పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి.. భారీగా మరణాలు | US airstrike hits wedding in Iran Video Viral | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి.. భారీగా మరణాలు

Sep 2 2026 12:09 PM | Updated on Sep 2 2026 12:19 PM

US airstrike hits wedding in Iran Video Viral

టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా అమెరికా వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా కనీసం ఐదుగురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలపై ప్రజలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హార్ముజ్‌ జలసంధికి సమీపంలోని హోర్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌ సిరిక్‌ కౌంటీలోని కుహెస్తాక్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న నివాస భవనంపై అమెరికా సైన్యం దాడి చేసినట్టు ఇరాన్‌ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వేర్వేరు వివరాలు వెలువడుతున్నాయి. రాయిటర్స్‌ ప్రకారం గాయపడిన వారి సంఖ్య 68 వరకు ఉండొచ్చని సమాచారం.

ఈ దాడిని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. పౌరులపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇది మరో ఘోర ఘటన అంటూ ఇరాన్‌ విదేశాంగ శాఖ మండిపడింది. ఇరాన్‌లోని అమెరికా దౌత్యపరమైన చర్యలను కూడా తీవ్రంగా విమర్శించింది. మరోవైపు.. ఇరాన్‌పై అమెరికా కొత్తగా చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన లక్ష్యాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్‌ కేంద్రాలు, సముద్ర సంబంధిత వ్యవస్థలు, మైన్లు ఏర్పాటు చేసే సామర్థ్యాలు, కమ్యూనికేషన్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. హార్ముజ్‌‌ జలసంధిలో ఇరాన్‌ మైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ కూడా క్షిపణులు, డ్రోన్లతో అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం. జోర్డాన్‌ గగనతలంలోకి ప్రవేశించిన 13 బాలిస్టిక్‌ క్షిపణుల్లో 10 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు జోర్డాన్‌ తెలిపింది. బహ్రెయిన్‌ కూడా ఇరాన్‌ డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించింది. కొన్ని వారాలుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ యుద్ధ వాతావరణంగా మారడంతో అమెరికా-ఇరాన్‌ మధ్య తాజా ఘర్షణలు ఇటీవలి వారాల్లోనే అత్యంత తీవ్రమైనవిగా మారాయి. హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో కీలక భాగం జరుగుతున్న నేపథ్యంలో తాజా దాడులు అంతర్జాతీయ చమురు మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement