అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ, పన్నులు, సుంకాలు, వలసలు, ఇరాన్‌లో యుద్ధం వంటి ప్రధాన అంశాలతో పాటు ‘నిజమైన పురుషుడు అంటే ఎవరు?’ అనే ప్రశ్న కూడా కీలకంగా మారుతోంది. ఈ ధోరణికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శైలి ప్రభావమే కారణం.
ట్రంప్ దూకుడైన పురుషత్వాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రత్యర్థులను అవమానించేలా వారికి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు అధికారాన్ని తిరిగి సాధించాలని చూస్తున్న కొందరు డెమొక్రటిక్ అభ్యర్థులు కూడా తమదైన పురుషత్వ భావనను ముందుకు తెస్తున్నారు. లింగం, రాజకీయాలపై పరిశోధన చేసే ఎమరీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ బెత్ రీన్‌గోల్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. డెమొక్రటిక్ ఓటర్లు పోరాడే స్వభావం ఉన్న అభ్యర్థిని కోరుకుంటున్నారు.
మిషిగన్‌లో డెమొక్రటిక్ సెనెట్ అభ్యర్థి అబ్దుల్ ఎనల్ సయీద్, రిపబ్లికన్ ప్రత్యర్థి మైక్ రోజర్స్ మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం సాగింది. రోజర్స్ తన పాఠశాల ఫుట్‌బాల్ నేపథ్యాన్ని ప్రస్తావించగా, ఎల్ సయీద్ ఆయనను ‘బీటా ఎనర్జీ’ అంటూ విమర్శించారు. రోజర్స్ తిరిగి ఎల్ సయీద్‌ను పాఠశాల రోజుల్లో తన ప్రాచుర్యాన్ని గుర్తుచేసుకుంటున్న వ్యక్తిగా ఎద్దేవా చేశారు.
Low T అంటే?
టెక్సాస్‌లో డెమొక్రటిక్ సెనెట్ అభ్యర్థి జేమ్స్ టలారికోను రిపబ్లికన్ వర్గాలు ‘లో టి టలారికో’ అంటూ విమర్శిస్తున్నాయి. ‘లో టి’ (Low T) అంటే తక్కువ టెస్టోస్టెరాన్ అనే సూచన. 37 ఏళ్ల టలారికో ఈ విమర్శను తేలిగ్గా తీసుకుంటూ, తన వయసు వారికి ఇలాంటి విషయాలపై పెద్దగా ఆందోళన ఉండదని అన్నారు. సెనెటర్ టెడ్ క్రూజ్ కూడా టలారికో పురుషత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఎల్ సయీద్ మాత్రం పురుషత్వం వ్యాయామశాలలో శారీరక బలం చూపించడంలో లేదని, కుటుంబం, సమాజం పట్ల ఎలా బాధ్యత వహిస్తారనేదే ముఖ్యమని అన్నారు. టలారికో కూడా తన దత్తత తండ్రి ప్రతి శనివారం తన ఇంటితో పాటు పక్కింటి వృద్ధ మహిళ ఇంటి పచ్చికను కూడా కోసేవారని చెబుతూ, “నిజమైన పురుషుడు బాధ్యత తీసుకుంటాడు” అని ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ విధంగా వ్యక్తిగత దూషణలుగా మొదలైన పురుషత్వ రాజకీయాలు ఎన్నికల ప్రచారంలో విస్తృత సాంస్కృతిక చర్చగా మారే అవకాశం ఉంది.


