అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్‌ ఎదురుదెబ్బ! | West Asia Tensions Flare Again: US Strikes Iran Tehran Hits Back | Sakshi
Sakshi News home page

అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్‌ ఎదురుదెబ్బ!

Aug 31 2026 6:37 AM | Updated on Aug 31 2026 6:44 AM

West Asia Tensions Flare Again: US Strikes Iran Tehran Hits Back

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధిలోని ఇరాన్‌ లారక్‌ దీవిపై అమెరికా దాడి చేయగా.. ప్రతీకారంగా ఇరాన్‌ అమెరికా బలగాలపై క్షిపణి దాడులకు దిగింది. లారక్‌ దీవిలో ఇరాన్‌ రాకెట్‌ లాంచర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది.

హర్ముజ్‌ జలసంధిలోని లారక్‌ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్‌ లాంచర్‌ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లారక్‌పై జరిగిన దాడి.. జూలై చివరి తర్వాత ఇరాన్‌ భూభాగంపై అమెరికా చేసిన తొలి దాడిగా తెలుస్తోంది.

అమెరికా అధికారుల ప్రకారం.. లారక్‌లోని లాంచర్లు హర్ముజ్‌ జలసంధిలో సముద్ర మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జలమార్గంలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా దాడి చేసినట్లు వాషింగ్టన్‌ చెబుతోంది.

‘ప్రతీకారం తప్పదు’.. ఇరాన్‌ హెచ్చరిక
అమెరికా దాడిని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. లారక్‌ దాడిలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్‌ వెల్లడించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌(IRGC)  హెచ్చరించింది. అమెరికా దాడికి ‘ప్రతిస్పందన, శిక్ష’ ఉంటుందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. జోర్డాన్‌లో అమెరికా బలగాలు ఉన్న కింగ్‌ హుస్సేన్‌, అల్‌ అజ్రాక్‌ స్థావరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. ఇరాన్‌ దాడిలో రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

8 క్షిపణులను అడ్డుకున్న జోర్డాన్‌
ఇరాన్‌ దాడులను జోర్డాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలోనే కూల్చివేసినట్లు తెలిపింది. దీంతో ఇరాన్‌–అమెరికా ఘర్షణ ప్రభావం ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

హర్ముజ్‌ జలసంధే అసలు కేంద్రం
ఈ మొత్తం పరిణామాలకు హర్ముజ్‌ జలసంధే కీలక కేంద్రంగా మారింది. ఇరాన్‌కు చెందిన లారక్‌ దీవి హార్ముజ్‌ దీవికి దక్షిణంగా, ఖేష్మ్‌ దీవికి తూర్పున ఉంది. సుమారు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. లారక్‌లో IRGC నేవీ స్థావరం కూడా ఉంది.

ప్రపంచ ఇంధన సరఫరాకు హర్ముజ్‌ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. దీంతో ఈ జలమార్గంలో మైన్లు వేయాలన్న ఇరాన్‌ చర్యలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.

ఒమన్‌ వైపు మారిన నౌకలు
హర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు ఒమన్‌ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే ఆ మార్గంలోనూ ఇరాన్‌ మైన్లు అమర్చే సామర్థ్యం కలిగి ఉంటే.. అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్‌ డెస్‌ రోచెస్‌ విశ్లేషించారు.

ట్రంప్‌ ‘జీరో టాలరెన్స్‌’ హెచ్చరిక
హర్ముజ్‌లో మైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు. మైన్లను అమర్చే ఏ నౌక లేదంటే పడవనైనా ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. మైన్ల ఏర్పాటు విషయంలో ‘జీరో టాలరెన్స్‌’ విధానం అమల్లో ఉందని ట్రంప్‌ స్పష్టం చేశారు.

పెరిగిన చమురు ధరలు.. ముదిరిన ఆందోళన
అమెరికా లారక్‌ దాడి వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి. హార్ముజ్‌ జలసంధిలో నౌకాయానం మరింత దెబ్బతింటే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.

అమెరికా–ఇరాన్‌ మధ్య తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణను మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఒకవైపు హర్ముజ్‌ జలసంధిలో నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆ మార్గంపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోంది. లారక్‌పై అమెరికా దాడి, దానికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడం.. ఈ పోరాటం మళ్లీ నేరుగా ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణగా మారుతున్న సంకేతాలను ఇస్తోంది. 

ఇదీ చదవండి: 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement