ఇది స్వయంకృతం! | Sakshi Editorial On European countries | Sakshi
Sakshi News home page

ఇది స్వయంకృతం!

Sep 11 2026 1:27 AM | Updated on Sep 11 2026 1:27 AM

Sakshi Editorial On European countries

జర్మనీ పాలకపక్షం క్రిస్టియన్‌ డెమాక్రటిక్‌ యూనియన్‌(సీడీయూ) అధినేత, చాన్స్‌లర్‌ ఫ్రెడెరిక్‌ మెర్జ్‌కు ఇది దుర్వార్త. ఆయనకే కాదు... దశాబ్దాలుగా జర్మనీని ఏలిన మధ్యేవాద, వామపక్షాలకు సైతం మింగుడుపడని విషయం. ఆ మాటకొస్తే యూరప్‌ ఖండమంతా ‘కింకర్తవ్యమ’ంటూ కలవరపడుతోంది. ఉన్నట్టుండి సంభవించిన ఈ ‘రాజకీయ భూకంపాన్ని’ జీర్ణించుకోలేకపోతోంది. తూర్పు జర్మనీ ప్రాంతంలోని సాక్సోనీ– అన్‌హల్ట్‌ రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర మితవాద పక్షం ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ (ఏఎఫ్‌డీ) సాధించిన విజయమే వీరందరికీ నిద్రలేని రాత్రులు మిగిల్చింది. జర్మనీలోని 16 రాష్ట్రాల్లో సాక్సోనీ–అన్‌హల్ట్‌ ఒకటి. దాదాపు 21 లక్షల 36 వేల జనాభాగల ఈ రాష్ట్రంలో ఏఎఫ్‌డీ  ఇతరచోట్లకన్నా బలంగా ఉందని అందరూ భావించినా... 83 స్థానాలున్న పార్లమెంటులో 39 స్థానాలు, 43.8 శాతం ఓట్లు సాధించి మెజారిటీ పక్షంగా అవతరిస్తుందని ఊహించలేదు. అక్కడి ప్రస్తుత పాలకపక్షం మధ్యేవాద మితవాద సీడీయూ రెండో స్థానంలోకి పోవటమే కాదు, దాని ఓట్ల శాతం 17.2కి పడిపోయింది. మిగిలిన తొమ్మిది పార్టీల తీరెలావుందో చెప్పనవసరం లేదు.

రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలో తీవ్ర మితవాద పక్షాలు నామమాత్రంగా ఒకటి రెండు సీట్లు గెల్చు కోవటం తప్ప ఎప్పుడూ అధికారం అంచులవరకూ రాలేదు. ఇప్పుడైనా కనీస మెజారిటీకి మూడు తక్కువొచ్చిన ఏఎఫ్‌డీని అధికారంలోకి రానిస్తారా అనే సంశయం అందరిలో ఉంది. చేతులు కలిపేందుకు వేరే పార్టీలు ముందుకు రాకున్నా, కొందరు ఎంపీలు ఫిరాయించే అవకాశం కనబడుతోంది. అన్ని పక్షాలూ అంటరాని పార్టీగా పరిగణించిన ఏఎఫ్‌డీ కొన్నేళ్లుగా జర్మనీలో తన ఉనికి చాటుకుంటోంది. కానీ సాక్సోనీ– అన్‌హల్ట్‌లో అది వేగంగా ఎదగటాన్ని అందరూ గుర్తించారు. వలసలను వ్యతిరేకించటం మొదలుకొని అనేక అంశాల్లో దూకుడుగా పోతున్న ఆ పార్టీని జర్మనీ నిఘా విభాగం ‘తీవ్ర మితవాద పక్షం’గా నిర్ధారించింది. పది రోజుల్లో మెక్లిన్‌బర్గ్‌ పొమెరేనియా రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో... మరో మూడేళ్లలో జరిగే జాతీయ ఎన్నికల నాటికి ఏమవుతుందోనని వేరే పార్టీలు వణుకుతున్నాయి. 

ఏఎఫ్‌డీ విజయానికి ఇతర పార్టీలు తమను తామే నిందించుకోవాలి. దశాబ్దాలుగా దేశాన్నేలినా జనం మౌలిక సమస్యల్ని పరిష్కరించటంలో, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో అవన్నీ విఫలమయ్యాయి. వెల్లువలా వచ్చిపడే వలసలను నివారించలేకపోయాయి. గతంలో జర్మన్‌ డెమాక్రటిక్‌ రిపబ్లిక్‌ (జీడీఆర్‌)గా వామపక్షాల పాలనలో ఉన్న తూర్పు ప్రాంతం... పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే అన్నివిధాలా వెనకబడి వుంది. అందువల్ల అక్కడి సమస్యలు మరిన్ని రెట్లు అధికం. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం తెచ్చిన అనిశ్చితి వీటికి అదనం. రష్యాతో అనవసర వివాదం తెచ్చుకోకూడదన్నది ఏఎఫ్‌డీ అభిప్రాయం. ఈసారి ముమ్మరంగా పోలింగ్‌ జరగటం, ఏఎఫ్‌డీ విజయం దీని పర్యవసానమే. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఏఎఫ్‌డీ సామాజిక మాధ్యమాల్లో చురుకు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడును అన్నివిధాలా పుణికిపుచ్చుకుంది. సీడీయూనూ, ఇతర పక్షాలనూ విమర్శలతో చీల్చిచెండాడుతుంటే అటు నోట మాటలేదు.

ఇన్నాళ్లూ అమెరికా అడుగుజాడల్లో నడిచి, ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అది సాగించిన వృథా యుద్ధాల్లో పాలుపంచుకుని ఇతర యూరప్‌ దేశాలతోపాటు జర్మనీ కూడా ఆర్థికంగా కుంగిపోయింది. ఆ యుద్ధాలు తెచ్చిన సంక్షోభంతోనే పలు ముస్లిం దేశాలనుంచి వలసలు అధికమయ్యాయి. అమెరికా సలహాతో యూరప్‌ దేశాలు ఉక్రెయిన్‌ను ఎగదోయకుంటే రష్యాతో లడాయి ఉండేది కాదు. సాక్సోనీ–అన్‌హల్ట్‌ ఫలితం గమనిస్తే మెజారిటీ ప్రజలు ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారనీ, అధికార సీడీయూ విధానాలపై అసంతృప్తి చెందారనీ అర్థమవుతుంది. అయితే వేరే దేశాల్లోని తీవ్ర మితవాద పక్షాల్లాగే ఏఎఫ్‌డీ కూడా పర్యావరణ విధ్వంసాన్ని అబద్ధమంటుంది. ఎల్‌జీబీటీక్యూ హక్కులకు ఆ పార్టీ పూర్తి వ్యతిరేకం. వలసలు సరేసరి. జర్మన్లకు మాత్రమే దేశం సొంతమనీ, అన్యులను రానీయొద్దనీ దాని నినాదం. నాజీ పాలనలో విద్వేషాన్నీ, మారణహోమాల్నీ చూసిన జర్మనీలో తిరిగి ఆ మాదిరి పార్టీ అందలం ఎక్కే స్థితి ఏర్పడటానికి కారణమేమిటో ఆ దేశంతోపాటు ఫ్రాన్స్, స్పెయిన్‌ వగైరా యూరప్‌ దేశాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement