ఎల్‌నినో ప్రభావంతో రామతీర్థం జలాశయంలో అట్టడుగుకు చేరిన నీటిమట్టం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం సుమారు 1.5 టీఎంసీలు ప్రస్తుతం ఉన్నది 0.574 టీఎంసీలే
చీమకుర్తి రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థం జలాశయంలో నీటిమట్టం అట్టడుగుకు చేరింది. చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో ఉన్న ఈ జలాశయం నీటిపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన నెలకొంది. గత 20 ఏళ్లలో ఇలాంటి క్లిష్ట పరిస్థితిని చూడలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. రామతీర్థం జలాశయం ద్వారా ఒంగోలు బ్రాంచి కాలువ కింద 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు చీమకుర్తి, ఒంగోలు, కందుకూరు పట్టణాలకు తాగునీటి వసతి, 45 గ్రామాల్లోని చెరువులకు నీటి సరఫరా అవుతోంది. దీంతో ఈ జలాశయం ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులకు వరప్రసాదంగా నిలుస్తోంది.
వరి సాగుపై ప్రభావం
జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ ఏడాది వరి పంటకు నీరందించడం సాధ్యం కాదని, రైతులు వరి సాగు చేయవద్దని అధికారులు గతంలోనే సూచించారు. ప్రస్తుతం జలాశయంలో నీరు మరింతగా అడుగంటడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. వర్షాలు కురవకపోతే సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చడం కూడా సవాలుగా మారే పరిస్థితి నెలకొంది.
డెడ్ స్టోరేజీకి చేరువలో..
సుమారు 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రామతీర్థం జలాశయంలో ప్రస్తుతం కేవలం 0.574 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఎల్‌నినో ప్రభావం కొనసాగి వర్షాల జాడ లేకపోతే చెరువులు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల్లో సాగర్ జలాలు..
తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామతీర్థం జలాశయంలోకి రెండు రోజుల్లో సాగర్ జలాలు చేరనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ జలాలను అందుబాటులోకి తీసుకొచ్చి తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న తాగునీటి ఇబ్బందులకు కొంత ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.


