మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 – 8లో.. 10 టీఎంసీల డెడ్‌ స్టోరేజీతో సాగు, తాగునీరు ఎలా సాధ్యం ● సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు పోస్టింగులు ● 205 మంది అభ్యర్థులకు పాఠశాలల కేటాయింపు బాబు సభలో ఏరులై పారిన మద్యం

న్యూస్‌రీల్‌

వెలిగొండ ప్రాజెక్టుపై అబద్ధాలు వల్లెవేసిన చంద్రబాబు అంతా తానే చేశానంటూ క్రెడిట్‌ చోరీపై సర్వత్రా చర్చ జనం లేక బోసిపోయిన సభా ప్రాంగణం సీఎం సభకు బస్సులు ఫుల్‌..జనాలు నిల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రికి సభలో అవమానం పరిహారం రాని నిర్వాసితుల్లో తీవ్ర అసంతృప్తి

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టులో 10 టీఎంసీల డెడ్‌ స్టోరేజీతో తాగు, సాగు నీరు ఎలా సాధ్యమని సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 10 టీఎంసీల డెడ్‌ స్టోరేజీ నీటితో 1 లక్షా 19 వేల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇలా చెప్పడం ప్రజలను భ్రమలకు గురి చేయడం, మభ్యపెట్టడం కిందకే వస్తుందన్నారు. నీటిని వ్యవసాయ భూములకు సరఫరా చేయడానికి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయని అన్నారు. తాగునీటి కుళాయిలకు పైపులైను నిర్మాణ వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు ప్రారంభ సభలో స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటించడం ప్రజలను మోసంచేయడమే అవుతుందన్నారు. నిర్వాసితుల ప్రజల సమస్యలు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని, వెయ్యి మందికి పైగా గెజిట్లో నమోదు కానీ కుటుంబాలకు పరిహారం ఇంకా అందలేదని, దాదాపు 2 వేల మంది 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందలేదని తెలిపారు. పునరావాస కాలనీల్లో గుండంచర్ల, గొట్టపడియ గ్రామ నిర్వాసితులకు పట్టాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. అర్ధాంతరంగా, హఠాత్తుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాలను ఖాళీ చేయించారని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురై రోశమ్మ అనే మహిళ హఠాన్మరణం చెందడం ప్రభుత్వ తొందరపాటు చర్య వల్లేనని అన్నారు. గోతం రోశమ్మ ఇంటిలో ఆరుగురికి గాను ఒక్కరికి మాత్రమే ప్యాకేజీ లభించడం, మిగతా ఐదుగురికి ప్యాకేజీ దక్కుతుందో లేదో అన్న ఆందోళనలో గ్రామాలు ఖాళీ చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన గోతం రోశమ్మ హఠాన్మరణం చెందిందన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా పరిధిలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా ఎంపికై న 205 మంది అభ్యర్థులకు పాఠశాలలను కేటాయించినట్లు డీఈఓ సి.వి.రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లాడుతూ ఎంపికై న ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు సెప్టెంబరు 1వ తేదీన వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని సూచించారు. ఆయా మండలాల్లో ఎంపికై న అభ్యర్థులకు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 2 వతేదీ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విధుల వివరాలను సంబంధిత అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

బాబు నోట..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు మొదటిదశ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభా ప్రాంగణం చాలా వరకు జనం లేక ఖాళీగా ఉండటంతో ముఖ్యనేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిర్వాసితుల సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదన్న విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా పరిహారం అందని నిర్వాసితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్ధితి ఏర్పడినా తమకు రావాల్సిన పరిహారం పూర్తిగా అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం తన ప్రసంగంలో వెలిగొండ ప్రాజెక్టునంతా తానే చేసినట్టు పదే పదే చెప్పడంపై సభా ప్రాంగణానికి వచ్చిన ప్రజలు రైతులు ఆశ్చర్యపోయారు. ప్రాజెక్టు కోసం గత 30 ఏళ్లుగా పోరాడిన ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నిర్వాసితులను పక్కనపెట్టి ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. పంచకట్టుతో వచ్చిన ముఖ్యమంత్రి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం.. సాష్టాంగ ప్రణామం చేయడం.. గిరిజన బంజారా నృత్యంతో స్వాగతం పలకడం.. రైతులతో మాట్లాడటం అంతా సినిమా సెట్టింగును తలపించిందని పలువురు బహిరంగంగానే చర్చించుకున్నారు. 1996 మార్చి 5న తానే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఇప్పుడు తానే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు చెప్పుకోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రాజెక్టుకు గతంలో రూ.3581.58 కోట్ల వ్యయాన్ని మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఖర్చుపెట్టారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండను ఏటీఎంగా వాడుకున్నారు. ధరల సర్దుబాటు కింద అప్పట్లో రూ.630.57 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. టీబీఎంల మరమ్మతుల కోసం రూ.66.44 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. కాగ్‌ నివేదిక కూడా ఇదే వెల్లడి చేసింది. 2019–24 మధ్య కోవిడ్‌లోనూ వెలిగొండ పనులను నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరుగులెత్తించారు. ప్రతికూల పరిస్థితుల్లో, ఆర్ధిక ఇబ్బందుల్లోనూ రూ.1046.46 కోట్లు ఖర్చుచేశారు. 7225 నిర్వాసిత కుటుంబాలకు 2024 జూలై నాటికి రూ.1301.56 కోట్లతో పునరావాస ప్రణాళిక సిద్ధంచేశారు. ఇంతటి అభివృద్ధి పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తే అవన్నీ మర్చిపోయి వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ తానే చేసినట్టు చెప్పుకోవడం పట్ల సభా ప్రాంగణంలో రైతులు, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

జనం లేక గంట ఆలస్యం:

సీఎం సభా ప్రాంగణానికి సుమారు గంట సేపు ఆలస్యంగా వచ్చారు. అప్పటికీ ప్రాంగణంలో ప్రజలు తక్కువ సంఖ్యలో ఉండటంతో టీడీపీ ముఖ్యనేతలు ఆందోళనకు గురై పోలీసులతో మాట్లాడి అన్నీ ద్వారాల నుంచి ప్రజలను లోపలికి పంపే ఏర్పాట్లు చేశారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే భోజనాలు మొదలు పెట్టడంతో ప్రాంగణంలో ఉన్న ప్రజలు భోజనాల కోసం వెళ్లిపోయారు. దీంతో నాయకులు సమావేశం ప్రాంగణంలోనికి రండి.. రండి.. అంటూ పిలిచారు.

గ్రామాలకు బస్సులు ఫుల్‌.. జనాలు నిల్‌..

ముఖ్యమంత్రి సభకు జనాలను తరలించేందుకు వివిధ డిపోల నుంచి వందల సంఖ్యలో బస్సులను తెప్పించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి బస్సులు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 750 బస్సులను సీఎం సభ కోసం కేటాయించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి బస్సుల్లో ప్రజలను రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. వీటితో పాటు మార్కాపురం, ప్రకాశంజిల్లాలోని ప్రైవేటు బస్సులను సైతం కేటాయించారు. గ్రామానికి 1 లేదా 2 బస్సుల చొప్పున పంపినప్పటికీ సభకు మాత్రం అంతంతమాత్రంగానే వచ్చారు. సీఎం సభకు వచ్చే పురుషులకు క్వార్టర్‌ మద్యం, బిర్యానీ, అలాగే మహిళలకు రూ.300 డబ్బులు, బిర్యానీ, చీరె ఆశచూపారు. ఇదిలా ఉంటే డ్వాక్రా మహిళా సంఘాలకు మాత్రం సీఎం సభకు రాకపోతే గ్రూపుసభ్యుల నుంచి పెనాల్టీ కింద రూ.5 వేల నగదు కోత, వారికి లోన్లు మంజూరు కాకుండా చేస్తామని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. బస్సుల్లో వచ్చిన వారంతా సభా ప్రాంగణంలో ఎక్కువసేపు ఉండేందుకు ఆసక్తి చూపలేదు. భారీగా జనసమీకరణ చేసినట్టు చూపేందుకు అధికార యంత్రాంగం, కూటమి నాయకులు ప్రయత్నించినా స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అవమానం:

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీవ్ర అవమానం జరిగింది. పూజ సమయంలో పలుమార్లు తన పక్కన ఉన్న ఆనంను వెనక్కు వెళ్లి మంత్రి నిమ్మల రామానాయుడిని ముందుకు రమ్మని చంద్రబాబు చెప్పడంతో ఆయన మనస్తాపానికి గురై వెనక్కు వెళ్లిపోయారు. సభలో కూడా మాట్లాడే అవకాశం రాకపోవడంతో సభా ప్రాంగణంలో ముక్తసరిగా ఉన్నారు. ఇదే సభలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్‌, ఎంపీ మాగుంటతోపాటు ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం సభలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో జరిగే కార్యక్రమంతో పాటు తాగు, సాగు నీరు ముఖ్యమైన ప్రాజెక్టులో తన భావాలను రైతులకు, ప్రజలకు చెప్పుకునే అవకాశం కల్పించకపోవడంతో ఎడమొఖం.. పెడమొఖంగా కనిపించారు.

అబద్ధాల ఊట

యర్రగొండపాలెం: కూటమి నాయకుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద దోర్నాలలో మద్యం ఏరులై పారింది. సీఎం సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో జోగులాడారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన వారికి కూటమి నాయకులు మద్యం పంపిణీ చేశారు. దోర్నాల నుంచి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం రోడ్డులో అక్కడక్కడా తాము వచ్చిన వాహనాలను నిలిపి మద్యం తాగడం కనిపించింది. ఆయా వాహనాల్లో మహిళలు సైతం ఉన్నప్పటికీ మందు బాబులు తమ పనిని వదలిపెట్టుకోలేకపోయారు. మద్యం షాపుల వద్ద పచ్చకండువాలు కప్పుకొని మద్యం తాగారు. మత్తు ఎక్కువై అనేక మంది తెలుగు తమ్ముళ్లు సభా ప్రాంగణంలోనే పడి నేలపై పొర్లాడారు. ఎక్కడ చూసినా మందుబాబుల హల్‌చల్‌ కనిపించింది.

బాబు ప్రసంగం కోసం కాదు.. వెలిగొండ కాలువ చూడటానికి

చంద్రబాబు ప్రసంగించే సమయంలో వెనుదిరిగిన ప్రజలు

యర్రగొండపాలెం: చంద్రబాబు ఎదుట తమ బలం నిరూపించుకోవటానికి మార్కాపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పోటీ పడ్డారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. సభా ప్రాంగణంలోకి వచ్చిన ప్రజలు బాబు ప్రసంగం వినకుండా వెలిగొండ కాలువ చూడటానికి పరుగులు తీశారు. సభా ప్రాంగణంలోని కుర్చీలు ఖాళీగా లేకుండా చూసేందుకు పోలీసులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాలువ వద్దకు గుంపులు గుంపులుగా వెళ్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నా వారిని లెక్కచేయకుండా బారికేడ్లు నెట్టుకుంటూ కాలువ వద్దకు చేరారు. సభా వేదిక ముందు పలు వరసల్లో ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన వారి మెడలో ఆకుపచ్చ రంగు కండువాలు కప్పి కూర్చోపెట్టారు. సభా ప్రారంభంలో రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ ఊకదంపుడు ప్రసంగాలతో పాటు చంద్రబాబును ఆకాశాన్ని ఎత్తారు. ఆ ప్రసంగాలు వినే ఓపిక తమకు లేదని, తాము వచ్చింది వెలిగొండ కాలువ చూడటానికి అని అరకొరగా వచ్చిన జనం కూడా బాబు మాట్లాడుతుండగానే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ముందు భాగాన కూర్చొని ఉన్న నిర్వాసితులు మాత్రం ఎటూ వెళ్లలేక గత్యంతరంలేక కుర్చీలను అంటిపెట్టుకొని ఉండాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement