నేపాల్‌ స్నేహగీతం | Sakshi Editorial on Nepal Prime Minister Balendra Shah arrived in New Delhi | Sakshi
Sakshi News home page

నేపాల్‌ స్నేహగీతం

Nov 24 2026 3:47 AM | Updated on Nov 24 2026 3:47 AM

Sakshi Editorial on Nepal Prime Minister Balendra Shah arrived in New Delhi

అధికారంలోకొచ్చిన ఎనిమిది నెలల తర్వాత, తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా ఆదివారం ఢిల్లీ వచ్చారు. రెండు రోజుల పర్యటన ముగింపులో సోమవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాలమధ్యా పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల సంబంధాలూ హిమాలయాలంత పటిష్టమైనవని బాలేంద్ర ఈ సందర్భంగా అనడం ఆయన మారిన వైఖరికి అద్దంపడుతుంది. తమ పాలకులు భారత్‌కు బానిసల్లా పడివుంటున్నారని అనడం నేపాల్‌ విపక్ష నేతలకు అలవాటుగా మారింది.

బాలేంద్ర షా కూడా ఆ తానులో ముక్కే. ఇలాంటి బాపతు ప్రసంగాలతోనే ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. ఒక దశలో భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి బ్రిటన్, చైనాల తోడ్పటుకోరే స్థాయికి ఆయన వెళ్లారు. మొన్న మార్చిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్రీ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)లో చేరారు. అధికారంలోకొస్తూనే ఆంతరంగిక సమస్యలైన బంధుప్రీతి, అవినీతి పనిబట్టడం, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు పూర్తయినాకే విదేశీ పర్యటన లకు వెళ్లాలని నిర్దేశించారు.

మొన్న మే నెలలో మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ కఠ్మాండూ వెళ్లాల్సివుండగా, ఆయన్ను కలిసేందుకు బాలేంద్ర నిరాకరించారు. ఆఖరికి భారత్‌లో అమెరికా రాయబారిగా ఉంటూ అదనంగా దక్షిణ, మధ్య ఆసియా దేశాల దౌత్యవేత్తగా వ్యవహరిస్తున్న సెర్జియో గోర్‌కు సైతం ఇదే అనుభవం ఎదురైంది. ఈ పరిణామాలు తమనే ఇరకాటంలో పెడతాయని తెలుసుకోవటానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు. ఆర్‌ఎస్‌పీ అధ్యక్షుడు రబి లామిఛానె, నేపాల్‌ విదేశాంగమంత్రి శిశిర్‌ ఖనాల్‌  దెబ్బతిన్న సంబంధాల్ని మరమ్మతు చేసే పనిలో భాగంగా ఆ మరుసటి నెలలో మన దేశం వచ్చారు. 

ఆర్థికంగా గడ్డుస్థితిలో ఉంటూ అలిగితే, అనవసర ఘర్షణలకు దిగితే చివరకు నష్టపోతామని తెలుసుకోవటానికి నేపాల్‌ పాలకులకు ఎంతోకాలం పట్టలేదు. అమెరికా అకారణంగా ఇరాన్‌తో మొదలెట్టిన యుద్ధం పర్యవసానంగా వంటగ్యాస్, ఎరువుల ధరలు ఆకాశాన్నంటడమేకాక... వాటి లభ్యత పడిపోవటంతో జనంలో అలజడులు మొదలయ్యాయి. భారత్‌తో జగడంవల్లే ఈ గడ్డు పరిస్థితులేర్పడ్డాయన్న విమర్శలు బయల్దేరాయి. ఆగస్టులో హఠాత్తుగా విరుచుకుపడిన వరదలు 7,500మంది ప్రాణాలు తీయగా, మరో 9,000మంది గాయపడ్డారు. ఆస్తినష్టం కూడా అపారంగానే ఉంది. ఆ వెంటనే మన దేశం హుటాహుటీన సహాయ సిబ్బందితోపాటు మందులు, ఆహారం, ఇతర వైద్యసామగ్రి పంపింది. ఆర్థిక సహాయం ప్రకటించింది. 

అధికార పీఠం ఎక్కాక బాలేంద్రకు క్రమేపీ అంతా బోధపడటం మొదలైంది. భారత్‌ తోడ్పాటులేనిదే అడుగు ముందుకేయటం అసాధ్యమని అర్థమైంది. ఎందుకంటే అత్యధిక నేపాల్‌ ఉత్పత్తుల గమ్యస్థానం మన దేశమే. అక్కడ ఉత్పత్తయ్యే సరుకులో
80 శాతం మనకే చేరుతుంది. అక్కడి విదేశీ పెట్టుబడుల్లో మూడోవంతు మనదే. ఏటా 1,200 మెగావాట్ల విద్యుత్‌ మన దేశం కొనుగోలు చేస్తుంది. పలు జలవిద్యుత్‌ ప్రాజెక్టుల అభివృద్ధిలో భారత్‌ కంపెనీలదే ప్రముఖపాత్ర. మన సైన్యంలో నేపాల్‌కు చెందిన గూర్ఖాలకు ప్రాముఖ్యత ఉంటుంది. విద్య, క్రీడలు, టూరిజం వగైరా రంగాల్లో మన దేశం చేయూత నిస్తోంది. ఆ దేశాన్ని సందర్శించే విదేశీయుల్లో మనవారి సంఖ్య అత్యధికం.  

నేపాల్‌లో భారత వ్యతిరేకతను పెంచి పోషించటానికి చైనా చేయగలిగిందంతా చేస్తోంది. దానికితోడు నేపాల్‌ విషయంలో మన వ్యవహార శైలి కూడా సక్రమంగా లేదు. నెహ్రూ కాలంనుంచీ ఇదే కొనసాగుతోంది. 1997లో అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్‌ నేపాల్‌ పర్యటన తర్వాత 2014లో మోదీ వచ్చేవరకూ మన నేతలెవరూ ఆ దేశాన్ని సందర్శించ లేదు. మరోపక్క నేపాల్‌తో ఉండే సమస్యలు చిన్నవేం కాదు. ఆ సరిహద్దుల మీదుగా వచ్చిపడే మాదకద్రవ్యాలు మనకు పెను సమస్య. అక్రమంగా డబ్బు తరలింపులు సరేసరి. ఇవిగాక భారత్‌లోని ఫలానా ప్రాంతాలు తమవేనంటూ నేపాల్‌ అడపా దడపా పేచీకి దిగుతోంది. మెరుగైన సంబంధాలుంటే కొంత ఆలస్యమైనా వీటిని చక్కదిద్దటం సులభం. నేపాల్‌ ప్రధాని తాజా పర్యటన అందుకు దోహదపడుతుందని ఆశించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement