అమెరికా–ఇరాన్‌ యుద్ధం: గల్ఫ్‌లో హైటెన్షన్‌.. తాజా పరిణామాలు ఇవే | US Iran War Live: Gulf Tensions Soar Sep2nd News Updates | Sakshi
Sakshi News home page

అమెరికా–ఇరాన్‌ యుద్ధం: గల్ఫ్‌లో హైటెన్షన్‌.. తాజా పరిణామాలు ఇవే

Sep 2 2026 1:46 PM | Updated on Sep 2 2026 1:58 PM

US Iran War Live: Gulf Tensions Soar Sep2nd News Updates

దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమాసియా భగ్గుమంటోంది. కాల్పుల విరమణను తుంగలో తొక్కి.. శాంతి చర్చలను పక్కన పెట్టి.. అమెరికా-ఇరాన్‌ను పరస్పర దాడులు జరుపుతున్నాయి. తాజాగా అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ వరుస క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. మరోవైపు అమెరికా బలగాలు హర్ముజ్‌ జలసంధిపై దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఇవిగో..

US-Iran War Live Updates
అరబ్‌ దేశాలకు ఇరాన్‌ వార్నింగ్‌
అమెరికా బలగాలను పంపించేయండి.. లేదంటే దాడులే అంటూ అరబ్‌ దేశాలను ఇరాన్‌ హెచ్చరించింది. తమ భూభాగాల్లోని అమెరికా బలగాలను, సైనిక స్థావరాలను తొలగించాలని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (IRGC) పొలిటికల్‌ వింగ్‌ డిప్యూటీ జనరల్‌ యదొల్లా జవానీ హెచ్చరించారు. అమెరికా దాడులకు తమ దేశాల నుంచి ఏదైనా వేదికగా మారితే ‘తీవ్రమైన’ ప్రతీకారం తప్పదన్నారు. కువైట్‌, బహ్రెయిన్‌, జోర్డాన్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

బెత్లహెమ్‌లో పాలస్తీనా ఇంటి కూల్చివేత
వెస్ట్‌ బెత్లహెమ్‌లోని నహాలిన్‌ పట్టణంలో పాలస్తీనాకు చెందిన ఓ ఇంటిని ఇజ్రాయెల్‌ బలగాలు కూల్చివేశాయి. సైనిక వాహనాలు, బుల్డోజర్లతో పట్టణంలోకి ప్రవేశించిన బలగాలు.. 15 ఏళ్లకు పైగా నివాసంగా ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది.

బహ్రెయిన్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు?
బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాన్ని ఇరాన్‌ భారీ డ్రోన్‌ దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో బహ్రెయిన్‌ రక్షణ దళాలు తమ గగనతలంలోకి వచ్చిన పలు ఇరాన్‌ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి.

జోర్డాన్‌లోకి 13 బాలిస్టిక్‌ మిసైళ్లు
ఇరాన్‌ నుంచి వచ్చిన 13 బాలిస్టిక్‌ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎదుర్కొన్నట్లు జోర్డాన్‌ ప్రకటించింది. అయితే ఈ క్షిపణుల వల్ల నష్టం జరిగిందా?.. ఎక్కడ పడ్డాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

మష్హద్‌లో విషాదం
ఇరాన్‌లోని ఈశాన్య నగరం మష్హద్‌లో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదమేనని, రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి
జోర్డాన్‌లోని ప్రిన్స్‌ హసన్‌ ఎయిర్‌బేస్‌పై భారీ బాలిస్టిక్‌ క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్‌ IRGC ప్రకటించింది. అక్కడ RQ-4, MQ-9 డ్రోన్లను ఉంచిన హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. పలు డ్రోన్లు ధ్వంసమయ్యాయని, అమెరికా సిబ్బందిలో కొందరు మరణించారని, మౌలిక వసతుల్లో మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే దీనిపై అమెరికాగానీ, జోర్డాన్‌గానీ ఇంకా స్పందించలేదు. 

లవాన్‌ ద్వీపంపై అమెరికా దాడులు
ఇరాన్‌లోని లవాన్‌ ద్వీపంపై అమెరికా జరిపిన తాజా దాడుల్లో ముగ్గురు బసీజ్‌ పారామిలటరీ సభ్యులు మరణించినట్లు ఇరాన్‌ సెమీ అధికారిక మెహర్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది.

పెళ్లి వేడుకపై దాడి.. ఘోరం
ఇరాన్‌లోని సిరిక్‌ సమీపంలో జరిగిన పెళ్లి వేడుకపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్‌ అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించగా.. మరో 50 మంది గాయపడినట్లు తెలిపారు. ఇరాన్‌ విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.

హర్ముజ్‌లో షిప్పింగ్‌ ట్రాఫిక్‌ డౌన్‌
హర్ముజ్‌ జలసంధి మీదుగా మంగళవారం కేవలం నాలుగు వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణంగా 10 రోజుల సగటు రోజుకు సుమారు 13 నౌకలుగా ఉండగా.. తాజా సంఖ్య దాని కంటే గణనీయంగా తక్కువగా ఉంది. కేప్లర్‌ ప్రాథమిక షిప్పింగ్‌ డేటా ప్రకారం నాలుగు నౌకల్లో ఒకటి భారీ క్రూడ్‌ ఆయిల్‌ క్యారియర్‌, మిగిలినవి వివిధ రకాల సరకు/చమురు రవాణా నౌకలు. అయితే సోమవారం హర్ముజ్‌ జలసంధి మీదుగా 17 మిలియన్‌ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ రైట్‌ తెలిపారు. యుద్ధం కారణంగా రాకపోకలు తగ్గిన తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక చమురు రవాణా ఇదేనని పేర్కొన్నారు.

బహ్రెయిన్‌లో వరుస అలర్ట్‌లు
బహ్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు గంటల వ్యవధిలో మూడోసారి ‘పొంచి ఉన్న ముప్పు’పై అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్‌ జలసంధిపై అమెరికా బలగాలు దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అన్నారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్నదని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు, ఆ తర్వాత టెహ్రాన్‌ ప్రతీకార చర్యల నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇరాన్‌ ప్రతీకార దాడులు
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ తన భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు IRGC ప్రకటించింది. అమెరికా దాడులను ‘నిరాశతో కూడిన దాడులు’గా అభివర్ణించింది. ప్రతీకార చర్యల్లో పెద్ద సంఖ్యలో అమెరికా బలగాలను హతమార్చినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ వాదనపై అమెరికా నుంచి తక్షణ ధ్రువీకరణ రాలేదు.

ఇరాన్‌ ప్రతీకార దాడుల పరిధి కువైట్‌, బహ్రెయిన్‌, జోర్డాన్‌, ఇరాక్‌లోని ఎర్బిల్‌ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్‌ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా హర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలు, చమురు రవాణాపై యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది.

ఇదీ చదవండి: అమెరికా సైనికుల రాక.. సెక్స్‌వర్కర్ల వేట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement