కైరో: ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు సినాయ్ ద్వీపకల్పంలో ఓ బస్సు దురదృష్టవశాత్తు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా రోడ్డు ప్రమాద వివరాలను ఆ దేశ మీడియా కథనాలుప్రకటించాయి. ఈజిప్టులోని దక్షిణ సినాయ్ గవర్నరేట్‌లోని దహబ్-నువైబా రహదారిపై ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడటంతో పది మంది జోర్డాన్ దేశస్థులు మరణించారని జోర్డాన్ అధికారిక అల్-మమ్లకా ఛానల్ తెలిపింది. ఆ బస్సులో మొత్తం 43 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 22 మంది జోర్డాన్ దేశస్థులు ఉన్నారని పేర్కొంది. గాయపడిన వారికి వైద్య సంరక్షణ అందిస్తున్నారని అధికారులు తెలిపారు, కానీ ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించలేదు.
కాగా ఈజిప్టు ప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇక్కడ సముద్ర జీవవైవిధ్యం, సహజ సౌందర్యం, పర్వతారోహణ కోసం ప్రత్యేకంగా టూరిస్టులు వస్తుంటారు.
ఇటీవల ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో సహా సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడం తదితర కారణాలతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో, ఉత్తర ఈజిప్టులో వ్యవసాయ దినసరి కూలీలను తీసుకువెళ్తున్న రెండు పికప్ ట్రక్కులు ఢీకొన్న ఘటనలో, మరణించిన వారిలో చాలామంది టీనేజర్లు ఉన్నారు, కనీసం 18 మంది మరణించారు.
ఈజిప్ట్ ప్రభుత్వ గణాంకాల సంస్థ ప్రకారం, గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 6,000 మంది మరణించారు.


