2028 మార్చికి వెలిగొండ పూర్తి | Minister Anam Upset with Chandrababus Behaviour: AP | Sakshi
Sakshi News home page

2028 మార్చికి వెలిగొండ పూర్తి

Sep 1 2026 4:27 AM | Updated on Sep 1 2026 4:27 AM

Minister Anam Upset with Chandrababus Behaviour: AP

చంద్రబాబు మాట్లాడుతుండగానే సభలో ఖాళీగా ఉన్న కుర్చీలు

స్విచ్‌ ఆన్‌ చేసి కృష్ణా నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

రెండోదశ పనులు చేసి మార్కాపురంలో కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తాం 

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ఇరిగేషన్‌ క్యాలెండర్‌ 

ప్రజలు లేకపోవడంతో గంటసేపు ఆలస్యమైన సీఎం సభ 

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనంకు సభలో అవమానం  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ 2028 మార్చి నాటికి పూర్తిచేసి మార్కాపురంలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ మొదటి దశను సీఎం స్విచ్‌ ఆన్‌చేసి కృష్ణా జలాలను నల్లమల సాగర్‌లోకి విడుదల చేశా­రు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ 1996 మార్చి 5న ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, 2026 ఆగస్టు 31న తానే ప్రారంభిస్తున్నట్లు చెప్పా­రు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందన్నారు. భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తామన్నారు. ఇప్పటి వరకూ రూ.900 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.169 కోట్లు అందిస్తామన్నారు. నీళ్లొదిలే తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి రూ.2 లక్షల ప్యాకేజీ అందిస్తామన్నారు.  వెలిగొండ ప్రాజెక్టు అంతా తానే చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   

సినిమా సెట్టింగ్‌ తరహాలో..  
సీఎం చంద్రబాబు పాల్గొన్న సభ ప్రాంగణం సినిమా సెట్టింగును తలపించింది. పంచెకట్టుతో వచ్చిన ముఖ్యమంత్రికి బంజారా నృత్యంతో స్వాగతం పలకడం.. కృష్ణమ్మకు హారతి తరువాత సీఎం భూమిని తాకడం లాంటి దృశ్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. తొలుత పైలాన్‌ను ఆవిష్కరించారు. సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని భావించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 180 బస్సులు, రాష్ట్రవ్యాప్తంగా 750 బస్సుల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేసినా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో టీడీపీ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి ఆ బస్సులను కూడా మోహరించినా స్పందన కానరాలేదు.

తొలుత సీఎం పర్యటన ఉదయం 10.25 గంటలకు ఉంటుందని ప్రకటించినా హాజరు పలుచగా ఉండటంతో గంట ఆలస్యంగా వచ్చారు. ఒకవైపు సీఎం సభ జరుగుతుండగానే ప్రాంగణం నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోయారు. సభా ప్రాంగణానికి పలువురు కూటమి కార్యకర్తలు మద్యం తాగి చిందులు తొక్కుతూ వచ్చారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంటతోపాటు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మంత్రి ఆనంకు అవమానం!  
సభలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ మాగుంటతోపాటు  ఎమ్మెల్యేలు మాట్లాడగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సభలో మాట్లాడే అవకాశం దక్కక పోవడం అవమానంగా భావించిన మంత్రి ఆనం సభా ప్రాంగణంలో ముక్తసరిగా ఉన్నారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు పూజా సమయంలోనూ చంద్రబాబు పక్కనే ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని వెనక్కు పొమ్మంటూ పలుమార్లు సంజ్ఞలు చేశారు. చివరకు ఆయన్ను వెనక్కి పంపి మరో మంత్రి నిమ్మల రామానాయుడిని ముందుకు పిలిపించుకున్నారు. చంద్రబాబు తీరుతో ఆనం మనస్తాపం చెంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. పూలు వేయకుండానే అలిగి వెళ్లిపోయిన మంత్రి ఆనం.. ఆపై జ్యోతిప్రజ్వలనకు సైతం హాజరుకాలేదు.  

బాబు సభలో బీజేపీ కండువాలకు నో ఎంట్రీ

 వెలిగొండ సభకు బీజేపీ కండువాలతో వచ్చినవారిని అనుమతించని పోలీసులు 
    చంద్రబాబు ప్రభుత్వంపై మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి ఆగ్రహం 
యర్రగొండపాలెం: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారం¿ోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణంలోకి బీజేపీ కండువాలు వేసుకున్న నాయకులను పోలీసులు అనుమతించలేదని ఆమె మండిపడ్డారు. పార్టీ కండువాలతోనే తాము సభలో పాల్గొంటామని, ఎవరు ఈ నిబంధనలు పెట్టారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చంద్రబాబు సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి విజయలక్షి్మతోపాటు బీజేపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement