రూ. 24 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ
భూకంపం తర్వాత నేపాల్ పునర్ నిర్మాణ, అభివృద్ధికి భారత్ సాయం
అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్‌కు రైలు సర్విస్ ప్రారంభం
విస్తృత సహకారంపై పలు ఒప్పందాలు ఖరారు
నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఇరుదేశాల బంధం హిమాలయాలంత ఉన్నతమన్న షా
సరిహద్దు వివాదం పరిష్కారానికి ఇరు నేతల కృషి
న్యూఢిల్లీ/పితోర్‌గఢ్: పొరుగుదేశం భారత్‌లో పర్యటనకు విచ్చేసిన నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాకు భారత్ విస్తృతస్థాయి ఆర్థికసాయంతో సాదర స్వాగతం పలికింది. మెరుపు వరదలతో దారుణంగా దెబ్బతిని సర్వనాశనమైన నదీతీర ప్రాంతాల పునర్‌నిర్మాణంతోపాటు దేశాభివృద్ధి కోసం నేపాల్‌కు భారీ సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. 24,000 కోట్ల నేపాలీ రూపాయల విలువైన ఆర్థికప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు.
ఇందుకు ఢిల్లీలో జరిగిన ఇరుదేశాల అగ్రనేతల ద్వైపాక్షిక చర్చల భేటీ వేదికైంది. సోమవారం ఢిల్లీలోని నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో భారత ప్రధాని మోదీ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మెరుపు వరదల విలయంతో అల్లాడిపోయిన నేపాల్‌కు అన్నివేళలా అండగా ఉంటామని మోదీ షాకు హామీ ఇచ్చారు. నేపాల్ పునర్‌అభివృద్ధి కోసం వేలకోట్ల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా 8 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ సాయంతో నేపాల్‌లో పూర్తిచేసుకున్న రెండు ఇంధన ప్రాజెక్టులను ఇరునేతలు వర్చువల్‌గా ప్రారంభించారు. 669 మెగావాట్ల సామర్థ్యమున్న అరుణ్ హైడ్రో–ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇందులో ఉంది. మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. కీలక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగించాలని నేతలు నిర్ణయించారు.
ఆర్థిక సహకారం, ఇంధనం, జల వనరులు, వాతావరణ మార్పులను తట్టుకోవడం, అనుసంధానం, సాంకేతికత, ఆరోగ్యం తదితర రంగాల్లో భాగస్వామ్యం కోసం ‘వికసిత్ భారత్, సమున్నత నేపాల్: భాగస్వామ్యానికి సరికొత్త భాష్యం’పేరిట దార్శనిక పత్రాన్ని విడుదలచేశారు. ఈ సందర్భంగా సంయుక్త మీడియా సమావేశంలో మోదీ ప్రసంగించారు.
ఇది బంధం కాదు..బంధుత్వం
‘‘మన రెండుదేశాల మధ్య ఉన్నది కేవలం బంధం కాదు. బంధుత్వం. పొరుగుదేశాల మధ్య అచంచలమైన నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో సంతోషాలను పంచుకున్నాం.ఇప్పుడు సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందాం. ఒకరి అభివృద్ధిలో మరొకరం భాగస్వాములం. కష్టకాలంలో ఒకరినొకరం సాయంచేసుకున్నాం. ఇప్పుడు నేపాల్‌కు భూకంప అనంతర పునర్‌నిర్మాణం కోసం 5,600 కోట్ల నేపాల్ రూపాయలు, ఇంధనరంగం ప్రాజెక్టుల కోసం రుణం రూపంలో 18,400 నేపాలీ రూపాయలు సాయం చేయబోతున్నాం.
ఫోరెన్సిక్ సైన్స్ మొదలు ఆరోగ్యం, సుస్థిర పట్టణాభివృద్ధి, మత్స్య పరిశ్రమ దాకా పలు రంగాల్లో సహకారం ద్విగుణీకృతం కాబోతోంది’’అని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు సీమాంతర సరయూ–కమల ఎక్స్‌ప్రెస్ రైలు సర్విస్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ఇరునేతలు ప్రారంభించారు. ఈ రైలు ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని మాత్రమేకాదు ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి, రామాయణ సర్క్యూట్ అభివృద్ధిలో కీలకంగా మారుతుందని మోదీ అన్నారు. బౌద్ధ, శివ–శక్తి ఆధ్యాతి్మక టూరిజం సర్క్యూట్లను సైతం ఇలాగే అభివృద్ధిచేయాలని నేతలు నిర్ణయించారు.
పలు రంగాల్లో మరింత భాగస్వామ్యం
గుజరాత్‌లోని కాండ్లాలో ఉన్న దీన్‌దయాళ్ పోర్ట్ ద్వారా నేపాల్‌కు వాణిజ్యాన్ని పెంచుతామని మోదీ తెలిపారు. నేపాల్‌కు ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ సైతం సరుకు రవాణాలో తగు విధంగా సాయపడనుందని భారత విదేశాంగ శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల మధ్య నూతన రైల్వేలైన్ల ఏర్పాటు, వంతెనల నిర్మాణం, సమీకృత చెక్‌పోస్ట్‌లు, పెట్రోలియం పైప్‌లైన్ల ఏర్పాటు అంశాలపై మోదీ, షా చర్చలు జరిపారు.
సరిహద్దు వివాదాల పరిష్కారానికి కృషిచేయాలని తమ తమ విదేశాంగశాఖ కార్యదర్శులకు ఇరుదేశాల అగ్రనేతలు ఈసందర్భంగా సూచించారు. సరిహద్దు రాళ్ల నిర్వహణ, మరమ్మతులపై నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. సరిహద్దు వివాద పరిష్కారం కోసం చైనా, బ్రిటన్‌ల జోక్యం మంచిదని గతంలో బాలేంద్రషా చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల దౌత్యబంధం బలహీనమైన విషయం విదితమే. ‘‘పరస్పర గౌరవం, అచంచల విశ్వాసం, గొప్ప సద్భావనలతో ఇరుదేశాల మధ్య బంధం హిమాలయాలంత ఎత్తులో, సముద్రాలంత విశాలంగా విస్తరించింది.
వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు, కష్టకాలంలో భారత్ ప్రతిసారీ నేపాల్‌ను అన్ని విధాలుగా ఆదుకుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి, భారతీయులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’అని నేపాల్ ప్రధాని షా వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాలేజీని నేపాల్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే టాంజానియాలో ఐఐటీ మద్రాస్, యూఏఈలో ఐఐటీ ఢిల్లీ కాలేజీలను ఏర్పాటుచేయడం తెల్సిందే. తాజా నిర్ణయంతో మూడో ఐఐటీ కాలేజ్ నేపాల్‌లో ఏర్పాటు కాబోతోంది.
కొత్తగా సరిహద్దు వంతెన ప్రారంభం
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాను నేపాల్‌లోని దార్చుల్లా జిల్లాను అనుసంధానిస్తూ కాళీ నదిపై కొత్తగా నిర్మించిన 110 మీటర్ల మోటార్ వంతెనను వర్చువల్‌గా మోదీ, షా ప్రారంభించారు. కొత్త వంతెనతో నేపాల్ పౌరులు భారత్‌లోకి సులభంగా ప్రవేశించనున్నారు. పశ్చిమనేపాలీల రాకతో తమ వ్యాపారం దెబ్బతింటుందని ఉత్తరాఖండ్ వ్యాపారసంఘాలు గగ్గోలుపెడుతున్న వేల కొత్త వంతెన అందుబాటులోకి రావడం గమనార్హం. పితోర్‌గఢ్ వెంట నేపాల్‌ను కలుపుతూ నిర్మించిన తొలి కమర్షియల్ స్టీల్ బ్రిడ్జి ఇదేకావడం విశేషం. 2022లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు.
కలంకారీ పెయింటింగ్ బహూకరణ
భేటీ తర్వాత బాలేంద్ర షాకు ప్రధాని మోదీ పలు బహుమానాలను అందజేశారు. శ్రీకాళహస్తిలో ప్రఖ్యాతిగాంచిన కలంకారీ శైలిలో రూపొందించిన సంపూర్ణ రామాయణం పెయింటింగ్‌ను షాకు బహూకరించారు. వస్త్రంపై సహజ వర్ణాలతో వెదురు కలంతో వేసే చిత్రాలను కలంకారీ శైలిగా పేర్కొనడం తెల్సిందే. రాముని జననం మొదలు రావణుని మరణం దాకా రామాయణంలోని కీలకఘట్టాలను ఈ వస్త్రంపై అద్భుతంగా చిత్రించారు. దీంతోపాటు జరీ వర్క్‌తోచేసిన బెనారస్ సిల్క్ కండువాను గంధపు చెక్కతో తయారుచేసిన చిన్న పెట్టెలో పెట్టి ఇచ్చారు. వారణాసి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గంగాజలాన్ని ఒక పాత్రతోసహా ప్యాక్‌చేసి అందజేశారు. శివుని ప్రఖ్యాత ఆలయాలైన కాశీ విశ్వనాథ్, కఠ్మాండులోని పశుపతినాథ్ ఆలయాలను స్మరింపజేసేలా వారణాసి నుంచి గంగాజలాలను బహూకరించారు.


