శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినం. అధర్మాన్ని నశింపజేసి, ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా భాద్రపద మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5253వ జయంతిని పురస్కరించుకుని తేదీలపై ఏర్పడిన సందిగ్ధతకు సంబంధించి పండితులు స్పష్టతనిచ్చారు. సాధారణ గృహస్థులు సెప్టెంబరు 4న, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు సెప్టెంబరు 5న జన్మాష్టమిని నిర్వహించుకోనున్నారు. దహీ-హాండీ ఉత్సవాన్ని సెప్టెంబరు 5న నిర్వహిస్తారు.
తిథి, పూజా ముహూర్త వివరాలు
అష్టమి తిథి: సెప్టెంబరు 4న తెల్లవారుజామున 02:25 గంటలకు ప్రారంభమై, సెప్టెంబరు 5న అర్ధరాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది.
పూజా ముహూర్తం: సెప్టెంబరు 4న రాత్రి 11:57 గంటల నుంచి సెప్టెంబరు 5న తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఉంటుంది.
రోహిణీ నక్షత్రం: సెప్టెంబరు 4న అర్ధరాత్రి 12:29 గంటలకు మొదలై, అదే రోజు రాత్రి 11:04 గంటలకు పూర్తవుతుంది.
జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి వేళ గోపాలుని విగ్రహానికి పంచామృత స్నానం చేయించి, నూతన వస్త్రాలు, కిరీటం, నెమలిపింఛం, వేణువుతో విశేష అలంకరణలు చేస్తారు. ఉయ్యాలలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి వెన్న-పటికబెల్లం (మాఖన్-మిశ్రీ), తులసీదళాలు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాల్లో రాత్రి వేళల్లో విశేష భజనలు, సంకీర్తనలు, భగవద్గీత పారాయణలు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: ‘ఖాళీ చేసిన నాలుగు గంటలకే హోటల్ కొట్టుకుపోయిది’


