ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం స్పష్టమవుతోంది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కంటే ఇప్పుడు ఆయన భార్య, మైన్‌పురి ఎంపీ డింపుల్ యాదవ్ ఎక్కువగా రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ రాజకీయాల ఆరోపణలకు దూరంగా ఉంచిన ఆమెనే ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనేందుకు అఖిలేశ్ కీలక అస్త్రంగా ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తోంది.
2017లో రాహుల్ గాంధీ చేసిన కుటుంబ రాజకీయాల విమర్శల నేపథ్యంలో అఖిలేశ్.. తన భార్య డింపుల్ యాదవ్ ఇక ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించారు. కానీ ఆ హామీ ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో కన్నౌజ్ నుంచి పోటీ చేసి ఓడిన డింపుల్.. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత 2022లో మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారు. 2024లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వరుస విజయాలతో ఆమె కేవలం యాదవ్ కుటుంబ వారసురాలిగానే కాకుండా, సొంత రాజకీయ గుర్తింపు ఉన్న నాయకురాలిగా ఎదిగారు.
జంతర్ మంతర్ నుంచి లక్నో వరకు..
ఈ మధ్యకాలంలో డింపుల్ రాజకీయం మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో ఆమె పాల్గొనడం, గాయపడిన నిరసనకారులను పరామర్శించడం చర్చనీయాంశమైంది. అఖిలేశ్ పార్లమెంట్‌లో ఉండగా.. డింపుల్ రోడ్డుపై నిరసనకారుల మధ్య కనిపించడం ఆమెకు నెక్ట్స్‌లెవల్ పొలిటికల్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది.
ఆగస్టు 26న లక్నోలోని లోహియా సభాగార్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ డింపుల్ కేంద్రబిందువుగా నిలిచారు. మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిండిన వేదికపై అఖిలేశ్ ఒక్కరే ఉన్నారు. డింపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ను ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ఏటా రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ మహిళా ఓటు బ్యాంకుపై నేరుగా గురిపెట్టారు.
మహిళా ఓటర్లే లక్ష్యం
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చాలాకాలంగా మహిళా ఓటర్ల మద్దతు బలహీనంగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో బీజేపీకి ఎస్పీ కూటమిపై గణనీయమైన ఆధిక్యం లభించింది. గతంలో ఎస్పీ పాలనలో శాంతిభద్రతలు, మహిళల భద్రత అంశాలను బీజేపీ పదేపదే ప్రచారాస్త్రంగా ఉపయోగించింది.
ఇప్పుడు డింపుల్‌ను ముందుకు తీసుకురావడం ద్వారా ఆ ప్రతికూల ముద్రను కొంతమేర మార్చాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహిళల భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలపై డింపుల్ గళం వినిపిస్తున్నారు. మహిళలను ‘ఆధీ ఆబాదీ’(మెజారిటీ సమాజం)గా పరిగణిస్తూ పీడీఏ(పిచ్డా(OBC), దళిత్, అల్పసంఖ్యక్) సామాజిక సమీకరణాన్ని మరింత విస్తరించాలన్న సంకేతాలను ఇస్తున్నారు.
ఆ ఫలితాలే ధైర్యానిచ్చాయా?
2024 లోక్‌సభ ఎన్నికలు ఎస్పీకి కొత్త ఊపునిచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. ఇండియా కూటమి మొత్తం 43 స్థానాలను దక్కించుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో లోక్‌సభ విజయాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని అఖిలేశ్ వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లలో బీజేపీకి ఉన్న పట్టు సడలిస్తేనే అసెంబ్లీ పోరులో ఎస్పీకి గణనీయమైన లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే డింపుల్ యాదవ్‌ను మహిళా ముఖంగా ముందుకు తీసుకురావడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది.
రాజకీయంగా అఖిలేశ్ దూకుడైన నేతగా కనిపిస్తే.. డింపుల్ అదే పోరాటాన్ని మరింత సౌమ్యమైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలరన్న అంచనా ఉంది. కుటుంబ వారసత్వం నుంచి వచ్చినప్పటికీ రెండు విజయాలతో తనకు తానుగా ఓ రాజకీయ బలం సంపాదించుకున్నారన్నది ఎస్పీ వర్గాల నమ్మకం. అందుకే ఒకప్పుడు కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి తప్పించేందుకు ఎన్నికలకు దూరంగా ఉంచిన డింపుల్.. ఇప్పుడు 2027లో అఖిలేశ్‌కు బీజేపీపై పోరులో అత్యంత కీలకమైన రాజకీయ అస్త్రంగా మార్చుతున్నారనే విశ్లేషణలు యూపీ రాజకీయాల్లో నడుస్తున్నాయి.
ఇదీ చదవండి: విజయ్.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం!


