చెన్నై: మేకేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక, తమిళనాడు నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలపై అన్నాడీఎంకే నేత కోవై సత్యన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా కర్ణాటక నేతలు పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మేకేదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించారు. దీంతో, రెండు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది.
కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి మేకేదాటు ప్రాజెక్టుపై చేసిన తాజా వ్యాఖ్యలపై సత్యన్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మేకేదాటుపై కాంగ్రెస్ నేతలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఖండించదగినవి. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదు అంటూ సత్యన్ విమర్శలు కురిపించారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, రాజకీయ నాయకులు చట్టాన్ని, కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు.
జైలుకు వెళ్తారా..
ఇదే సమయంలో కేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తూ సత్యన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తీర్పు తమిళనాడుకు అనుకూలంగా ఉంది. మీరు మేకేదాటులో ఒక్క రాయి కూడా కదపలేరు. ఇదే నిజం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేరని సవాల్ విసిరారు. మంత్రి చెలువరాయస్వామిపై మరింత ఘాటుగా స్పందించిన సత్యన్.. మేకేదాటు విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పరప్పన అగ్రహార జైలుకెళ్లాలా? తీహార్ జైలుకెళ్లాలా? ఎక్కడ ఉండాలో ఆయనే ఎంచుకోవచ్చు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కావేరీ వివాదం..
మేకేదాటు ప్రాజెక్టు అంశం మరోసారి తమిళనాడు-కర్ణాటక రాజకీయాల్లో వేడి పెంచుతోంది. కావేరీ నదిపై ప్రతిపాదించిన ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును కర్ణాటక ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా.. తమిళనాడు మాత్రం మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మేకేదాటు ప్రాజెక్టు అమలైతే తమిళనాడుకు దక్కాల్సిన కావేరీ జలాల వాటాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నది తమిళనాడు వాదన. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదానికి కేంద్రంగా ఉంది.


