జనతంత్రం
అగ్నికి ఆజ్యం తోడైంది. ఎల్‌నినో వైపరీత్యానికి ప్రభుత్వ ఉదాసీనత జత కలిసింది. ఫలితంగా గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగనంత తీవ్ర కరువు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నది. ఎల్‌నినో మాత్రమే కాదు, ‘యెల్లో నినో’ కూడా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నదని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి గురువారం నాడు విమర్శించారు. 628 మండలాలు లోటు వర్షపాతం వల్ల కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయనీ,అందులో 332 మండలాలు తీవ్ర క్షామంలో చిక్కుకున్నాయనీ పక్కా సమాచారంతో ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 51 శాతం లోటు వర్షపాతంతో సీజన్ ముగిసిపోతున్నప్పటికీ కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని జగన్ నిల దీశారు. తక్షణమే కరువు మండలాల ప్రకటనతో పాటు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న మరో డజనుకు పైగా అంశాలపై ఉద్యమ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు.
జగన్ నుంచి ఉద్యమ పిలుపు వెలువడిన వెంటనే ప్రభుత్వంలో హడావిడి మొదలైంది. కరువు మండలాల జాబితా రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈరోజు (శని వారం) స్వయంగా సీఎం సమీక్షకు దిగారు. 513 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసు కొచ్చారు. 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కూడా చెప్పినట్టు సమాచారం. ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చా రట. ముందస్తు చర్యలు ఇప్పుడా? వేలాది ఎకరాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. అనేక ప్రాంతాల్లో ఎండిన పంటల్ని రైతులు ట్రాక్టర్లతో దున్నేశారు. ఏటా సాగయ్యే సగటు విస్తీర్ణంలో 20 లక్షల ఎకరాల కోతపడింది. అక్కడ విత్తనాలు కూడా పడలేదు. అందుకే ఇది కంటితుడుపు సమీక్ష. రైతాంగ ఉద్యమ హెచ్చరికకు జడిసి పెట్టుకున్న ఆదరాబాదరా సమావేశం.
నిజంగా దుర్భిక్ష పరిస్థితులపై ప్రభుత్వానికి సరైన అవగా హన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే పది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలోనే విస్తృతంగా చర్చించేవారు. అప్పటికే పరిస్థితి విషమిస్తున్నట్లు వార్తలు వస్తున్నా ఈ అంశానికి సమావేశంలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రధానంగా పొలిటికల్ గవర్నెన్స్ గురించే సాగింది. బ్యూరోక్ర టిక్ పరిపాలన కుదరదని, తమ రాజకీయ నిర్ణయాలకు పూర్తిగా సహకరించాలని, ప్రతిపక్షం చేసే విమర్శలను కూడా అధికా రులు తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదే శించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచే ఈ ధోరణి మొదలైనా ఇప్పుడు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నది. ఫలి తంగా బ్యూరోక్రసీలో క్షేత్రస్థాయి సమస్యలపై చొరవ మందగించింది. కరువు బారిన పడి అల్లాడుతున్న ప్రజానీకాన్ని గాలి కొదిలేశారు. రాజకీయ నాయకత్వం ట్రెజర్‌హంట్‌లో పోటీలు పడుతున్నది.
గతంలో కనీవిని ఎరుగని పరిణామాలను కూడా ఈ కరువు కాలంలో చూడవలసి వస్తున్నది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎక్కడా నీటిచుక్క లేక నెర్రెలు బారిన చెరువుల్లోనే వది లేస్తున్న వార్తలు, ఫొటోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తు న్నాయి. రాయలసీమ ప్రాంతం నుంచి ఈ సమాచారం ఎక్కు వగా వస్తున్నది. కోట్లాదిమంది ప్రజలు ఆచరించే ఉత్సవాల పట్ల కూడా ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్టు? ఇంకో నాలుగు రోజుల్లో నిమజ్జనాలు ముగుస్తాయి. పెద్ద సంఖ్యలో విగ్రహాలను నిమ జ్జనం చేయవలసి ఉంటుంది. ఉత్సవాలలో కళకళలాడే పాత కడప చెరువు నేడు మైదానాన్ని తలపిస్తున్నది. ఏలినవారు ఏ ప్రత్యామ్నాయాన్ని ఆలోచించారో తెలియదు.
వినాయక ఉత్సవాలపై మంత్రి లోకేశ్ బాబు ఈమధ్యన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ‘నిమజ్జనోత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతిలీయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. హోంమంత్రి, డీజీపీ ఆ వాహనాలకు అనుమతులు లభించేలా చర్యలు తీసుకోవాలని’ ఆయన ట్వీట్ చేశారు. కేబి నెట్‌లోని ఒక మంత్రి తన సహచర మంత్రికి ఏ హోదాతో ఆదేశా లిస్తారని కొందరు విద్యావంతులు దీనిపై స్పందించారు. ఇది పూర్తిగా వేరే విషయం. లోకేశ్ ట్వీట్‌కు హోంమంత్రి స్పందన చూద్దాం. మార్గదర్శకాలకు అనుగుణంగా డీజే వాహనాలకు అనుమతులివ్వాలని పోలీసులకు అదేశాలు జారీ చేశామని ఆమె చెప్పారు. హిందూధర్మ సంప్రదాయం నుంచి వైదొలగకుండా ఈ ఉత్సవాలు వినాయక చవితి స్ఫూర్తిని చాటి చెప్పాలని కూడా ఆమె ఆకాంక్షించారు.
ఈమధ్యకాలంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి పలువురు మంత్రులు, కూటమి నేతలు హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి సందర్భం ఉన్నా లేకపోయినా మాట్లాడుతున్న సంగతిని గమనిస్తున్నాము. అదే ఒరవడిలో హోంమంత్రి స్పందన కూడా ఉన్నది. ఇంతగా హిందూ ధర్మం గురించి మాట్లాడే కూటమి సర్కార్ వినాయక చవితి పండుగలో ఒక ముఖ్యమైన నిమజ్జన ఘట్టం గురించి ఎందుకు ముందస్తు చర్యలు చేపట్ట లేకపోయిందనేది ఇప్పుడు అర్థం కాని విషయం. కేవలం మెజారిటీ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ధర్మపన్నాలు వల్లిస్తున్నారనుకోవలసి వస్తున్నది. మనది సెక్యు లర్ రాజ్య వ్యవస్థ. హిందూ ధర్మమే కాదు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే ఏ మతానికి చెందిన ఉత్సవాలకైనా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం కనీస ధర్మం.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కు లను తరలించే స్థాయిలో ఒక నెల రోజుల పాటు (జూలై– ఆగస్టు) శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లున్నాయి. తుంగభద్రలో నీళ్లు లేకపోయినా ముచ్చుమర్రి పాయింట్ దగ్గర శ్రీశైలం నీళ్లను కేసీ కెనాల్‌లోకి మళ్లించుకోవచ్చు. నీళ్లున్న రోజుల్లో చేష్టలుడిగి కూర్చోకుండా ఉన్నట్లయితే కేసీ కెనాల్‌తో పాటు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల కింద కొన్ని చెరువులను నింపుకునే అవకాశం ఉండేదని సీమవాసులు విమర్శిస్తున్నారు. అలా చేసి ఉన్నట్లయితే వినాయక నిమజ్జనా నికి నీళ్లు లేని ఈ దుఃస్థితి రాయలసీమకు వచ్చి ఉండేది కాదు. ఒక్క నిమజ్జనం విషయమే కాదు. ఈ క్షామానికి సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు పల్లెల్లో చాలా కనిపిస్తున్నాయి. ఒకనాడు నిండు కుండల్లా తొణికిసలాడిన బావుల్లోకి తొంగి చూస్తే కన్నీటి చుక్కలు రాలాల్సిందే తప్ప, బావిలో నీటి చెమ్మ మాత్రం కనిపించడం లేదట.
నీరెండిన చెరువుల్లో కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన చేపలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ధాన్యం దిగు బడి ఎన్నడూ ఎరుగని కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. వరి, వేరుశనగ, పత్తి చేలను కలియ దున్నడమే కాదు, రాయలసీమలో అక్కడక్కడా పండ్ల తోటలను నరికేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సన్న రకాల ధాన్యాన్ని పండించే ప్రాంతాలన్నీ కరువుపోటుకు గురయ్యాయి. ఫలితంగా రానున్న రోజుల్లో కిలో బియ్యం ధర వంద రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదనే మాటలు వినబడు తున్నాయి. బాపట్ల జిల్లాలో సన్న ధాన్యం పండించే ఒక రైతు నారు కొనడానికి 3 వేలు, నారు పీకడానికి 3 వేలు, నాట్లు వేయడానికి 4 వేలు... మొత్తం 10 వేలు ఖర్చు పెట్టాడు. కనీసం ఒక్క తడినైనా ఇవ్వడానికి గంటకు 350 రూపాయల చొప్పున ఇంజన్, పైపులను అద్దెకు తెచ్చుకున్నాడు. కరెంటు సరిగ్గా లేక పది గంటలు పారించడానికి రెండు రోజులు పట్టింది. 3,500 ఒక్క తడికే ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆ రైతు వాపోయాడు.
ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో సాగుభూములు మైదనాల్లా కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో బీళ్ళను తలపిస్తున్న చేలు దర్శనమిస్తున్నాయి. ఖరీప్ సాధారణ సాగు 77 లక్షల ఎకరాలకుగానూ ఈసారి 56 లక్షల ఎకరాల్లోనే విత్తనాలు పడ్డాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 35 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోవడమో, ఎండిపోయే స్థితికి చేరుకోవడమో జరిగింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఈ సమస్యపై సమీక్ష జరిపారు. అదీ ప్రతిపక్ష నేత హెచ్చరించిన తర్వాత. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎటు వంటి కార్యాచరణ రూపొందిస్తుందో, రైతాంగాన్ని ఎలా ఆదుకుంటుందో చూడాలి.
సమీక్షలో భాగంగా రైతులను ప్రకృతి సేద్యంవైపు ప్రోత్స హించాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారట. ప్రకృతి సేద్యం గోవు కేంద్రకంగా సాగుతుంది. మరి గోవుల గ్రాసం సంగతి? పచ్చిగడ్డి చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు. ట్రాక్టర్ పన్నెండు వేలుండే ఎండుగడ్డి కొన్ని ప్రాంతాల్లో పాతిక వేలు పలుకుతున్నదట. పశుగ్రాసం సమకూర్చలేకనే మూగ జీవాల్ని కొందరు రైతులు తెగనమ్ముకుంటున్నారు. గ్రాసం సంగతే కాదు, మెట్ట ప్రాంతాల్లో కొన్నిచోట్ల పశువుల దాహం తీర్చే దారి కూడా కనిపించడం లేదు. ఈ కరువు ఫలితంగా పాల దిగుబడి కూడా బాగా పడిపోయింది. ప్రైవేట్ డెయిరీల వాళ్లు చైనా పాలపొడిని దిగుమతి చేసుకొని, దాంతో తయారు చేసిన పాలను మార్కెట్లో విక్రయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
పాడి–పంటల పరిస్థితి ఒక ఎత్తయితే ప్రజల తాగునీటి ఎద్దడి మరో ఎత్తు. విశాఖ నగరంలో ఇప్పటికే నీటి ఎద్దడి అదుపు తప్పింది. ప్రజలు, పరిశ్రమల అవసరాలకు కలిసి రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల నీరు నగరానికి అవసరం. ఇప్పుడు సరఫరా అవుతున్నవి 88 మిలియన్ గ్యాలన్లు. నీటి కటకటతో ప్రజలు ఇప్పటికే రోడ్లమీదికి వస్తున్నారు. రిజర్వా యర్లను ముట్టడిస్తున్నారు. విశాఖ నీటి పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పింది. ముఖ్యమంత్రి శనివారం నాడు ఒక సభలో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాల్వ ద్వారా విడుదల చేసిన నీళ్లు అనకాపల్లి దాకా వచ్చాయని, రేపోమాపో విశాఖ చేరుకుంటాయని చెప్పారు. రేపటిదాకా ఎదురుచూద్దాం. అనంతరం అధికారులతో విశాఖ నీటి పరిస్థితిపై సమీక్ష జరిపి, ఈ విషయంపై ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళాలనీ, ఏలేరు సహా మిగిలిన రిజర్వాయర్లలో పూడిక తీయించాలనీ ఉపదేశించారు. వారెవ్వా... పొద్దున్నే లేచి వీధి నల్లాల దగ్గర బిందెడు నీళ్లకోసం ఎదురుచూస్తున్న విశాఖ ప్రజలారా పూడికలు తీసిందాకా వేచి ఉండండి!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


