మార్పు ఎప్పుడు?
ఒక నల్లటి పొట్టి డ్రెస్.. ఒక 15 సెకన్ల వీడియో.. ఇద్దరు మహిళల జీవితాలను సవాలు చేసింది. వారిలో ఒకరు తమిళనాడు ఎంగెస్ట్ ఉమన్ మినిస్టర్. మరొకరు మలేషియా సాధారణ యువతి. ఆ సాధారణ యువతిని ‘పొట్టి డ్రస్సు వేసుకున్న మంత్రి’గా చూపి ట్రోల్ చేసిన ప్రత్యర్థులకు వారిద్దరూ కలిసి ఇచ్చిన సమాధానం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.
సమాజంలో మహిళ ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, లేదా తన ప్రపంచంలో తను ప్రశాంతంగా బతుకుతున్నా ఆమెను తక్కువ చేసి చూపించడానికి కొందరు వాడే పాత ఆయుధం... ఆమె వేసుకునే బట్టలు. తాజాగా తమిళనాడుకు చెందిన యువ మహిళా మంత్రి ఎస్.కీర్తన, మలేషియాకు చెందిన వినోషా రవి విషయంలో ఇదే జరిగింది. ఒక చిన్న తప్పుడు వీడియో ఇద్దరు మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? వారు దాన్ని భయంతో కాకుండా ధైర్యంతో ఎలా ఎదుర్కొన్నారు?
అసలేం జరిగింది?
గత 48 గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఒక నల్లటి పొట్టి దుస్తులు వేసుకున్న మహిళ కారు దిగుతున్న దృశ్యం అది. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు పారిశ్రామిక శాఖ మంత్రి ఎస్. కీర్తన అంటూ కొందరు రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ ప్రారంభించారు. ‘ఇలాంటి బట్టలతో పెట్టుబడులు తెస్తారా?’ అంటూ వెటకారం చేశారు. కానీ అసలు నిజం ఏమిటంటే... ఆ వీడియోలో ఉన్నది మంత్రి కీర్తన కాదు.
ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మలేషియాకు చెందిన వినోషా రవి అనే సాధారణ మహిళ. వినోషా చెప్పిన దాని ప్రకారం, ఆ వీడియోను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా తీసి ఇంటర్నెట్‌లో పెట్టి, దానికి తమిళనాడు మంత్రి పేరును తగిలించి తప్పుడు ప్రచారం చేశారు. ఒక అమాయకురాలి ప్రైవసీని దొంగిలించి, దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు.
‘నేనే అయితే తప్పేంటి?’...
అయితే ఈ వివాదాన్ని ఆ ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముందుగా మలేషియా నుంచి వినోషా రవి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘మా కొలీగ్ ఆ వీడియో పంపితే జోక్ అనుకున్నా. కానీ ఆ తర్వాత అది సీరియస్ అయ్యింది. నా ఇన్‌బాక్స్ నిండా బూతులు, వల్గర్ కామెంట్స్, బెదిరింపులు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను బయటకు వెళ్లాలన్నా, ఆఫీస్‌కి వెళ్లాలన్నా భయపడుతున్నాను. అయినా నేను నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోను’ అని తేల్చి చెప్పారు. ఈ పై ఆమె మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమిళనాడు మంత్రి కీర్తన చాలా దీటుగా స్పందించారు.
ఆగాలంటే ఏం చేయాలి?
ఇలా బట్టల ఆధారంగా జరిగే మానసిక దాడులు ఆగాలంటే ముందుగా సమాజంలో మార్పు రావాలి. ఒక మహిళ క్యారెక్టర్‌ను ఆమె వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేసే వికృతమైన ఆలోచనా విధానాన్ని వీడాలి. ఇక ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అస్సలు భయపడకూడదు. కీర్తన, వినోషాలాగే గొంతు విప్పి ధైర్యంగా ప్రశ్నించాలి. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలి. మౌనంగా ఉంటే ట్రోలర్లు మరింత రెచ్చిపోతారు.
ఈ సంఘటన ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి మహిళా సైబర్ భద్రత ముప్పుకు ఒక ఉదాహరణ. అయినా సరే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా, కేవలం కొన్ని వ్యూస్ కోసం ఒకరి జీవితాన్ని రోడ్డున పడేసే సైబర్ బూచీలకు చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చారు ఈ ఇద్దరు మహిళలు. మహిళల ప్రతిభను చూడాలే తప్ప, వారు వేసుకునే బట్టలను కాదు అనే సత్యాన్ని సమాజం ఎప్పుడు గ్రహిస్తుందో మరి!
‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కానీ ఒకవేళ నేనే అయినా అందులో తప్పేముంది? ఒక మహిళ ఏం వేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా? ఇది పురుషాధిక్య సమాజపు సంకుచిత, కురచ ఆలోచన’ అంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు, తన పోలికల వల్ల అనవసరంగా వివాదంలోకి లాగబడిన వినోషా రవికి క్షమాపణలు చెప్పారు. ‘నన్ను క్షమించు సోదరి. నువ్వు ఆ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నావు. నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు’ అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఇది రాజకీయాలకు అతీతమైన సిస్టర్ హుడ్.
ఈ ఘటనపై డిఎంకె ఎంపీ కనిమొళి కూడా స్పందిస్తూ ‘ఇది దుష్ట రాజకీయం. మహిళలను ఇలా టార్గెట్ చేయడం ఆపండి’ అంటూ కీర్తనకు మద్దతు పలకడం విశేషం. కీర్తన గతంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం సూట్ వేసుకుని వీడియో చేస్తే కూడా ట్రోల్ చేశారు. అంటే చీర కట్టినా, సూట్ వేసినా, షార్ట్ డ్రెస్ వేసినా..
దాడి మాత్రం ఆడవారిపైనే.


