప్రిపరేషన్, ఎగ్జామ్‌కు సంసిద్ధతలో కొంతవరకు నిజంగానే తడబడతారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అద్భుత ర్యాంక్‌లతో ఐఐటీల్లో చేరిన వాళ్లు సైతం నా క్లాస్‌లో తడబడిన సందర్భాలున్నాయి. అందుకే ఐదేళ్ల బీ.టెక్ తెస్తే నెమ్మదిగా నేర్చుకునే వాళ్లకు ఇదెంతో సాయంగా ఉంటుంది’’అని ఆయన అన్నారు.


