తీహార్‌ జైల్లో అమెరికన్‌ సైనికుడు.. విడుదలకు కుటుంబ సభ్యుల అభ్యర్థన | American Citizen Held in Tihar on Terror Conspiracy Charges Family Seeks Intervention | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైల్లో అమెరికన్‌ సైనికుడు.. విడుదలకు కుటుంబ సభ్యుల అభ్యర్థన

Aug 31 2026 12:50 PM | Updated on Aug 31 2026 1:07 PM

American Citizen Held in Tihar on Terror Conspiracy Charges Family Seeks Intervention

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీహార్‌ జైలులో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరుడు, మాజీ సైనికుడు మాథ్యూ వాన్‌డైక్‌కు ప్రాథమిక ఖైదీ హక్కులు లభించడం లేదని, అతని ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని, అతడిని స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. మార్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వాన్‌డైక్‌ను అరెస్టు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సెక్షన్‌ 18 కింద ఉగ్రవాద కుట్ర అభియోగాలు నమోదు చేసింది.

అనుమతి లేకుండా మిజోరంలో ప్రవేశించి, అక్రమంగా మయన్మార్‌కు వెళ్లినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. మయన్మార్‌లోని సాయుధ గ్రూపులకు డ్రోన్ల అసెంబ్లింగ్, ఆపరేషన్, జామర్ల వినియోగం వంటి యుద్ధ శిక్షణ అందించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ గ్రూపులు ఐరోపా నుంచి డ్రోన్లు తెప్పించి, ఈశాన్య భారత నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు చేరవేసేందుకు ప్రణాళిక రచించినట్లు ఆరోపించింది.

ప్రస్తుతం తీహార్‌లోని జైలు నంబర్‌ 8/9లో ఉన్న వాన్‌డైక్‌ కంటిచూపు మందగించిందని, కాలి గాయంతో నడవలేక వీల్‌చైర్‌కే పరిమితమయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు, కుటుంబంతో మాట్లాడేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జైలులోని ఆహారం పడక 14 కిలోల బరువు తగ్గాడని, ప్రత్యేక ఆహారం కోసం ఆయన గతంలో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. బాల్టిమోర్‌కు చెందిన వాన్‌డైక్ ‘సన్స్‌ ఆఫ్‌ లిబర్టీ ఇంటర్నేషనల్‌’ వ్యవస్థాపకుడిగా లిబియా, సిరియా, ఉక్రెయిన్ వంటి యుద్ధ క్షేత్రాల్లో పనిచేశారు. ఆయనకు సీఐఏతో సంబంధాలున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, బహిరంగ ఆధారాలు లేవని తేలింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు.

ఇది కూడా చదవండి: వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement