breaking news
Geographical borders
-
నిజరూప పట దర్శనం!
మాటలు కావొచ్చు, చేతలు కావొచ్చు– ఏవీ శూన్యంనుంచి ఊడిపడవు. అనుద్దేశపూర్వకంగా, యథాలాపంగా ఏవీ ఉండవు. వాటిని ఉపయోగించేవారికి ఆ సంగతి తెలియొచ్చు... తెలియకపోవచ్చు. ఒక్కోసారి బాధితులకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ వివక్షను ఎత్తిచూపినప్పుడు సరిదిద్దుకోవటం సంస్కారం. ఈ విషయంలో వ్యక్తుల్ని కొంతవరకూ క్షమించవచ్చు. కానీ ప్రపంచ దేశాల సారథి ఐక్యరాజ్యసమితిని క్షమించగలమా? ప్రపంచ పటంలో మా ఖండాన్ని చిన్నబుచ్చుతున్నారని ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఎత్తిచూపుతున్నాయి. అయినా దాన్ని సరిదిద్దుకోవటానికి దీర్ఘకాలం పట్టింది. ఎట్టకేలకు మొన్న శుక్రవారం దాన్ని సవరించుకుంది. ఏకంగా 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఒటేస్తే, ఎప్పట్లానే అమెరికా ఉలిపికట్టె ధోరణి ప్రదర్శించింది. ఎప్పుడో పదహారో శతాబ్దంనాటి మాట. భౌగోళిక పటాల రూపకర్త గెరార్డస్ మెర్కేటర్ తొలిసారి 1569లో ప్రపంచ పటాన్ని రూపొందించాడు. దక్షిణార్ధ గోళ దేశాలను, ముఖ్యంగా భూమధ్య రేఖ సమీప దేశాలను వాటి వాస్తవ పరిమాణంకన్నా తక్కువగా చూపాడాయన. అప్పటికున్న పరిజ్ఞానం పరిమితుల్లో అలా చేశాడని సరిపెట్టుకోవటానికి లేదు. అదే నిజమైతే ఉత్తరార్ధ గోళ దేశాలనూ, ధ్రువాలకు సమీపంలో ఉన్నవాటినీ పెంచి ఎలా చూపగలిగాడు? ఏమైతేనేం... ప్రపంచపటం ఇన్నాళ్లకు సక్రమమైంది. ఖండాలను వాటి నిష్పత్తికి అనుగుణమైన వైశాల్యాల్లో రూపొందించారు. కానీ ఆ క్రమంలో మన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను ఆ పటం చైనా, పాకిస్తాన్లకు ‘పంచిపెట్టింది’. మన విదేశాంగ శాఖ చెప్పినట్టు ఇదేమీ దేశాల హద్దుల్ని అధికారికంగా నిర్ధారించేది కాకపోవచ్చు. కానీ ఒక తప్పును సరిదిద్దుకునే క్రమంలో కొత్త తప్పుల్ని చేయరాదన్న ఇంగిత జ్ఞానం లోపించింది. అమెరికాలో కొంత భూభాగాన్ని వేరేవాళ్ల ఖాతాలో వేసి ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊరుకునేవారా? అవతలివారిపై ఆధిక్యతాభావం మనిషి నరానరాల్లోనూ వ్యాపించిన జాడ్యం. దీనికి భౌగోళిక హద్దులేమీ లేవు. అది జాత్యహంకారంగా, వర్ణవివక్షగా, ఆర్థికంగా అధికులమనే భావనగా వ్యక్తం కావటం ఎవరికీ తెలియంది కాదు. కులాన్నిబట్టి, మతాన్నిబట్టి మేం అధికులం, అన్యులు అల్పులన్న భావన ప్రబలంగా ఉండటం మన అనుభవంలో ఉన్నదే. తెల్లతోలు ఉన్నవాళ్లు అసాధారణ మానవులు, మిగిలినవాళ్లంతా అల్పులనే భావన పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ పోలేదు. హిట్లర్ హయాంలో యూదుల్ని జర్మనీ వెంటాడి, వేటాడి హతమార్చటం వెనుకా... ఎనిమిది దశాబ్దాలపైగా పాలస్తీనాలో మారణహోమాన్ని సాగిస్తున్న అమానుష ఇజ్రాయెల్ వెనకా ఈ జాడ్యం తాలూకు ఛాయలే కనబడతాయి. అమెరికాలో కనబడే శ్వేతజాతి అహంకారం కూడా ఈ బాపతే. మనిషి అంతరాంతరాల్లో ఇలాంటివి గూడు కట్టుకున్నప్పుడు వారి వ్యవహార శైలిలో అది ప్రతిబింబించక మానదు. ఒక ప్రాంత భౌగోళిక వైశాల్యం ఎంతో చెప్పే పటాలు చూడటానికి అన్నిటికీ అతీతంగా, అలీనంగా కనబడతాయి. కానీ పటాల రూపకల్పనలో చోటుచేసుకునే రాజకీయాల గురించి 2020లో కార్నెల్ వర్సిటీ అధ్యాపకురాలు క్రిస్టిన్ లూయెన్బెర్గర్ చాలా సంగతులే చెప్పారు. దృగ్గోచరమయ్యే రాజకీయాలతో పాటు, ప్రచ్ఛన్నంగా, గుట్టుగా ఉండిపోయే రాజకీయాలు కూడా ఈ పటాల రూపకల్పనలో ఉంటాయని ఆమె అభిప్రాయం. ప్రతి పటమూ చూపవల్సినంతగా చూపుతూనే, దాచాల్సింది దాస్తుందనీ, నిర్దిష్ట సమూహం కోసమే ఇదంతా జరుగుతుందనీ క్రిస్టిన్ అంటారు. గుండ్రంగా ఉండే భూమిని చదునైన కాగితంపై చూపితే కొంత వక్రీకరణ ఎలాగూ తప్పదు. కానీ గ్రీన్‌ల్యాండ్ కన్నా 14 రెట్లు పెద్దదైన ఆఫ్రికా... దాని ముందు చిన్నబోవట మేమిటి? యూరప్, అమెరికాలు కూడా తమ వాస్తవ విస్తీర్ణంకన్నా అధికంగా కనబడ తాయెందుకు? ఆఫ్రికాతోపాటు దక్షిణ అమెరికా, భారత్‌లు చిన్నగా ఉంటాయి. కాగితాల్లో తప్పుడు గీతలు గీసి అధికులమనుకోవటం... తరగతి గదుల్లో రూపుదిద్దుకునే తరాలకు అజ్ఞానాన్ని బట్వాడా చేయటం సిగ్గుచేటు కాదా? సమితికి ఇంతకన్నా ప్రాధాన్యం గలవి చాలా ఉన్నాయని ట్రంప్ ఉవాచ. అందుకే తీర్మానాన్ని వ్యతిరేకించారట. నిజమే... ప్రాధాన్యం గలవి ఇంకా ఉన్నాయి. ఆ లెక్కలు కూడా తేలిస్తే అమెరికా వంచన మరింత తేటతెల్లమవుతుంది! -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్‌కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్‌లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్‌గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. -
విభజనకు కౌంట్‌డౌన్..
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన పనులు చకాచకా జరిగిపోతున్నాయి. జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు కాబోతుండగా... ఎన్నికల నిర్వహణలో ఇప్పటి వరకూ బిజీగా ఉన్న అధికారులు ప్రస్తుతం విభ జన పనులపై దృష్టి సారించారు. ఈ నెలాఖరునాటికి రెండు రాష్ట్రాలకు సంబంధించి భౌగోళిక సరిహద్దుల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లేకపోవటంతో కొత్తగా ఏర్పడే కేంద్రప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముంపు పరిధిలోకి వచ్చే కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం, అదే విధంగా పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో 136 రెవెన్యూ గ్రామలు (205 హేబిటేషన్లు) జూన్ 2 తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలవనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాగానికి దీనిపై స్పష్టమైన సంకేతాలు రావటంతో విభజన లెక్కలు వేస్తున్నారు. స్థానిక ఎన్నికలు, మరో పక్క సార్వత్రిక ఎన్నికలు పూర్తవటంతో ‘విభజన లెక్కలే టాప్ ప్రయారిటీ’ అంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సంకేతాలతో విభజన పనులను వేగవంతం చేశారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా నియమింపబడిన సిబ్బంది నివేదికల తయారీలో తలమునకలయ్యారు. సరిహద్దుల ఏర్పాటుకు కసరత్తు : జిల్లాలోని ప్రభుత్వ ఆస్తులు, సిబ్బంది, భవనాలు తదితర అంశాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లే 136 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న స్థిర, చరాస్తులకు సంబంధించి మరో నివేదిక తయారు చేస్తున్నారు. ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విలీనం చేస్తూ తెలంగాణ బిల్లులో చే ర్చినందున, వీటిని జూన్ 2 తరువాత జిల్లా నుంచి వేరు చేయబడతాయని, అందుకనే వీటికి సంబంధించిన నివేదికలను వేరుగా తయారు చేస్తున్నట్లుగా ఓ డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అదే విధంగా రె ండు రాష్ట్రాల మధ్య సరిహ ద్దుల ఏర్పాటుకు సైతం అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కూనవరానికి వెళ్లే దారిలో భద్రాచలం మండలం గోగుబాక సెంటర్లో రెండు రాష్ట్రాల సరిహద్దు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. అదే విధంగా చింతూరు రహదారిలో చట్టి గ్రామానికి సమీపంలో గల సింగనగూడెం వద్ద సరిహద్దు చెక్‌పోస్టును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. భద్రాచలం డివిజన్లోని ముంపు గ్రామాలను జిల్లా నుంచి వేరు చేసి తూర్పుగోదావరి జిల్లాలోనూ, పాల్వంచ డివిజన్లోని గ్రామాలను కృష్ణాజిల్లాలోనూ కలిపేందుకు నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగులకు ఆప్షన్లు లేనట్లేనా : ముంపు ప్రాంతం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అవుతుండగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగస్తులకు ఆప్షన్లు లేవని చెబుతుండటంతో ముంపు ప్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముంపు గ్రామాల వారు పోలవరం బ్యాక్ వాటర్ వచ్చేంత వరకూ అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేకున్నప్పటికీ, పదోన్నతి పొందే ఉద్యోగులు ఉన్నపళంగా గోదావరి జిల్లాల్లోని ఏ మూలన ఉన్న గ్రామానికైనా వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంతంలో పనిచేసే అన్ని కేడర్ల ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదే విషయమై రాష్ట్రపతి, గవర్నర్లను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముంపు ప్రాంతంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు వచ్చిన తరువాత అన్ని సంఘాలు ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.


