శ్రమ – సుఖం – శూన్యం | This progress achieved by man is undoubtedly a triumph of civilization | Sakshi
Sakshi News home page

శ్రమ – సుఖం – శూన్యం

Nov 23 2026 2:44 AM | Updated on Nov 23 2026 2:44 AM

This progress achieved by man is undoubtedly a triumph of civilization

బస్సుల్లో ఎలక్ట్రానిక్‌ టికెటింగ్‌ మెషీన్లు రాకముందు, కండక్టర్లు కొట్టిన సన్నటి, పలుచటి రంగుల టికెట్లు గుర్తున్నాయా? దానిదైన ధర, పంచ్‌ చేయడానికి అనుగుణంగా స్టేజీనంబర్లతోపాటు, ఆ టికెట్‌కంటూ ఒక ప్రత్యేక సంఖ్య ఉండే వీటిని కోటానుకోట్లు ముద్రించేవారు. రిజర్వ్‌ బ్యాంకుకు కరెన్సీ ఎంతో, ఆర్టీసీకి ఈ టికెట్లు అంత! ఎక్కడా సిరా మార్కు చెదరకుండా, వచ్చిన సంఖ్యలు పొరపాటున తిరిగి రాకుండా ముద్రించే వీటిల్లో ఉన్నది అత్యంత జాగరూకతతో కూడిన పనితనం మాత్రమే కాదు, అనూహ్య మైన మానవ శ్రమ కూడా. ఇదింకా అత్యాధునికపు మాట. అంతకుముందు? 

ఈ రోజు మనం వేలితో తెరను తాకితే జరిగిపోయే పనికి, ఒకప్పుడు మనిషి తన శరీరాన్నే యంత్రంగా మార్చుకోవాల్సి వచ్చేది. పొలం దున్నాలంటే ఎద్దులతో పాటు మనిషి ఎండలో చెమటోడ్చాలి. బియ్యం కావాలంటే రోకళ్లతో చేతులు పడిపోయేట్టు వడ్లు దంచుకోవాలి. బట్ట నేయాలంటే గంటల తరబడి మగ్గం ముందు కూర్చోవాలి. ఒక ఉత్తరం చేరాలంటే రోజులూ, వారాలూ ఎదురుచూడాలి. దూరప్రాంతానికి వెళ్లాలంటే రోజుల తరబడి నడవాలి. అందుకే ఏ సుదూరంలోని పుణ్యక్షేత్రానికో వెళ్లిన మనిషికి జనం పాదాభివందనం చేసేవారు. అది ఆ మనిషికి, ఆ మనిషి పడిన శ్రమకు తమ గౌరవం తెలియజేసిన విధం. మన పూర్వీకులు ఎంత శ్రమపడితే ఈ ప్రపంచం ఇక్కడిదాకా వచ్చిందీ మనం దాని పూర్ణరూపంతో ఇప్పుడు ఊహించలేకపోవచ్చు. ఒకప్పుడు శ్రమ జీవితంలో భాగం కాదు, జీవితాన్ని శాసించిన ప్రధాన శక్తి.

సాంకేతికత ఈ సమీకరణాన్ని సమూలంగా మార్చేసింది. యంత్రాలు మనిషి కండ బలానికి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. రవాణా సాధనాలు దూరాన్ని కుదించేశాయి. కంప్యూటర్లు సమాచార ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చాయి. కృత్రిమ మేధ మనిషి ఆలోచనా శ్రమలోనూ కొంత భాగాన్ని పంచుకుంటోంది. ఒకప్పుడు రోజులు పట్టే పనులు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. మనిషి సాధించిన ఈ పురోగతి నిస్సందేహంగా నాగరికత విజయమే. కానీ ఈ విజయంతోపాటే ఒక విచిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. సౌకర్యం అలవాటుగా మారిపోయింది.

అవకాశాలు పెరిగి, ఆనందాన్ని ఆస్వాదించడం తగ్గిపోయింది. ఏదీ అపురూపంగా అనిపించని స్థితికి చేరుకున్నాం. ఆధునిక మనిషి ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం ఇదే. దూరం తగ్గింది,అంతరం పెరిగింది. వస్తువుల కొరత తీరింది, సంతృప్తి కొరవడింది. ఒక్క చీర ఉంటే ప్రత్యేకం. బీరువా నిండా ఉంటే? ఇప్పుడు కనీసం దేవుడి కోసం కూడా కొండ ఎక్కం. నేరుగా గర్భగుడిదాకా వాహనం వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జీవితాన్ని అనుభవించడం మర్చిపోయామా?

ఒకప్పుడు ఫలానా పుస్తకం దొరక్క, దానికోసం దుకాణాలు వెతికి, లైబ్రరీ కోసంరెండు మూడుసార్లు ఎండలోనో ముసురు తగ్గాకనో అంతదూరం నడిచివెళ్లి, ఆ లైబ్రేరియన్‌ ముఖ కవళికలు, చుట్టూ ఉన్న జనం అన్నింటినీ దాటి, ఎప్పటికో ఆ పుస్తకం చేతిలోకి వచ్చినప్పుడు– ఆ పుస్తకంలో ఉన్న విషయంతో పాటు ఆ పుస్తకం చుట్టూ ఉండే ఈ ఆరా అంత విశేషమైపోతుంది. కొరత మాత్రమే దాన్ని విలువైనదిగా మార్చలేదు. ఆ అనుభవం చుట్టూ ముడిపడిన చిన్న చిన్న అనుభవాల సారమే ఒక పెను అనుభవ మయ్యేది. పాతకాలం పెద్దవాళ్లు ఏ భగవద్గీత శ్లోకమో సందర్భానుసారం చెప్పేస్తారు. వాళ్లు గుప్పెడు పుస్తకాలు కూడా చదివి వుండకపోవచ్చు. 

కానీ వాటిలోని ప్రతీ అక్షరం గుర్తుండేట్టుగా చదువుతారు. ఇప్పుడు ఒక్క క్లిక్‌లో పుస్తకం, ఒక్క బ్రౌజ్‌లో సినిమాఅందుబాటులోకి వస్తున్నాయి. అయినా మనసు నిండుతోందా? చదివింది మనసు కెక్కక, చూసింది ఫీల్‌ కాక, తిన్నది ఒంటబట్టక, చేస్తున్నది మనస్కరించక, ఏదీ అపురూపం కాని జీవితంలో దేనికోసం అర్రులు చాస్తున్నట్టు? మరేమిటి దారి? సాంకేతికతను తిరస్కరించడం ద్వారా ఈ వెలితిని పూడ్చుకోలేం. దాని వల్ల లభించిన సౌకర్యాల విలువను గుర్తించడం ద్వారా; శ్రమను కేవలం తప్పించుకోవాల్సిన భారంగా కాకుండా, జీవితానికి అర్థాన్నిచ్చే అనుభవంగా చూడటం ద్వారా; అన్నీ సులభంగా లభించే ప్రపంచంలో జీవితానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతను చూపడం ద్వారానే మన అనుభవాలకు అపురూపతను అద్దగలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement