బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ మళ్లీ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి బి. నాగేంద్ర.. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎం డీకే శివకుమార్‌కు స్వయంగా చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ఈ వ్యవహారంలో రాజకీయంగా తీవ్ర విమర్శలు దారి తీస్తోంది. అధికార పార్టీ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ ఖాతాల నుంచి నకిలీ చెక్కులు, ఫోర్జరీ పత్రాలు, ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా రూ.89.63 కోట్లు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ డబ్బు వందలాది బ్యాంకు ఖాతాల ద్వారా తిప్పి నగదు, బంగారం, ఇతర ఆస్తులుగా మార్చినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. నాగేంద్ర గతంలో ఈ వ్యవహారం కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి రాజీనామా అంశం తెరపైకి రావడంతో.. కర్ణాటక కాంగ్రెస్‌లో ‘నాగేంద్ర ఎపిసోడ్’ ఎటు దారితీస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
చదవండి: ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
అయితే, తన వల్ల పార్టీకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యానని నాగేంద్ర చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో న్యాయపరమైన ప్రక్రియలో తాను క్లీన్‌చిట్ పొందుతానన్న నమ్మకం ఉందని.. ఆ తర్వాత మళ్లీ మంత్రివర్గంలోకి వస్తానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
బీజేపీ విమర్శలు..
వాల్మీకి కార్పొరేషన్ నిధుల మళ్లింపు వ్యవహారాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. నాగేంద్ర రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 రోజుల పాదయాత్రకు కూడా సిద్ధమైంది. ఇదే సమయంలో నాగేంద్ర రాజీనామాకు ముందుకు రావడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజీనామా తీసుకోవాలా? వద్దా? అన్నదానిపై సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


