అమెరికా ఘోర తప్పిదం | Sakshi Editorial On USA Donald Trump Huge mistake | Sakshi
Sakshi News home page

అమెరికా ఘోర తప్పిదం

Sep 3 2026 1:20 AM | Updated on Sep 3 2026 1:51 AM

Sakshi Editorial On USA Donald Trump Huge mistake

గత నెల రోజులుగా ప్రశాంతంగా వున్న పశ్చిమాసియాలో మళ్లీ చిచ్చురేగింది. తాజాగా అమెరికా మొదలెట్టిన క్షిపణి దాడులు, ఇరాన్‌ సాగిస్తున్న ప్రతిదాడులతో అది భగ్గున మండుతోంది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌ ప్రాంతంలో పెళ్లి వేడుకలు జరుగుతున్న ఇంటిపై అమెరికా క్షిపణి పడి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేరేచోట జరిగిన దాడిలో నలుగురు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డులు చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌తో కలిసి అకారణంగా తానే ప్రారంభించిన ఈ యుద్ధంలో అమెరికా సర్వభ్రష్టమైంది. దీన్నుంచి బయటపడటానికి చేసిన యత్నాలన్నీ విఫలంకాగా... ప్రపంచ దేశాలతో ఇరాన్‌ ఆర్థిక లావాదేవీలన్నిటినీ ‘కనీవినీ ఎరుగని రీతిలో’ దెబ్బతీసే ఆర్థిక దిగ్బంధం ప్రారంభించామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి వారం రోజులవుతుండగా తాజా దాడులు మొదలయ్యాయి. రోజులు మారాయని, తన ఆధిపత్య విధానాలకు కాలం చెల్లిందని అమెరికా గ్రహించుకోలేక ఈ నిరర్థక యుద్ధానికి తెరలేపింది. ఇది సోవియెట్‌తో పోటీపడుతూ ఆధిక్యత సాధించటానికి ప్రయత్నించిన ’60ల, ’70ల కాలం కాదు. సోవియెట్‌ పతనం తర్వాత కొన్నాళ్లపాటు సాగిన ఏకధ్రువ ప్రపంచం కూడా కాదు. కనీసం ట్రంప్‌ తొలి ఏలుబడినాటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ఇరాన్‌ ఆర్థిక దిగ్బంధం గురించి గత నెల 25న ట్రంప్‌ ప్రకటన చేసిన వెనువెంటనే చైనా, ఖతార్‌లు ఈ చట్టవిరుద్ధ, ఏకపక్ష ఆంక్షల్ని గుర్తించదల్చుకోలేదని చెప్పడాన్ని బట్టే వర్తమాన పరిస్థితులేమిటో అర్థమవుతాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో పీకల్లోతు మునిగిన రష్యా కూడా ఈ ఆంక్షల్ని పాటించే స్థితిలో లేదు. 

అమెరికా ఆంక్షల వల్ల 2018లో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కొంతమేర దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ దాన్ని పూర్తిస్థాయిలో ధ్వంసం చేయటం, చమురు ఎగుమతుల్ని సంపూ ర్ణంగా నిలిపేయటం అమెరికాకు సాధ్యం కాలేదు. కనీసం అప్పుడున్న అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులు ఏదోమేర ఆంక్షలు అమలుకు దోహదపడ్డాయి. అప్పట్లో సౌదీ, యూఏఈ, బహ్రైన్, ఈజిప్టులు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. కువైట్, ఒమన్‌లు మాత్రం దానితోనే కలిసి నడిచాయి. కానీ 2021 తర్వాత ఈ పరిస్థితి మారింది. ఎడమొహం, పెడమొహంగా ఉండే సౌదీ, ఇరాన్‌లు సంబంధాలు పునరుద్ధరించు కున్నాయి. ప్రాంతీయంగా గల్ఫ్‌ దేశాలన్నిటిమధ్యా ఇప్పుడు అవగాహన కుదిరింది. నిరుడు సెప్టెంబర్‌ 9న దోహాపై ఇజ్రాయెల్‌ సాగించిన దాడి వీటి కళ్లు తెరిపించింది. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌పై మొదలెట్టిన యుద్ధాన్ని గల్ఫ్‌ దేశాలు వ్యతిరేకించక పోవచ్చుగానీ... పాలస్తీనా ఏర్పాటుకు అనువైన రాజకీయ పరిష్కారం దొరికే వరకూ ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు అసాధ్యమని సౌదీ స్పష్టంగా తేల్చిచెప్పింది. ఈలోగా ఆంక్షల్ని అధిగమించటానికి అంతర్జాతీయంగా ఇరాన్‌  ఇప్పటికే ఏర్పర్చుకున్న నెట్‌వర్క్‌ అమెరికా ఆటల్ని సాగనివ్వటంలేదు. 

తాజా పరిణామాలన్నీ గల్ఫ్‌ దేశాల కళ్లు తెరిపించాయి. అమెరికాకు స్వప్రయోజనాలు తప్ప తమ భద్రత గురించి పట్టదని వాటికి అర్థమైంది. సైనిక స్థావరాలకు అమెరికాను అనుమతించినప్పుడు గల్ఫ్‌ దేశాల ఆలోచన వేరు. ఆ స్థావరాలుంటే ఎవరూ తమవైపు కన్నెత్తిచూడబోరని అవి అమాయకంగా విశ్వసించాయి. కానీ తనపై దాడి జరిగినప్పుడల్లా ఇరాన్‌ చేస్తున్న ప్రతీకార దాడులతో ఆ స్థావరాల సంగతటుంచి, తమ మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయని గల్ఫ్‌ దేశాలు లబోదిబోమంటున్నాయి. ఈమధ్య మూడు సౌదీ కంపెనీలు షేర్ల జారీకి ప్రయత్నించి, తాజా దాడులతో ఆ ప్రతిపాదనను పక్కనబెట్టాయి. యూఏఈ శాఖను ప్రారంభించదల్చుకున్న ప్రముఖ సంస్థ విన్‌ రిసార్ట్స్‌ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పింది. వివిధ ప్రభుత్వ విభాగాలకు ఖతార్‌ నిధులు కత్తిరించింది. ఎఫ్‌ 1 రేసులు, పలు సదస్సులు, వేలాదిమంది హాజరయ్యే దోహా ఫోరం, క్రిప్టో సదస్సు వంటివన్నీ ఆర్నెల్లుగా మూలనబడ్డాయి. రియల్‌ ఎస్టేట్‌ స్తంభించింది. వేలాదిమంది అమెరికన్లు వీటన్నిటా పెట్టుబడులు పెట్టి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ ఆర్థికవ్యవస్థల గురించి లేశమాత్రమైనా ఆలోచించకుండా ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరు గల్ఫ్‌ దేశాలను కలవరపరుస్తోంది. అందుకే ఇప్పటికైనా ట్రంప్‌ తన పోకడలకు స్వస్తిచెప్పాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement