వేటు వేయండి! | TPCC disciplinary committee recommends strict action against Konda Surekha, Chinna Reddy | Sakshi
Sakshi News home page

వేటు వేయండి!

Aug 26 2026 1:11 AM | Updated on Aug 26 2026 1:11 AM

TPCC disciplinary committee recommends strict action against Konda Surekha, Chinna Reddy

మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం క్రమశిక్షణారాహిత్యమే

వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు

సురేఖకు క్రమశిక్షణారాహిత్యం అలవాటైపోయింది..

సుస్మిత వ్యాఖ్యలు సురేఖకు తెలియకుండా జరిగే అవకాశం లేదు 

ఓడినా కూడా చిన్నారెడ్డికి సముచిత గౌరవం దక్కింది.. అయినా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు 

పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌కు నివేదిక ఇచ్చిన కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీని కోరింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లురవి, సభ్యులు అనంతుల శ్యాంమోహన్, వాజిద్‌ హుస్సేన్‌ తదితరులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదికను ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందా..? లేక నేరుగా అధిష్టానం పరిశీలించి నిర్ణయం వెంటనే తీసుకుంటుందా? లేక ఏఐసీసీ స్థాయిలో వారిద్దరిని పిలిపించి వారి వివరణలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తికర చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

ఆమెను తప్పించడమే పరిష్కారం 
మంత్రి కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో ‘క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం సురేఖకు అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యమంతా వివాదాలతో కూడుకున్నదే. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రెండుసార్లు పార్టీకి క్షమాపణలు చెప్పి మళ్లీ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు. అమెను మంత్రి పదవి నుంచి తప్పించడమే సరైన చర్య అని భావిస్తున్నాం’ అని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. సురేఖకు సంబంధించి మూడు, చిన్నారెడ్డిపై రెండు పేజీల నివేదికతోపాటు ఇందుకు తగిన ఆధారాలను కూడా పొందుపరిచిన క్రమశిక్షణ కమిటీ ఇదే నివేదికను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు కూడా పంపినట్టు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

మంచి అవకాశమిచ్చాం... 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ చిన్నారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోయినా, గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశం ఇచ్చాం. కేబినెట్‌ హోదా ఇచ్చాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన కేబినెట్‌ సమావేశాలకు కూడా వస్తున్నారు. తొమ్మిదిసార్లు ఆయనకు పార్టీ టికెట్‌ ఇచ్చింది. పోటీ చేసేందుకు అవకాశామిచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడారని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ అని చిన్నారెడ్డి గురించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.  

హైకమాండ్‌ నిర్ణయం మేరకు చర్యలు: మల్లురవి 
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు నివేదిక ఇచ్చిన అనంతరం గాం«దీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లురవి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైందని చెప్పారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి గురించిన అన్ని విషయాలు, సిఫారసులను తమ నివేదికలో పొందుపర్చామని చెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ పంపుతారని చెప్పారు. ఏదైనా హైకమాండ్‌దే తుది నిర్ణయమని, తమ సిఫారసుల ద్వారా పార్టీ కేడర్‌కు ఓ సందేశం వచ్చేలా నివేదిక ఇచ్చామని మల్లురవి స్పష్టం చేశారు. పార్టీ పెద్దగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా సురేఖ, చిన్నారెడ్డి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కోణంలో ఆ ఇద్దరికి నోటీసులు ఇస్తే.. ఆ నోటీసులనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమాధానం ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన అంశం కొండా సురేఖకు తెలియకుండానే జరుగుతుందా అని పశి్నంచారు. సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసి నివేదికలోని అంశాలను వివరించడానికి ప్రయత్నించారు. కానీ రేవంత్‌ బిజీ షెడ్యూల్‌ కారణంగా కలవలేకపోయారని, వీలును బట్టి బుధవారం సీఎంను కలిసే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఏమి జరుగుతుందో? 
కఠిన చర్యలు తీసుకోవాలన్న క్రమశిక్షణ కమిటీ నివేదిక నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు హైకమాండ్‌ అంగీకరిస్తుందా? లేక గౌరవప్రదంగా ఆమెతో రాజీనామా చేయిస్తుందా..? లేక మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమె శాఖను మారుస్తారా.. ఇంతకు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు చిన్నారెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... అధికారిక పదవి నుంచి మాత్రమే తప్పిస్తారా లేదంటే మందలింపుతో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement