ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యుల బృందం చిక్కుకుంది. ఆగస్టు 26న వారు గైరోంగ్ వద్ద గల ఇమ్మిగ్రేషన్ భవనంలో ఉండగా ఈ విపత్తు సంభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు, బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సేవకులతో కలిసి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ అధికారులను, రాయబార కార్యాలయాలను కోరారు.
ఈ బృందంలో పలు దేశాలకు చెందిన 34 మంది పురుషులు, 46 మంది మహిళలతో పాటు ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడు ఉన్నారు. అమెరికా నుంచి 22 మంది, కెనడా నుంచి 12 మంది, ఆస్ట్రేలియా నుంచి 11 మంది, బ్రిటన్ నుంచి 9 మందితో పాటు జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, రష్యా తదితర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. బుధవారం ఉదయం 9:05 గంటలకు గ్రూప్ లీడర్ ప్రవీణ్ తాము ఇమ్మిగ్రేషన్ ప్రాంతానికి చేరుకున్నామని సందేశం పంపారని, సరిగ్గా 9:14 గంటల సమయంలో వరద విరుచుకుపడిందని సద్గురు పేర్కొన్నారు. ఆ తర్వాత వారి ఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు.
వరదల తీవ్రతకు ఇమ్మిగ్రేషన్ భవనం పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా రహదారులు, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. శిథిలాలు, ప్రమాదకర పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దాదాపు 484 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోందని, మొత్తం బాధితుల సంఖ్య 1,500 కంటే ఎక్కువగా ఉండవచ్చని సద్గురు అంచనా వేశారు. ప్రస్తుతం భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల సమాచారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం


