యుద్ధం జరిగేది ఎక్కడో సరిహద్దుల్లో కావచ్చు.. కానీ దాని ప్రభావం మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిరుపేద కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా ఎగిసిపడుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల ఖర్చులు పేద దేశాల్లోని పాఠశాల విద్యపై భారీ పిడుగుపాటులా పరిణమించాయి. ఫలితంగా తల్లిదండ్రులు తమ చిన్నారుల చేతుల్లోని పుస్తకాలను లాగేసి, కుటుంబ ఆర్థిక అవసరాలు తీరేందుకు వారిని ప్రమాదకరమైన పనుల్లోకి నెడుతున్నారు.
వేల మైళ్ల దూరంలో యుద్ధ సెగలు
ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీస్తున్నాయి. ముడి చమురు, రవాణా ఛార్జీల పెరుగుదల వల్ల పేద దేశాల్లో సామాన్య కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. బతుకుదెరువు భారంగా మారడంతో, సరిహద్దు రేఖకు వేల కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న అట్టడుగు వర్గాల పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.
బోటు ప్రయాణం భారం.. తప్పని బాల కార్మికులు
కంబోడియాలోని టోన్లే సాప్ సరస్సు సరిహద్దుల్లో నివసించే 13 ఏళ్ల సౌ శ్రేయ్‌నిచ్ పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. భవిష్యత్తులో ఉపాధ్యాయురాలు కావాలని కలలు కంటున్న ఈ బాలిక చదువు ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. చేపల వేటపై ఆధారపడే ఆమె కుటుంబం, డీజిల్ ధరలు పెరగడంతో వేట సాగించలేకపోతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం చదువును మధ్యలోనే ఆపేసి, తల్లిదండ్రులతో కలిసి శ్రమించాల్సిన దుస్థితి నెలకొంది.
యూనిసెఫ్ హెచ్చరిక: పేదరికంలోకి మరో 2.34 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెప్) నివేదిక ప్రకారం ఈ సంక్షోభ ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అదనంగా 2.34 కోట్ల మంది పిల్లలు తీవ్ర పేదరికంలోకి చేరుకుంటారు. ఇందులో సుమారు 80 శాతం మంది చిన్నారులు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాలకు చెందినవారే ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
హోటల్ పనుల్లోకి బాలికలు
వియత్నాంలో 16 ఏళ్ల లీ, 13 ఏళ్ల న్హీ అనే అక్కాచెల్లెళ్ల కుటుంబం డీజిల్ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వారి తండ్రి చేపల వేట ఆగిపోవడంతో, తొమ్మిది మంది పిల్లల కుటుంబ పోషణ కష్టమై, ఆ ఇద్దరు బాలికలు హనోయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో ప్రమాదకరమైన పనుల్లో చేరాల్సి వచ్చింది. బాల కార్మిక చట్టాల ఉల్లంఘనకు దారితీసిన ఈ పరిస్థితిని గుర్తించిన బ్లూ డ్రాగన్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ జోక్యంతో వారు తిరిగి పాఠశాలకు చేరుకోగలిగారు.
పాఠశాలల నిర్వహణపై తీవ్ర వ్యయ భారం
ఇంధన ధరల భారం విద్యార్థుల ప్రయాణానికే కాకుండా పాఠశాలల నిర్వహణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మారుమూల ప్రాంతాలకు ఉపాధ్యాయులు చేరుకోవడం, విద్యా సామగ్రి సరఫరా చేయడం, విద్యుత్ ఛార్జీలు చెల్లించడం వంటివి పాఠశాలలకు భారంగా మారాయి. ప్రభుత్వాలు ఇంధన, ఆహార సబ్సిడీలకే ఎక్కువ నిధులు కేటాయించాల్సి రావడంతో విద్య, వైద్య రంగాల బడ్జెట్‌లపై తీవ్ర కోతలు పడుతున్నాయి.
మధ్యాహ్న భోజనంపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46.6 కోట్ల మంది పిల్లలు బడిలో పెట్టే మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడి చదువుకుంటున్నారు. రవాణా, ఎరువుల ధరలు పెరగడంతో ఈ పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు, దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి పెరిగినప్పుడు మగపిల్లల చదువులకే ప్రాధాన్యం ఇస్తూ, ఆడపిల్లలను బడి మానిపించడం, బాల్య వివాహాలు చేయడం పెనుముప్పులా పరిణమించిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా!


