టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇరాన్ విధించిన ఏడు షరతులను నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధిని ఎట్టిపరిస్థితుల్లో తిరిగి తెరవబోయేది లేదని తెలిపింది. ఈ ఏడు షరతులు జూన్‌లో ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం అనగా.. ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MOU) ఆధారంగా ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ స్పీకర్ కీలక ప్రకటన విడుదల చేశారు.
మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ, "ఇరాన్ వైఖరి “పూర్తిగా స్పష్టంగా, దృఢంగా” ఉంది. అమెరికా ఈ ఏడు షరతులను అమలు చేసే వరకు హోర్ముజ్ జలసంధి తెరవడం జరగదు. ఒకవైపు అమెరికా బహిరంగంగా ఒక రకమైన సందేశాలు ఇస్తూనే, మరోవైపు మధ్యవర్తి ద్వారా వేరే ప్రతిపాదనలు పంపుతోంది. ఇకపై చర్చల్లో జాప్యాన్ని లేదా అమెరికా ఏకపక్ష డిమాండ్లను ఇరాన్ అంగీకరించదు". అని అన్నారు. ఇరాన్ నుంచి వచ్చిన దౌత్య ప్రతిపాదనకు అమెరికా ఇచ్చిన సమాధానం కొన్ని రోజుల క్రితమే తమకు అందిందని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే, ఏడు రోజుల్లో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో అరాఘ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడానికి అమెరికా అంగీకరించాల్సిన షరతులను ఇరాన్ ఇప్పటికే స్పష్టంగా తెలియజేసిందని ఆయన అన్నారు.
అమెరికా దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలని ఇరాన్ ఆశిస్తోందని అరాఘ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అమెరికా మళ్లీ సైనిక చర్యల వైపు వెళితే, దానికి ప్రతిస్పందించేందుకు ఇరాన్ గతంలో కంటే “మరింత సిద్ధంగా ఉంది” అని హెచ్చరించారు. వారు సైనిక పరిష్కారాల వైపు వెళితే, మేము గతంలో కంటే మరింత సిద్ధంగా ఉన్నాం అని అరాఘ్చీ పేర్కొన్నారు.
ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంతో ఏడు రోజుల విశ్వాస నిర్మాణ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని మరింత విస్తృత రూపంలో పునరుద్ధరించడంతో పాటు, ఇరాన్ అణు కార్యక్రమం హర్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకోవడం ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం.
అయితే.. ఓవైపేమో ఇరాన్ అమెరికాతో ఒప్పందం కోసం యత్నిస్తుంటే మరోవైపేమో అమెరికన్లు, ఇజ్రాయెల్ దేశస్థులపై దాడులు తీవ్ర కలకలం రేవుతున్నాయి. ఇటీవలే దుబాయి నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ప్లై దుబాయ్ విమానాన్ని కో ఫైలట్ హమాం అల్ హమామి కూల్చే యత్నం చేయగా భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహాసాలతో ఈ ఫ్లైట్‌ను కాపాడిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి దాడులు మరికొన్ని చేయాలని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా పిలుపునిచ్చింది. తన మద్ధతుదారులు ప్రారంభించిన అల్బయాన్ పత్రికలో ఈ ప్రకటన విడుదల చేసింది దీంతో వాతావరణం ఆందోళన కరంగా మారింది.


