న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొచ్చే తేదీని ప్రకటించారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ వెల్లడించారు. 1971 విముక్తి పోరాటంలో విజయం సాధించిన సందర్భంగా బంగ్లాదేశ్ జరుపుకొనే విజయ్ దివస్ రోజునే ఆమె తిరిగిరావాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హసీనా తిరుగు ప్రయాణానికి అవసరమైన పత్రాలను అందించాలని, ఢిల్లీ నుంచి ఢాకా వెళ్లేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వ విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలోనే తనను భారత్‌కు తీసుకొచ్చినందున.. తిరిగి వెళ్లేందుకు కూడా ఆ దేశ ప్రభుత్వమే విమాన ప్రయాణ ఏర్పాట్లు చేయాలని హసీనా ప్రతినిధి పేర్కొన్నారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా హసీనాను దేశం నుంచి బయటకు పంపించారని మొజమ్మెల్ అలీ ఆరోపించారు. అందువల్ల డిసెంబర్ 16న ఆమె తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అయితే హసీనా తిరిగొస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బంగ్లాదేశ్ మంత్రి ఒకరు ఆదివారం ప్రకటించారు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కూడా స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించలేదు. హసీనా ప్రకటించిన తేదీ సమీపిస్తుండటంతో ఆ దేశంలో రాజకీయ, న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: జేబులో రూ.24.. ఖాతాలో రూ.కోటి.. తలరాత మార్చిన ‘కేబీసీ’!


