మళ్లీ క్వాడ్‌ హడావుడి! | Quad makes headlines again after two years | Sakshi
Sakshi News home page

మళ్లీ క్వాడ్‌ హడావుడి!

Nov 19 2026 12:26 AM | Updated on Nov 19 2026 12:26 AM

Quad makes headlines again after two years

రెండేళ్ల తర్వాత మళ్లీ క్వాడ్‌ పతాక శీర్షికలకు ఎక్కింది. ఇన్నాళ్లూ అది ఉనికిలో లేదన్నట్టే ప్రవర్తించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన క్వాడ్‌ అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చొద్దనీ, వ్యాపార కార్యకలాపాలకు ఆంక్షల సంకెళ్లొ ద్దనీ చైనాకు ఈ సమావేశం పరోక్ష సందేశం పంపింది. అలాగే క్వాడ్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం ఏర్పాటుచేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దాంతోపాటు ‘సత్తువతోనే శాంతి’ సాధ్యమని తెలిపేలా సముద్రజలాల్లో విమాన గస్తీ విన్యాసాలు 2027లో నిర్వహించ బోతున్నట్టు ట్రంప్‌ తెలిపారు. 

క్వాడ్‌ సభ్యదేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లలో కాక, ఇందులో భాగస్వామ్యంలేని ఫిలిప్పీన్స్‌లో సదస్సు నిర్వహించటం ఒక్కటే ఆసక్తికర విషయం. చైనాకు సన్నిహితమై, అందువల్లకలిగే లాభాలపై కన్నేసిన ట్రంప్‌... రెండో దఫా ఏలుబడి మొదలెట్టాక క్వాడ్‌ను పూర్తిగా విస్మరించారు. ఇప్పుడుఈ సదస్సు నిర్వహణ కూడా ఆయన వైఖరి మారడంవల్ల కాదు. 

గురువారం చైనాలోని షెన్‌జెన్‌లో జరగబోయే ఆసియా–పసిఫిక్‌ దేశాల సహకార సదస్సు సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌లతో తాను నిర్వహించే త్రైపాక్షిక సమావేశా నికి ముందు ఇది అవసరమని ట్రంప్‌ భావించారు. చైనాతో ‘సమర్థవంతంగా’ బేరసారా లాడటానికి క్వాడ్‌ పనికొస్తుందన్నది ఆయన వ్యూహం. అందుకే ఆదరాబాదరాగా అమెరికా దీన్ని నిర్ణయించింది. దాంతోపాటు ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో జనం విశ్వాసాన్ని కోల్పోయిన ట్రంప్‌ అంతర్జాతీయంగా ఏదో చేస్తున్నట్టు కనబడటానికి కూడా దీన్ని వినియోగించుకున్నారు. 

 దక్షిణ చైనా సముద్రంలో నౌకా రవాణాను అడ్డగిస్తూ యథాతథ స్థితికి ఆటంకాలు కల్పిస్తున్న చైనా తీరుపై జపాన్‌కు మొదట్నించీ ఆగ్రహం ఉంది. చైనా చర్యలతో ప్రధానంగా నష్టపోతున్నది ఆ దేశమే మరి. 2007లో అమెరికా ప్రోద్బలంతో ఆవిర్భవించిన క్వాడ్‌ ప్రయాణం పడుతూ లేస్తూనే సాగింది. అదే ఏడాది జపాన్‌లో షింజో అబే నిష్క్రమించి టారో అసో ప్రధానిగా వచ్చారు. ఆయన క్వాడ్‌నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది ఆస్ట్రేలియాలో అధికార మార్పిడి జరిగి జాన్‌ హోవార్డ్‌ స్థానంలో కెవిన్‌ రుడ్‌ వచ్చారు. అది కూడా క్వాడ్‌కు మంగళం పాడింది. అలాంటి సంస్థకు 2017లో మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసింది ట్రంపే. ఈలోగా దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలా పాలు పెంచింది. అక్కడి పగడాల దిబ్బలూ, ఇసుక దిబ్బలూ తనవేనని ప్రకటించి, స్ప్రాట్లీ దీవులచుట్టూ ఏడు కృత్రిమ దీవుల సమాహారాన్ని పూర్తిచేసింది. తనను మించిపోతున్న చైనాను కట్టడి చేయాలంటే దాంతో సమస్యలున్న దేశాలను కూటమిగా ఏకం చేసి ఒత్తిడి పెంచాలన్నదే ఆనాటి అమెరికా వ్యూహం. 

క్వాడ్‌ పురుడుపోసుకున్నప్పుడే చైనాకు పరిస్థితేమిటో అర్థమైంది. తనకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారంటూ నాలుగు దేశాలకూ దౌత్యపరంగా నిరసన తెలియ జేసింది. అలాగని ఆవిర్భావంనుంచీ దేన్నీ నేరుగా చెప్పడానికి క్వాడ్‌ సిద్ధపడలేదు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పరోక్ష హెచ్చరికలే తప్ప, నిర్దిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది లేదు. ఆ పని జరిగితే చర్చలు మొదలై ఏదో ఒక అంగీకారం సాధ్యపడేది.రెండోసారి అధికారంలోకొచ్చాక ట్రంప్‌ క్వాడ్‌ను గాలికొదిలేశారు. తన వ్యూహానికి దాన్నొక ఉపకరణంగా వాడుకునే ఇలాంటి ధోరణిని అమెరికా విడనాడనంతకాలం క్వాడ్‌ ‘కాగితం పులే’.  

ఇప్పుడు అమెరికా, చైనా, రష్యా అధినేతలమధ్య జరగబోయే త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్‌ మిత్రదేశాలతో మాట్లాడిందేమీ లేదు. చైనా, రష్యాలతో వాటికున్న సమస్య లేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇది క్వాడ్‌ మనుగడపై సందేహాలు తలెత్తేలా చేస్తుందన్న స్పృహ ఆయనకు లేదు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా కీలక ఖనిజాల ఎగుమతుల్ని ప్రోత్సహించాల్సిన చైనా, అందుకు భిన్నంగా ఆంక్షలు విధించటాన్ని మనతోపాటు ప్రపంచ దేశాలన్నీ నిరసిస్తున్నాయి. ఈ విషయంలో క్వాడ్‌వంటి కూటముల్ని నమ్ముకోవాలో, ద్వైపాక్షింగా చైనాతో అంగీకారానికొస్తే మంచిదో ఎవరికి వారు తేల్చుకునే స్థితి ట్రంప్‌ కల్పించారు. ఆర్భాటాన్ని పక్కనబెట్టి చూస్తే క్వాడ్‌ శిఖరాగ్రం సాధించింది పెద్దగా ఏంలేదని అర్థమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement