ఖాట్మండు:నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్రమైన ప్రాణనష్టం కలిగించడంతో పాటు పెద్దఎత్తున ఆస్తినష్టం కలిగించాయి. మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేపాల్ పోలీసులకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. భారీస్థాయిలో వచ్చిన వరదలకు పెద్దఎత్తున లాకర్లు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోవడంతో వాటి కోసం ఇప్పుడు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నారు.
వరద ప్రవాహంలో దాదాపు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం, అవి దుండగుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం పోలీసులకు మరో పెద్ద బాధ్యతగా మారిందని తెలిపారు. ఈ వాల్ట్‌లలో కొన్ని భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వివరాలపై డీఐజీ అబి నారాయణ్ కాఫ్లే మాట్లాడుతూ, వరదల అనంతరం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసుల ప్రధాన ప్రాధాన్యత గల్లంతైన వ్యక్తుల కోసం గాలించడం, వారిని రక్షించడమేనని తెలిపారు. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు.
“రసువా, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లోని పలు బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉన్న వాటిలో చాలా వాల్ట్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని భారీగా పేరుకుపోయిన బురద కింద కూరుకుపోయాయి. మా సిబ్బంది ప్రస్తుతం ఆ వాల్ట్‌లను గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొట్టుకుపోయిన వాల్ట్‌లను కొందరు వ్యక్తులు పగులగొట్టి నగదును దొంగిలించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి” అని కాఫ్లే తెలిపారు.
ఈ పరిణామాల మధ్య ధాదింగ్ జిల్లాలో పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ఎగువ రసువా ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయిన ఓ బ్యాంకు వాల్ట్ నుంచి NPR 92 లక్షలు (నేపాలీ రూపాయలు) దొంగిలించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వివరాల ప్రకారం, ఆ వాల్ట్‌లో NPR 1.5 కోట్లు నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో NPR 50 కోట్ల విలువైన బంగారం సైతం ఉన్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో మరో ఘటనలో ‘కృషి వికాస్ బ్యాంక్’కు చెందిన నువాకోట్ వాల్ట్‌ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసిన నేపాల్ పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక, రక్షణ చర్యల్లో ప్రస్తుతం 7,894 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.
గల్లంతైన వారి కోసం గాలింపు, బాధితులను రక్షించడం, వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు వాల్ట్‌లను గుర్తించి వాటిలోని నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా కాపాడటం ఇప్పుడు నేపాల్ పోలీసులకు మరో కీలక సవాల్‌గా మారింది.


