నిజరూప పట దర్శనం! | Sakshi Editorial On New World Map | Sakshi
Sakshi News home page

నిజరూప పట దర్శనం!

Sep 8 2026 1:16 AM | Updated on Sep 8 2026 1:16 AM

Sakshi Editorial On New World Map

మాటలు కావొచ్చు, చేతలు కావొచ్చు– ఏవీ శూన్యంనుంచి ఊడిపడవు. అనుద్దేశపూర్వకంగా, యథాలాపంగా ఏవీ ఉండవు. వాటిని ఉపయోగించేవారికి ఆ సంగతి తెలియొచ్చు... తెలియకపోవచ్చు. ఒక్కోసారి బాధితులకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ వివక్షను ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవటం సంస్కారం. ఈ విషయంలో వ్యక్తుల్ని కొంతవరకూ క్షమించవచ్చు. కానీ ప్రపంచ దేశాల సారథి ఐక్యరాజ్యసమితిని క్షమించగలమా? ప్రపంచ పటంలో మా ఖండాన్ని చిన్నబుచ్చుతున్నారని ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఎత్తిచూపుతున్నాయి. అయినా దాన్ని సరిదిద్దుకోవటానికి దీర్ఘకాలం పట్టింది. ఎట్టకేలకు మొన్న శుక్రవారం దాన్ని సవరించుకుంది. ఏకంగా 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఒటేస్తే, ఎప్పట్లానే అమెరికా ఉలిపికట్టె ధోరణి ప్రదర్శించింది. ఎప్పుడో పదహారో శతాబ్దంనాటి మాట. భౌగోళిక పటాల రూపకర్త గెరార్డస్‌ మెర్కేటర్‌ తొలిసారి 1569లో ప్రపంచ పటాన్ని రూపొందించాడు. 

దక్షిణార్ధ గోళ దేశాలను, ముఖ్యంగా భూమధ్య రేఖ సమీప దేశాలను వాటి వాస్తవ పరిమాణంకన్నా తక్కువగా చూపాడాయన. అప్పటికున్న పరిజ్ఞానం పరిమితుల్లో అలా చేశాడని సరిపెట్టుకోవటానికి లేదు. అదే నిజమైతే ఉత్తరార్ధ గోళ దేశాలనూ, ధ్రువాలకు సమీపంలో ఉన్నవాటినీ పెంచి ఎలా చూపగలిగాడు? ఏమైతేనేం... ప్రపంచపటం ఇన్నాళ్లకు సక్రమమైంది. ఖండాలను వాటి నిష్పత్తికి అనుగుణమైన వైశాల్యాల్లో రూపొందించారు. కానీ ఆ క్రమంలో మన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను ఆ పటం చైనా, పాకిస్తాన్‌లకు ‘పంచిపెట్టింది’. మన విదేశాంగ శాఖ చెప్పినట్టు ఇదేమీ దేశాల హద్దుల్ని అధికారికంగా నిర్ధారించేది కాకపోవచ్చు. కానీ ఒక తప్పును సరిదిద్దుకునే క్రమంలో కొత్త తప్పుల్ని చేయరాదన్న ఇంగిత జ్ఞానం లోపించింది. అమెరికాలో కొంత భూభాగాన్ని వేరేవాళ్ల ఖాతాలో వేసి ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఊరుకునేవారా? 

అవతలివారిపై ఆధిక్యతాభావం మనిషి నరానరాల్లోనూ వ్యాపించిన జాడ్యం. దీనికి భౌగోళిక హద్దులేమీ లేవు. అది జాత్యహంకారంగా, వర్ణవివక్షగా, ఆర్థికంగా అధికులమనే భావనగా వ్యక్తం కావటం ఎవరికీ తెలియంది కాదు. కులాన్నిబట్టి, మతాన్నిబట్టి మేం అధికులం, అన్యులు అల్పులన్న భావన ప్రబలంగా ఉండటం మన అనుభవంలో ఉన్నదే. తెల్లతోలు ఉన్నవాళ్లు అసాధారణ మానవులు, మిగిలినవాళ్లంతా అల్పులనే భావన పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ పోలేదు. హిట్లర్‌ హయాంలో యూదుల్ని జర్మనీ వెంటాడి, వేటాడి హతమార్చటం వెనుకా... ఎనిమిది దశాబ్దాలపైగా పాలస్తీనాలో మారణహోమాన్ని సాగిస్తున్న అమానుష ఇజ్రాయెల్‌ వెనకా ఈ జాడ్యం తాలూకు ఛాయలే కనబడతాయి. 

అమెరికాలో కనబడే శ్వేతజాతి అహంకారం కూడా ఈ బాపతే. మనిషి అంతరాంతరాల్లో ఇలాంటివి గూడు కట్టుకున్నప్పుడు వారి వ్యవహార శైలిలో అది ప్రతిబింబించక మానదు. ఒక ప్రాంత భౌగోళిక వైశాల్యం ఎంతో చెప్పే పటాలు చూడటానికి అన్నిటికీ అతీతంగా, అలీనంగా కనబడతాయి. కానీ పటాల రూపకల్పనలో చోటుచేసుకునే రాజకీయాల గురించి 2020లో కార్నెల్‌ వర్సిటీ అధ్యాపకురాలు క్రిస్టిన్‌ లూయెన్‌బెర్గర్‌ చాలా సంగతులే చెప్పారు. దృగ్గోచరమయ్యే రాజకీయాలతో పాటు, ప్రచ్ఛన్నంగా, గుట్టుగా ఉండిపోయే రాజకీయాలు కూడా ఈ పటాల రూపకల్పనలో ఉంటాయని ఆమె అభిప్రాయం. ప్రతి పటమూ చూపవల్సినంతగా చూపుతూనే, దాచాల్సింది దాస్తుందనీ, నిర్దిష్ట సమూహం కోసమే ఇదంతా జరుగుతుందనీ క్రిస్టిన్‌ అంటారు. 

గుండ్రంగా ఉండే భూమిని చదునైన కాగితంపై చూపితే కొంత వక్రీకరణ ఎలాగూ తప్పదు. కానీ గ్రీన్‌ల్యాండ్‌ కన్నా 14 రెట్లు పెద్దదైన ఆఫ్రికా... దాని ముందు చిన్నబోవట మేమిటి? యూరప్, అమెరికాలు కూడా తమ వాస్తవ విస్తీర్ణంకన్నా అధికంగా కనబడ తాయెందుకు? ఆఫ్రికాతోపాటు దక్షిణ అమెరికా, భారత్‌లు చిన్నగా ఉంటాయి. కాగితాల్లో తప్పుడు గీతలు గీసి అధికులమనుకోవటం... తరగతి గదుల్లో రూపుదిద్దుకునే తరాలకు అజ్ఞానాన్ని బట్వాడా చేయటం సిగ్గుచేటు కాదా? సమితికి ఇంతకన్నా ప్రాధాన్యం గలవి చాలా ఉన్నాయని ట్రంప్‌ ఉవాచ. అందుకే తీర్మానాన్ని వ్యతిరేకించారట. నిజమే... ప్రాధాన్యం గలవి ఇంకా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా తేలిస్తే అమెరికా వంచన మరింత తేటతెల్లమవుతుంది! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement