రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం
ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం నుంచి పెందుర్తి వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగి కారు నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనమయ్యాడు. ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్‌కి చెందిన పోలాకి అమర్‌నాథ్ పాత్రో (28) హైదరాబాద్‌లోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. 3 నెలల క్రితం ఆయన విశాఖలోని పరదేశిపాలెంలోని జగన్నాథ్ స్కై గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశాడు.
ఈ నెల 27న గృహప్రవేశం పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. ఆదివారం స్నేహితులను కలిసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి కారులో బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో సోమవారం వేకువజామున ఆనందపురం– పెందుర్తి సర్వీస్ రోడ్డులోని సత్రం కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అమర్‌నాథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. మంటల ఉధృతికి కారు తలుపులు తెరుచుకోకపోవడంతో వాహనంలోనే తీవ్రంగా కాలిపోయి అక్కడే మృతి చెందాడు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన నాలుగు రోజులకే అమర్‌నాథ్ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


