మారికవలస గురుకులం పోరాటం మరింత ఉధృతం | Move to convert tribal gurukulam into Centre of Excellence triggers protests near vizag | Sakshi
Sakshi News home page

మారికవలస గురుకులం పోరాటం మరింత ఉధృతం

Sep 1 2026 5:02 AM | Updated on Sep 1 2026 5:02 AM

Move to convert tribal gurukulam into Centre of Excellence triggers protests near vizag

మారికవలస పాఠశాల ఎదుట నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాల నేతలు

గురుకులం గేటు ఎదుట ఉదయం నుంచే బైఠాయింపు 

వైఎస్సార్‌సీపీ, గిరిజన, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన 

సంఘీభావం తెలిపిన సీపీఎం, ప్రజాసంఘాల నేతలు  

ఆందోళనలో ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ మంత్రి బాలరాజు తదితరులు

మధురవాడ: సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ) పేరుతో మూసివేసేందుకు యత్నిస్తున్న మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవి బాబు, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు స్పష్టం చేశారు. 

చంద్రబాబు పర్యటన సందర్భంగా ముందు రోజు మారికవలస బాలుర ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తామని, ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా తరలించిన విద్యార్థులను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చిన అధికారులు మాట తప్పారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమవారం ఉదయం నుంచే గురుకుల పాఠశాల ప్రధాన గేటు ఎదుట నేలపై ఆందోళనకారులు బైఠాయించారు. పాడేరు ధర్నా శిబిరం నుంచి పాఠశాలకు తీసుకువచ్చిన 37 మంది విద్యార్థులను ఇక్కడ అనాథ పిల్లల్లా వదిలేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

మారికవలసలోని విద్యార్థులను పరామర్శించేందుకు బయలుదేరిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, గిరిజన సంఘాల నేతలు, ఇతర నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ మాజీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేకే సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

మారికవలస వెళ్తున్న పాడేరు, అరకు ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు..
పాడేరు : మారికవలస గురుకులం వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న  వైఎస్సార్‌సీపీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. విశ్వేశ్వరరాజు మారికవలస బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆయన విశాఖపట్నం బయలుదేరిపోవడంతో పాడేరు–చోడవరం ప్రధాన మార్గంలోని తాటిపర్తి చెక్‌పోస్టు వద్ద ఆయనను అడ్డుకుని సుమారు రెండు గంటలపాటు నిర్బంధించారు. 

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను వంతాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు. తాటిపర్తి చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతు తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం విశ్వేశ్వరరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని చోడవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement