ఉలవపాడు: గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని కూటమి ప్రజాప్రతినిధులు, కీలక నేతల అండదండలతో అక్రమార్కులు సాగిస్తున్న మట్టి దోపిడీ పర్వం మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లుగా వర్ధిల్లుతోంది. మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలు గాలికొదిలేసి మట్టిని కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తున్నా, స్థానికులు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా అధికారులు శ్రీమామూళ్లశ్రీ మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వివరాల్లోకి వెళ్తే.. ఉలవపాడు, శింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలు, గృహ నిర్మాణాల కోసం గ్రావెల్‌ను విచ్చలవిడిగా తరలిస్తున్నారు. సింగరాయకొండ మండలం శానంపూడి సమీపంలోని నీలకంఠేశ్వరస్వామి దేవాలయ మాన్యాలు, పోరంబోకు భూములతో పాటు రాజుపాలెం, భీమవరం చెరువులను జేసీబీలతో భారీగా తవ్వేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి కొల్లూరుపాడు సమీపంలోని ఓ ప్రైవేట్ భూమితో పాటు, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మరో వెంచర్‌కు ఏకంగా 300 ట్రిప్పులకు పైగా గ్రావెల్‌ను తరలించారు.
ప్రభుత్వ ఖజానాకు కోట్లల్లో నష్టం
అక్రమార్కులు కనీస మైనింగ్ అనుమతులు తీసుకోకుండా, ప్రభుత్వానికి నయాపైసా రాయల్టీ చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీంతో గనుల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ తవ్వకాలపై స్థానికులు లేదా రైతులు ప్రశ్నిస్తే శ్రీమాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయిశ్రీ అంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగడం రివాజుగా మారింది.
అధికారుల మౌనం.. నేతల జేబుల్లోకి కమీషన్లు!
రెండు మండలాల పరిధిలోని రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు కేవలం శ్రీపచ్చశ్రీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ట్రిప్పుకూ ఇంత మొత్తం అని స్థానిక నాయకుల జేబుల్లోకి లక్షల రూపాయల కమీషన్లు చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమ మైనింగ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ రవాణాకు వినియోగిస్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
దేవుడి మాన్యాలు, చెరువులను కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్న కూటమి నేతలు
రాయల్టీ ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి.. నాశనమవుతున్న రహదారులు
అక్రమార్కులపై చర్యలకు అధికారులు
వెనుకాడటంపై విమర్శలు


