ఆసిమ్ మునీర్‌కు బిగ్‌ షాక్‌.. పాక్‌లో భగ్గుమన్న ‘సింధుదేశ్’ చిచ్చు | Protest against Asim Munir in karachi | Sakshi
Sakshi News home page

ఆసిమ్ మునీర్‌కు బిగ్‌ షాక్‌.. పాక్‌లో భగ్గుమన్న ‘సింధుదేశ్’ చిచ్చు

Nov 24 2026 7:16 PM | Updated on Nov 24 2026 7:43 PM

Protest against Asim Munir in karachi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ప్రావిన్సుల పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా కరాచీలో వేలాది మంది ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో ముడిపడి ఉన్న ఈ సరిహద్దుల మార్పు యత్నాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సింధ్ ప్రావిన్సును విడగొడితే సహించేది లేదని, అవసరమైతే ప్రత్యేక ‘సింధుదేశ్’ దిశగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

నాలుగు సింధీ జాతీయవాద పార్టీల కూటమి అయిన ‘జీయ్ సింధ్ రహబర్ కమిటీ’ ఆధ్వర్యంలో కరాచీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, పౌర హక్కుల కార్యకర్తలు, సాధారణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సింధ్ నుంచి కరాచీని వేరు చేసే కుట్ర జరుగుతోందని, తమ చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసే ఏ నిర్ణయాన్నైనా అడ్డుకుంటామని నిరసనకారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో పంజాబ్,సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ అనే నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. వీటిని 12 నుంచి 15 చిన్న ప్రావిన్సులుగా విభజించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ కొత్త ప్రావిన్సుల అంశాన్ని ప్రస్తావించగా, 2026 చివరి నాటికి ప్రజాభిప్రాయ సేకరణపై చర్చలు ఒక రూపుకు రావచ్చని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ పునర్విభజనకు సంబంధించిన అధికారిక బ్లూప్రింట్ మాత్రం ఇంకా బహిర్గతం కాలేదు.

‘జీయ్ సింధ్ ముత్తాహిదా మహజ్’ వంటి జాతీయవాద సంఘాలు పంజాబ్ ప్రావిన్సుపై ఆర్థిక దిగ్బంధనం విధిస్తామని హెచ్చరించాయి. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధం చేయడానికి యత్నిస్తున్నాయని ఆరోపించాయి.

మరోవైపు, ఈ వివాదం పాక్ రాజకీయాలనూ వేడెక్కించింది. ఫెడరల్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సైతం సింధ్ బలవంతపు విభజనను తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ ప్రక్రియలు, ప్రజాభిప్రాయం లేకుండా బలవంతంగా ప్రావిన్సును విడదీస్తే సమాజంలో తీవ్ర విభేదాలు తలెత్తి, పరిస్థితి చేయిదాటి రక్తపాతానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నవంబర్ 29న మరో భారీ నిరసన కార్యక్రమానికి జాతీయవాద సంఘాలు పిలుపునిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement