రేవంత్ నేల విడిచి సాము చేస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని చెప్పారు. తాడి చర్ల–2, పీకేఓసీ–2 బ్లాకులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్–3 సింగరేణికి దక్కేలా చర్యలు చేపట్టామన్నారు. 120 మిలియన్ టన్నుల నిల్వలున్న ఈ గని ద్వారా సంస్థకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి వల్ల సింగరేణి ఆర్థికంగా దెబ్బతింటోందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ. 55 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
విదేశీ పర్యటనలపై బాధ్యతారాహిత్యం...
తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదంటూ రేవంత్ చేస్తున్న ఆరోపణలు.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ముఖ్య మంత్రి, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటనలు ఖరారు చేసుకుంటారు. ఆదరాబాదరాగా లండన్ వెళ్లి, అక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకోవడం సరికాదు. విదేశీ పర్యటనల విషయంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విదేశాంగ శాఖ నిబంధనలు అమలులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలు, పర్యటించే వ్యక్తుల నేపథ్యం ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి. ఇది కేవలం పాలనాపరమైన అంశం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు’అని స్పష్టం చేశారు. 2005లో నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని గుర్తుచేశారు. గతంలో తనతో సహా పలువురు కేంద్రమంత్రుల పర్యటనలను కూడా విదేశాంగ శాఖ నిరాకరించిందని చెప్పారు. ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చిన, పాకిస్తాన్ అనుకూల వ్యక్తి, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడానికి రేవంత్ ఎందుకు ప్రయతి్నంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యారంగాన్ని విస్మరించి..
విదేశీ యూనివర్సీటీలను తీసుకొస్తామని గొప్పలు చెప్పుకునే రేవంత్‌రెడ్డి, ముందు రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి నిలదీశారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు, విద్యార్థులకు ఉచిత స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, మండలానికి అంతర్జాతీయ పాఠశాల ఇస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్త యూనివర్సీటీల మాట పక్కనబెట్టి, ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అట్టర్ ఫ్లాప్ అయిందని, హైదరాబాద్‌లోనే 20 శాతం ఇళ్లకు కూడా ఎన్యూమరేటర్లు వెళ్లలేదని ఎద్దేవా చేశారు.


