ఆగని కన్నీటి వరద | Nepal death toll rises to 794 | Sakshi
Sakshi News home page

ఆగని కన్నీటి వరద

Aug 31 2026 5:18 AM | Updated on Aug 31 2026 5:18 AM

Nepal death toll rises to 794

నేపాల్‌లో 794కి చేరిన మృతుల సంఖ్య  

మరో 2,502 మంది ఆచూకీ గల్లంతు  

కొనసాగుతున్న గాలింపు చర్యలు  

ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామన్న అధికారులు  

కఠ్మాండు: నేపాల్‌లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది. ఇంకా 2,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకస్మిక వరదల ధాటికి గల్లంతైన వారి కోసం వరుసగా ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగించారు. సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతూ ముమ్మరంగా పని చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 794 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు.

ఆగస్ట్‌ 26వ తేదీన నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను తుడిచిపెట్టేశాయి. కీలకమైన మౌలిక సదుపాయాలను దారుణంగా దెబ్బతిన్నాయి. జలవిద్యుత్‌ కేంద్రాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో 2,502 మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మూడు జిల్లాల్లో 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారని నేపాల్‌ విద్యాశాఖ ప్రకటించింది. 

గల్లంతైన వారిలో 320 మంది విదేశీయులు ఉన్నారు. అదృశ్యమైన తమ బంధువుల కోసం ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో 17 మాత్రమే గుర్తించగలిగారని పోలీసులు తెలిపారు. అనేక మృతదేహాలు చాలావరకు కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు 96 మృతదేహాలను ఖననం చేశారు.  

సహాయక శిబిరాల్లో సమస్యలు తీవ్రం  
నేపాల్‌లో అత్యవసర పరిస్థితి ఇంకా ముగియలేదు. బాధితులు తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. రసువాలో 3, నువాకోట్‌లో 15 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన సుమారు 3,500 మందికి పాఠశాలలు, ప్రభుత్వ, సామాజిక భవనాలలో తాత్కాలిక వసతి కల్పించారు. గర్భిణులు, బాలింతలు, వైద్య సంరక్షణ అవసరమైన వారితో సహా వృద్ధులు, చిన్నారులకు ఈ శిబిరాల్లో ఆశ్రయం కలి్పస్తున్నారు. అయితే ఈ శిబిరాల్లో తాగునీరు, పారిశుధ్య సదుపాయాల కొరత వేధిస్తోంది. ఇక్కడ జనం కిక్కిరిసిపోయి ఉండడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మత సంస్థలు బాధితులకు సేవలందిస్తున్నాయి.  

సొరంగంలో కా ర్మీకుల కోసం గాలింపు  
వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్‌ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్‌ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్‌ ప్రాజెక్టుల వద్ద 537 మంది కా ర్మీకులు, ఉద్యోగుల ఆచూకీ తెలియకుండా పోయింది. త్రిశూలి–3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగం వీటిలో ఒకటి. ఈ సొరంగంలో 42 మంది చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా భూగర్భ పవర్‌హౌస్‌ మరమ్మతు పనుల్లో ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తించింది. వారిని కాపాడేందుకు ప్రభుత్వం 90 మంది సభ్యుల సహాయక బృందాన్ని రంగంలోకి దించింది.  సమయస్ఫూర్తి ప్రదర్శించి, పిల్లల ప్రాణాలు కాపాడిన రాజేంద్ర దవాడీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.  

భయపెడుతున్న భోటే కోశీ నది  
త్రిశూలి నదిలో కొత్తగా వచ్చిన వరద ధాటికి ఆదివారం మరో వంతెన ఆదివారం ఉదయం కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో గండకి గ్రామీణ మున్సిపాలిటీ ప్రజలు పృథ్వీ హైవేకి వెళ్లే మార్గం తెగిపోయింది. దీంతోపాటే భోటే కోశీ నదిలో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటివరకు ఆహార పదార్థాలతో కూడిన 37 ట్రక్కులు, ఆహారం, ఇతర సామగ్రితో నిండిన ఏడు హెలికాప్టర్లను పంపించారు. భారత ప్రభుత్వం 68.5 టన్నుల సహాయక సామగ్రిని అందజేసింది. గాలింపు, సహాయక చర్యల్లో సహకరించేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్‌ నిపుణులను పంపించింది. 11 టన్నుల సహాయక సామగ్రితో విమానం ఆదివారం భారత్‌ నుంచి నేపాల్‌కు చేరుకుంది.  

1,643 మంది విద్యార్థుల్ని కాపాడిన టీచర్‌
నేపాల్‌లోని వరద ప్రభావిత త్రిశూలి వ్యాలీలో ఓ ఉపాధ్యాయుడి అప్రమత్తత కారణంగా ఏకంగా 1,643 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడి త్రిభువన్‌ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్‌ టీచర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.20 గంటల సమయంలో ఆయనకు ఓ స్నేహితుడి నుంచి వరద హెచ్చరిక అందింది. నది పక్కనే ఉన్న ఈ మూడంతస్థుల పాఠశాల భవనంలో 1,643 మంది విద్యార్థులున్నారు. హెచ్చరిక అందగానే రాజేంద్ర దవాడీ అప్రమత్తమయ్యాడు. వెంటనే బడిగంట కొట్టి విద్యార్థులందరినీ బయటకు తీసుకురావాలని మిగతా టీచర్లకు హెచ్చరికలు జారీచేశాడు. స్కూల్‌ బస్సు డ్రైవర్లను అప్రమత్తంచేశాడు. బస్సుల్లో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్కూల్‌ వరద బురదలో మునిగింది.

శిథిలాల కింద మృత్యువుతో 3 రోజుల పోరాటం
ప్రాణాలతో బయటపడిన ఆరేళ్ల చిన్నారి  
ఆరేళ్ల బాలిక శిథిలాల కింద మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేని ప్రాణాలతో బయటపడింది. వరదలవల్ల అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో బుధవారం వరదతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, శుక్రవారం ఓ చిన్నారి రోదన వినిపించింది. శిథిలాలను తొలగించి ఆ బాలికను వెంటనే బయటకు తీశారు. తీవ్రంగా గాయాల పాలైనప్పటికీ సజీవంగా ఉండడంతో శుక్రవారమే హెలికాప్టర్‌లో కఠ్మాండులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయతి్నంచగా ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. శనివారం ఆసుపత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement