అధికార బలంతో ఆక్రమిత భూమిలో నిర్మించిన కట్టడాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్:
అధికార బలంతో చట్టాలను తుంగలో తొక్కడం.. అమాయక పేదలను, ఎస్సీలను పావులుగా వాడుకుంటూ ప్రైవేట్ భూముల్లో వివాదాలు సృష్టించడం కొండపి నియోజకవర్గంలో టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. కోర్టులో విచారణలో ఉన్న స్థలాలు, ఆంక్షలు విధించిన భూములను సైతం వదలకుండా ఆక్రమణలకు తెగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొండపి మండలం పెట్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 450 లో ఉన్న 4.40 ఎకరాల భూమిని 2010లో కల్లూరి హరిబాబు, ఆయన సోదరులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి స్వాధీనంలోనే ఉంది. అయితే 2013లో ఈ స్థలంపై వివాదం తలెత్తడంతో కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో జారీ చేసింది. 2024 జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్థానిక టీడీపీ నాయకులు తమ పెత్తనాన్ని ప్రదర్శించారు. గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులను రెచ్చగొట్టి, వారిని ముందుంచి పంట పొలంలోకి జేసీబీలను దించారు. రాత్రికి రాత్రే పొలాన్ని చదును చేసి పూరిపాకలు, నిర్మాణాలతో పాటు దుకాణాలను కూడా ఏర్పాటు చేయించారు.
ఉత్తర్వులను లెక్కచేయని వైనం
బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వివరాలను పరిశీలించిన కోర్టు మార్చి 2025లో ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. అప్పట్లో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 145, 107 కింద భూమిలోకి ఎవరూ ప్రవేశించరాదని, అతిక్రమిస్తే రూ.2 లక్షల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, అధికార పార్టీ నేతల అండ చూసుకుని ఆక్రమణదారులు కోర్టు ఆదేశాలను, అధికారిక ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా భూమిలోకి ప్రవేశించడమే కాకుండా, వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు.
పచ్చ నేతలకు విద్యుత్ శాఖ దాసోహం
వివాదాస్పద భూమిలోని దుకాణాలకు అక్రమంగా విద్యుత్ మీటర్లు బిగించడంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి కనెక్షన్లను తొలగించారు. అయితే మంత్రితోపాటు ఆయన స్వగ్రామానికి చెందిన టీడీపీ కీలక నేత రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో, తొలగించిన విద్యుత్ మీటర్లను అధికారులు తిరిగి ఏర్పాటు చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమార్కులకు సహకరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని, తమ భూమిని తమకు దక్కేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.


