కోటా: రాజస్థాన్‌లోని కోటా జిల్లా పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం పాఠశాలలో భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలువురు చిన్నారులను స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, మరికొందరి కోసం పాఠశాల వద్దకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించారు.
VIDEO | Rajasthan: More than 27 students fell ill after allegedly consuming the mid-day meal provided at a Government Upper Primary School in the Ranpur police station area of Kota on Monday.
The students from 1-8 classes suffered from nausea, vomiting, stomach aches, and… pic.twitter.com/QxUpUx6sYf— Press Trust of India (@PTI_News) August 24, 2026
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రూప్ సింగ్ మీనా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, 10 నుంచి 12 మందిని మెడికల్ కాలేజీకి తరలించారని, అందులో నలుగురిని చేర్చుకుని మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిరంతర పర్యవేక్షణలో ఉంచామని అధికారులు తెలిపారు.
రాష్ట్ర మంత్రి మదన్ దిలావర్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. చిన్నారులందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆహార నాణ్యతపై విచారణకు ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. వీరి అనారోగ్యానికి భోజనమే కారణమా కాదా అన్నది దర్యాప్తు తర్వాత తేలనుంది. ఇటీవల బిహార్‌లోని నలంద జిల్లాలో ఉప్పుకు బదులు డిటర్జెంట్ పౌడర్ కలపడంతో 34 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరవకముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: అంటార్కిటికాకు ఫైబర్ నెట్.. షాకిస్తున్న భారీ ప్లాన్!


