సాహిల్‌ ప్రాణం తీసిందెవరు? | Sakshi Editorial On Suicide of IIT Bombay student Sahil Wakode | Sakshi
Sakshi News home page

సాహిల్‌ ప్రాణం తీసిందెవరు?

Sep 23 2026 12:55 AM | Updated on Sep 23 2026 12:55 AM

Sakshi Editorial On Suicide of IIT Bombay student Sahil Wakode

సవాళ్లు ఎదురైనప్పుడూ, సంక్షోభాలు తలుపుతట్టినప్పుడూ తగినవిధంగా స్పందిస్తేనే అవి పరిష్కారమవుతాయి. వాటిని ఎదుర్కొనడం చేతగానప్పుడు ఎన్ని తెలివితేటలుండి ఏం ప్రయోజనం? దేశంలో అత్యుత్తమ శ్రేణి ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో అగ్రభాగాన ఉండే బాంబే ఐఐటీలో ఈ నెల 18న దళిత విద్యార్థి సాహిల్‌ వాకొడే ఆత్మహత్యకు పాల్పడిన వైనం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఏడు నెలల వ్యవధిలో అక్కడ చోటు చేసుకున్న నాలుగో మరణమిది. అక్కడే కాదు... దేశవ్యాప్తంగా ఉండే ఉన్నత శ్రేణి విద్యాసంస్థలన్నిటిలోనూ ఇలాంటి విషాద ఉదంతాలు తరచు కనబడుతున్నాయి. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి, వీటిని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసి చాన్నాళ్లవుతోంది. చూడటానికి బలవన్మరణాలు మానసిక ఒత్తిళ్లలో, నిరాశా నిస్పృహల్లో కూరుకు పోయినవారి వ్యక్తిగత నిర్ణయాలుగా కనబడతాయి. కానీ ఆ విషాద నిర్ణయాల వెనక వ్యక్తుల, వ్యవస్థల, సమాజాల ప్రభావం ఉండి తీరుతుంది. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల వరకూ చూస్తే అక్కడ కులవివక్ష జాడ్యం ఉందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు సాహిల్‌ విషయంలోనూ గత మూడు నెలలుగా అదే జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. 

బాంబే ఐఐటీ సాహిల్‌ విషయంలో ప్రవర్తించిన తీరు ఆ ఆరోపణను బలపరిచేదిగా ఉంది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోగానే అతను పరీక్షలో చాట్‌ జీపీటీ ఉపయోగిస్తూ  పట్టుబడ్డాడని, కెరీర్‌పై దాని ప్రభావం ఏమీ ఉండబోదని నచ్చజెప్పారని, ఆ తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఒక సంతకంలేని ప్రకటన ద్వారా బాంబే ఐఐటీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత నాలిక కరుచుకుని దాన్ని ఉపసంహరించుకుంది. కాపీ చేశాడన్నది కేవలం ఒక ఆరోపణ. దానికదే తీర్పు కాదు. అది ‘క్రమశిక్షణ’ కూడా కానేరదు. ఏటా వేలమంది పట్టభద్రుల్ని రూపొందిస్తున్న ఉన్నతశ్రేణి సంస్థకు ఈ మాత్రం తెలియదనుకోవాలా? పైగా తనను తాను సమర్థించుకునే స్థితిలో లేనివారిపై, ఆరోపణలోని నిజానిజాలేమిటో నిర్ధారణ కాకుండా ఇలా ప్రకటించవచ్చా? బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఒక కేసులో అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 1970లో తీర్పునిస్తూ ఒక విద్యార్థికి నోటీసు అందజేయకుండా, తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా తీసుకునే ఎలాంటి చర్య అయినా సహజన్యాయం అనిపించుకోదని స్పష్టం చేసింది. విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. ఎవరైనా అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించారనుకుంటే చర్య తీసుకునే అధికారం విద్యా సంస్థలకుంటుంది. ఆరోపణల్ని విచారించటానికి కమిటీ ఏర్పాటు, విచారణ, అది తగిన చర్యకు సిఫార్సు చేయటం వంటివన్నీ జరగాలి. ఆ తర్వాతే ఏ చర్య అయినా. అంతేతప్ప కాపీ చేస్తున్నారనో, ఇంకేదో జరిగిందనో అవమానించి, సస్పెండ్‌ చేశామనటం తప్పుడు చర్య. సాహిల్‌ పట్ల ఎలా ప్రవర్తించారనేది ఎటూ విచారణలో తేలుతుంది. కానీ ఆ క్యాంపస్‌లో ఎప్పుడూ ‘తక్షణ న్యాయం’ అమలవుతుందని బాంబే ఐఐటీ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. తదుపరి సెమిస్టర్‌కు అనర్హత మొదలు హాస్టల్‌ నుంచి గెంటేయటం వరకూ అన్నింటా ఇదే తంతని వారి వాదన. 

ఇంతకూ సాహిల్‌ విషయంలో తొలుత విడుదల చేసిన ప్రకటన ఎవరిని కాపాడ టానికి? ఈ ఆత్మహత్య విషయంలో ఎటూ అలజడి రేగుతుందని, దాన్ని ఎదుర్కొనాలంటే ముందే ఇలాంటి ఆరోపణ చేయటం అవసరమని అనుకున్నవారెవరు? ఆత్మహత్య ఉదంతం జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చూడాలని మొన్న జనవరిలో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బాంబే ఐఐటీకి ఈ జ్ఞానం ఉండొద్దా? అధ్యాపక వర్గం తరఫున ప్రకటనలిచ్చినవారికైనా తెలియొద్దా? విద్యావరణం రూళ్లకర్ర మాదిరిగా ఉండ కూడదు. మూర్ఖత్వంతో నిండిపోకూడదు. నిరంకుశంగా కనబడకూడదు. అయినవాళ్ల ప్రేమకు దూరంగా ఉంటూ, చదువుపరంగా అనునిత్యం ఒత్తిళు ఎదుర్కొంటూ లక్ష్య సాధనకు తపించే టీనేజ్‌ పిల్లల విషయంలో ఉండాల్సింది సహానుభూతి, మానవీయత, భావోద్వేగపరమైన మద్దతు. ఇవన్నీ కొరవడటంవల్లే 2018–2023 మధ్య 103 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ అవాంఛనీయ ధోరణులు ఇంకా ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement