ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారం అత్యంత ముఖ్యం. జీవులు ప్రాణాలు నిలుపుకోవ డానికి ఆహారం అవసరం. సరైన ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారం మితిమీరినప్పుడు, ఆహారంలో శుచి శుభ్రతలు లోపించినప్పుడు ఆరోగ్యం వికటించి నానా వ్యాధులూ కలుగుతాయి. ‘ఆహార సంభవో వస్తుః రోగాస్త్వాహార సంభవాః’ అని మన తొలి ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహిత’ చెబుతోంది. ఆరోగ్యానికైనా, అనారోగ్యానికైనా ఆహారమే మూలమనే అవగాహన మనవాళ్లకు చరకుడి కాలం నుంచే ఉండేది. దాదాపు అదే కాలంలో పాశ్చాత్య ప్రపంచంలోనూ ఆహారంపై ఈ అవగాహ ఉండేది. ‘మనం బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకడం కాదు’ అని రోమన్ తత్త్వవేత్త సిసిరో చెప్పాడు. ఆరోగ్య స్పృహతో ఆహారం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, జిహ్వచాపల్యం మనిషికి గల నానా బలహీనతల్లో మొదటి వరుసలో ఉంటుంది. జిహ్వచపలురను తిండిపోతులుగా జనాలు ఆడిపోసుకుంటారు గాని, వారు మాత్రం తమను తాము భోజనప్రియులుగా ప్రకటించుకుంటూ ఉంటారు. సుష్టుగా షడ్రసోపేతమైన భోజనాన్ని ఆరగించడాన్ని భోజనప్రియులు ‘ఉదరపూజ’గా అభివర్ణి స్తారు. ‘పొట్టతో వాదించడం చాలా కష్టం. దానికి చెవులు ఉండవు’ అని గ్రీకు తత్త్వవేత్త ప్లూటార్క్ భోజనప్రియత్వాన్ని గురించే చమత్కరించాడు.
నాగరికతలకు మునుపు మనుషులు కూడా మిగిలిన జంతుజాలం మాదిరిగానే దొరికినదేదో తింటూ బతికేవారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికతలతో పాటు పాకకళ అభివృద్ధి చెందింది. పాకకళతో పాటు రుచులు మరిగిన నోటికి జిహ్వచాపల్యం, భోజన ప్రియత్వం పెరుగుతూ వచ్చాయి. ఆరోగ్యానికైనా, అనారోగ్యానికైనా ఆహారమే మూల మనే సంగతి మనుషులకు అనుభవపూర్వంగా తెలిసివచ్చింది. ఆహార మహిమ బోధ పడిన తర్వాత ఆయుర్వేదం సహా రకరకాల ప్రాచీన వైద్యవిధానాలు అభివృద్ధి చెందాయి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికీ ఒక ఆహార సంస్కృతి ఉంటుంది. ఆహార సంస్కృతి ఆ ప్రాంత అస్తిత్వంలో అవిభాజ్య భాగంగా ఉంటుంది. అందుకే ప్రపంచంలోని ఏ భాషకు చెందిన సాహిత్యంలోనైనా ఆహార వర్ణన కనిపిస్తుంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి మన ఆహార వైవిధ్యాన్ని గ్రంథస్థం చేసిన పూర్వకవులలో శ్రీనాథుడు అగ్రగణ్యుడు. ‘శృంగార నైషధం’లో శ్రీనాథుడు ఎన్నో వంటకాలను వర్ణించాడు. వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రాసిన చాటువుల్లోనూ శ్రీనాథుడు ఆ ప్రాంతాల్లోని ఆహార వైవిధ్యాన్ని వర్ణించాడు. జిహ్వకు హితవైన వాటిని పొగిడాడు, నోటికి వెగటైన వాటిని వెటకరించాడు. తెలుగు కవులలో అన్నమాచార్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన వంటివారు కూడా తమ కవిత్వంలో ఆహార వైవిధ్యాన్ని, వైభవాన్ని కళ్లకు కట్టారు.
భారతీయుల తొలి పాకశాస్త్ర గ్రంథం ‘పాకదర్పణం’. దీని అసలు గ్రంథకర్త ఎవరో తెలీదు గాని, కర్తృత్వాన్ని పురాణ పురుషుడైన నల మహారాజుకు ఆపాదించారు. ‘భుజ్యతే యేన యత్నేన/ తస్యారోగ్యం భవేద్ధ్రువమ్/ వాతజం పిత్తజం రోగం/ శ్లేష్మజం హన్తి సర్వదా’ అని– అంటే, ఇందులో వివరించిన ఆహార పదార్థాలను భుజించేవారికి వాత పిత్త కఫ జనిత రోగాలన్నీ నశిస్తాయని ‘పాకదర్పణం’ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ‘పాకదర్పణం’ కేవలం వంటల పుస్తకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్ర గ్రంథం కూడా! ఆహార పదార్థాల్లోని షడ్రుచుల గురించి; భక్ష్య భోజ్య లేహ్య చోష్య పేయాది పంచభక్ష్యాల గురించి; అష్టవిధ ఆహార దోషాల గురించి; వంటచేసే పాచకునికి ఉండ వలసిన లక్షణాల గురించి; రుతువులకు అనుగుణంగా తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి విపులంగా వర్ణించిన గ్రంథమిది. ఆనాటి జనాలు ఆరోగ్యసూత్రాలను పాటిస్తూనే ఆహారాన్ని ఆస్వాదించేవారు. ఆహారకల్తీ బెడద ఉండేది కాదు. ఈనాటి జనాల్లో ఆరోగ్య స్పృహ పెరిగినా, బయట దొరికే ఆహార పదార్థాల్లో ఏవి కల్తీవో, ఏవి మంచివో గుర్తించలేని పరిస్థితి ఉంది. ప్యాకెట్లలో దొరికే ఆహార పదార్థాలలో ఆరోగ్యానికి చేటు కలిగించే చక్కెర, ఉప్పు, కొవ్వులు వంటి పదార్థాలు ఏమేరకు వాడుతున్నారో తెలియజెప్పే హెచ్చరిక లేబుల్స్‌ను తప్పనిసరిగా ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆహార తయారీ సంస్థలను ఆదేశించాల్సిన దుఃస్థితి దాపురించింది.


