వాషింగ్టన్: చంద్రుడి ఉపరితలంపై స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం ఢీకొన్న ప్రదేశాన్ని ‘నాసా’ స్పష్టంగా గుర్తించింది. ఈ క్రాష్ కారణంగా చంద్రుడిపై దాదాపు 60 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు గల భారీ గుంత ఏర్పడినట్లు నాసా విడుదల చేసిన తాజా చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఫాల్కన్-9 రాకెట్‌ను 2025 జనవరి 15న ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌కు చెందిన ‘బ్లూ ఘోస్ట్ 1’ లూనార్ ల్యాండర్‌ను చంద్రుడి వైపు పంపేందుకు ప్రయోగించారు. ల్యాండర్‌ను విజయవంతంగా చేర్చిన అనంతరం, రాకెట్ పైభాగం అంతరిక్షంలోనే మిగిలిపోయింది. కక్ష్యలో మార్పుల కారణంగా అది చంద్రుడి వైపు ప్రయాణించి ఆగస్టు 5న ఉపరితలాన్ని ఢీకొంది. ఈ ఘటన వల్ల భూమికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.
ఆగస్టు 11, 12 తేదీల్లో నాసాకు చెందిన లూనార్ రీకానైసెన్స్ ఆర్బిటర్ ఈ చిత్రాలను తీసింది. చంద్రుడికి 96 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ ద్వారా సరైన యాంగిల్‌లో చిత్రాన్ని బంధించడం అత్యంత సంక్లిష్టంగా మారింది. ఇందులో 10 సెకన్ల తేడా వచ్చినా కెమెరా బిలాన్ని దాటి 16 కిలోమీటర్ల దూరాన్ని చూపించేదని శాస్త్రవేత్తలు తెలిపారు. క్రాష్ ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించడంలో దక్షిణ కొరియాకు చెందిన ‘దనూరి’ ఆర్బిటర్ డేటా కూడా ఎంతో దోహదపడింది.
తీవ్రమైన తాకిడి వల్ల ఉపరితలం కింద ఉన్న దాదాపు 1.5 అడుగుల లోపలి మట్టి, రాళ్లు బయటకు వెదజల్లినట్లు పడ్డాయి. బిలం అంచులలో కొత్త మట్టి కాంతివంతంగా కనిపిస్తుండగా, పాత ధూళి ముదురు రంగులో కనిపిస్తోంది. ఈ నమూనాల ఆధారంగా చంద్రుడి అంతర్భాగంపై పరిశోధనలు జరుపుతున్నామని, భవిష్యత్ మానవ సహిత చంద్రయానాలు, పరికరాల భద్రతకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: గేదె ఇవ్వలేదని భార్య హత్య.. ఆరేళ్ల తర్వాత..


